సభ అభిప్రాయం అంటే ఓటింగే: మైసూరారెడ్డి
హైదరాబాద్: తెలంగాణ బిల్లు లేక రాష్ట్రపతి నోట్పై శాసనసభ అభిప్రాయం తెలియజేయడం అంటే ఓటింగేనని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సెంట్రల్ గవర్నింగ్ కౌన్సిల్ సభ్యుడు ఎం.వి.మైసూరా రెడ్డి స్పష్టం చేశారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన ఈరోజు విలేకరులతో మాట్లాడారు. నిబంధనల ప్రకారం చిత్తశుద్ధితో రాష్ట్రపతి సూచనల మేరకు బిల్లుపై సభ్యుల అభిప్రాయంతోపాటు శాసనసభ అభిప్రాయం ఓటింగ్ ద్వారా తెలియజేయాలని శాసనసభాపతిని కోరారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్‌వ్యవస్థీకరణ ముసాయిదా బిల్లు-2013 (తెలంగాణ బిల్లు) విషయంలో కేంద్ర ప్రభుత్వం వంకరటింకరగా వ్యవహరిస్తోందన్నారు. సాంప్రదాయబద్దంగా వ్యవహరించాలని ఆయన కోరారు.
ఇది చరిత్రాత్మకమైన బిల్లు అని, దీనిపై చర్చించడానికి తగిన సమయం కావాలన్నారు. అందువల్ల శాసనసభ ప్రత్యేక సమావేశాలు నిర్వహించి, బిల్లుపై చర్చించాలని ఆయన కోరారు. సభ అభిప్రాయం అంటే ఓటింగేనని చెప్పారు. అభిప్రాయాలు చెప్పడం కోసం విప్ జారీ చేయవలసిన అవసరంలేదన్నారు. ప్రతి సభ్యుడి అభిప్రాయం అవసరం అన్నారు. సభ్యులు పార్టీలకు అతీతంగా అభిప్రాయాలు చెప్పాలని కోరారు.
తెలంగాణ బిల్లు ఒక శాఖ నుంచి మరో శాఖకు పంపే తీరును, అందుకు అనుసరించే పద్దతులను మైసూరా రెడ్డి తప్పుపట్టారు. యుద్ద విమానంలో యుద్ధప్రాతిపదికన బిల్లును ఇక్కడకు పంపించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దానిని పరిశీలించి ముఖ్యమంత్రికి పంపారు. ముఖ్యమంత్రి సంతకం చేసి గవర్నర్కు పంపారు. గవర్నర్ మళ్లీ దానిని ముఖ్యమంత్రికి పంపారు. ఆయన మళ్లీ దానిపై సంతకం చేసి శాసనసభ స్పీకర్కు పంపారు. శుక్రవారం మధ్యాహ్నం 2 గంటలకు శాసనసభకు చేరింది. ఈ బిల్లు లేక రాష్ట్రపతి నోట్ నాలుగు చోట్లకు వెళ్లడం చెకచెకా జరిగిపోయింది. నిద్రపోయే సమయం తీసివేస్తే పది గంటల్లోనే ఇదంతా జరిగింది. సాదారణ పరిస్థితులలో అయితే ఇందుకు కనీసం నాలుగు రోజులు పడుతుంది. నిబంధనలకు విరుద్ధంగా సచివాలయంలో రాత్రి కూడా పని చేసి ఈ తతంగం పూర్తి చేశారు. ఇది ఫెడరల్ స్పూర్తికి విరుద్దం అని చెప్పారు.
సమైక్యవాద ఛాంపియన్ అని చెప్పుకునే ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఈ బిల్లు ఏ విధంగా ఈ నాలుగు చోట్లకు నడిచిందో తెలియజెప్పాలని మైసూరా రెడ్డి డిమాండ్ చేశారు. దీపం గాలిలోపెట్టి ఆరిపోకుండా చూడమని అందరికి చెప్పినట్లు సీఎం తీరు ఉందని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల బాధ్యుడు దిగ్విజయ్ సింగ్ మీ మెడమీద కత్తి పెట్టినందున మీరు దీనిని ఇంత త్వరగా స్పీకర్కు పంపారా? అని ప్రశ్నించారు. మీరు సమైక్యవాదానికి కట్టుబడి ఉంటే ఇటువంటి పని చేస్తారా? అని ఆయన అడిగారు.