► బెంగాల్, చెన్నై కేసుల్లో షణ్ముగం కింగ్ పిన్
► రూ.23 కోట్ల విలువైన దుంగలు స్వాధీనం
► విలేకరులతో ఎస్పీ ఘట్టమనేని శ్రీనివాస్
చిత్తూరు (అర్బన్): ‘పశ్చిమబెంగాల్, భూటాన్ సరిహద్దులో ఓ స్మగ్లర్‌ను పట్టుకుని ఎర్రచందనం దుంగల్ని స్వాధీనం చేసుకోవడం, మరో చోట దుంగలను పట్టుకుని స్మగ్లర్లను అరెస్టు చేయడంతో ఆపరేషన్ రెడ్ అంతమై పోదు. ఇది ఆరంభం మాత్రమే. మా దాడులు, దర్యాప్తులు, వేట కొనసాగుతూనే ఉంటుంది.’ అని జిల్లా ఎస్పీ ఘట్టమనేని శ్రీనివాస్ పేర్కొన్నారు. ఆదివారం చిత్తూరులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ మాట్లాడుతూ పది రోజుల క్రితం చెన్నైకు చెందిన బాలును అరెస్టుతో స్మగ్లర్ల గుట్టు బయటపడిందన్నారు.
పశ్చిమబెంగాల్‌కు చెందిన సౌందర్‌రాజన్‌ను అరెస్టు చేయడం, అక్కడ గోడౌన్లలో ఉన్న ఎర్రచందనం దుంగల్ని స్వాధీనం చేసుకున్నామన్నారు. అతనిచ్చిన సమాచారంతో చెన్నైకు చెందిన షణ్ముగం అనే కింగ్‌పిన్‌ను పట్టుకుని రెడ్‌హిల్స్, మింజూరు, సిప్‌కో, గాంధీనగర్, అలియాభట్ ప్రాంతాల్లో దాడులు చేశామన్నారు. ఈ మొత్తం వ్యవహారంలో షణ్ముగం, సౌందర్‌రాజన్, శరవణన్, ఆనందన్, కర్ణ, రవి, అప్పన్‌రాజ్ అనే ఏడుగురు పేరు మోసిన స్మగ్లర్లను అరెస్టు చేశామన్నారు.
ఈ ఏడుగురిని నుంచి 500 ఎర్రచందనం దుంగలు, ఎనిమిది దేశాలకు చెందిన కరెన్సీ నోట్లు, రూ.80 వేల నగదు, అయిదు వాహనాలను స్వాధీనం చేసుకున్నామన్నారు. నిందితుల నుంచి భారీ ఎత్తున నగదు లావీదేవీలు జరిగినట్లు ప్రాథమిక విచారణలో నిర్దారణ అయ్యిందని ఎస్పీ తెలిపారు. అయితే నిందితులు ఏయే రూపంలో ఇతర ప్రాంతాల్లోని వ్యక్తులకు నగదు పంపించారనే వివరాలు తెలియాల్సి ఉందన్నారు. ఎక్కడ ఎలా నగదు ఇచ్చి పుచ్చుకున్నారనే దానిపై డెరైక్టర్ ఆఫ్ రెవెన్యూ ఇంటలిజెన్స్ (డీఆర్‌ఐ)తో కలిసి విచారిస్తామన్నారు.
పోలీసులకు రివార్డులు...
చెన్నై, పశ్చిమబెంగాల్ ప్రాంతాల్లో నిర్వహించిన దాడులు, దుంగల స్వాధీనంలో జిల్లాకు చెందిన 60 మంది పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నట్లు ఎస్పీ తెలిపారు. ఓఎస్డీ రత్న నుంచి డీఎస్పీలు గిరిధర్, గిరిధర్‌రావు, రామకృష్ణ, సీఐలు చంద్రశేఖర్, మహేష్, నర్సింహులు, ఎస్‌ఐలు, కానిస్టేబుళ్లకు ఎస్పీ చేతుల మీదుగా రివార్డులు అందచేశారు.
ఆపరేషన్ రెడ్‌లో పోలీసుల తీరు భేష్
Published Mon, Apr 27 2015 4:38 AM | Last Updated on Tue, Aug 21 2018 7:26 PM
Advertisement