- కోర్టు ఆదేశాలను పక్కన పెట్టి ప్రహరీ నిర్మాణం
- పోలీసులకు మౌఖిక ఆదేశాలు!
కాకినాడ క్రైం : తెలుగు తమ్ముళ్లు బరితెగించి కబ్జాలకు తెరలేపుతున్నారు. కాకినాడ జగన్నాథపురం శివారు యాళ్లవారి గరువు సమీపంలోని స్థలం తమదని పత్రాలు సృష్టించి ఆక్రమించుకునేందుకు ప్రయత్నించడంతో.. అప్పటికే దానిని వినియోగించుకుంటున్న స్థానికులు ఎదురు తిరిగిన సంగతి తెలిసిందే. నాలుగు వారాల పాటు ఆ స్థలంలో ఎటువంటి కట్టడాలూ నిర్మించరాదని ఈ నెల 19న హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. అయినా తెలుగు తమ్ముళ్లు ఏ మాత్రం వాటిని ఖాతరు చేయకుండా ఆ స్థలానికి రాత్రికి రాత్రే ప్రహరీ నిర్మించేశారు.
ఇదేమని అడిగిన స్థానికులపై దౌర్జన్యానికి తెగబడ్డారు. అయితే స్థానిక టీడీపీ ముఖ్యనేత అనుచరులు కబ్జాకు యత్నించడంతో పోలీసులు కూడా ఏమీపట్టనట్టు వ్యవహరిస్తున్నారు. తమపై టీడీపీ ముఖ్యనేత అనుచరులు దాడికి పాల్పడ్డారని, తమలో ఒకరు గాయపడ్డారని పోలీసులకు విన్నవించుకున్నప్పటికీ తామేమీ చేయలేమని పోలీసులు చేతులెత్తేయడం విమర్శలకు తావిస్తోంది. టీడీపీ నేత అటువైపు వెళ్లవద్దని పోలీసులకు మౌఖిక ఆదేశాలు జారీ చేయడంతోనే ఈ పరిస్థితి తలెత్తిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమకు రక్షణ లేకుండా పోయినా పోలీసులు కూడా ఏ మాత్రం పట్టించుకోవడం లేదని కన్నీటి పర్యంతమవుతున్నారు.
అది సివిల్ వివాదం కావడంతో తామేమీ చేయలేమని పోలీసు అధికారులు చెప్పడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అయితే టీడీపీ నేత అనుచరులు మాత్రం హవా కొనసాగిస్తున్నారు. ఆ స్థలం చుట్టూ ప్రహరీని నిర్మించి, అక్కడ ఎవరూ లేకుండా చేయా లనే లక్ష్యంతో దౌర్జన్యానికి తెగబడుతున్నారు. ఇదిలావుండగా ఆ స్థలాన్ని వినియోగించుకుంటు న్న స్థానికులు కూడా అదే పట్టుతో అక్కడ గుడారాల కింద కాలం వెళ్లదీస్తున్నారు. ఆ స్థలంలో చేపలు, రొయ్యలు ఎండబెట్టుకుంటున్నారు. దీంతో ఇరువర్గాల మధ్య వివాదం ముదిరి పాకాన పడుతోంది. చుట్టుపక్కల వారు మాత్రం ఉత్కంఠతో చూస్తున్నారు. ఇంతటి ఉద్రిక్తత చోటుచేసుకున్న ఈ సంఘటనపై జిల్లా ఉన్నతాధికారులు ప్రత్యేక దృష్టి సారించాని స్థానికులు కోరుతున్నారు.
తెలుగు తమ్ముళ్ల బరితెగింపు
Published Sat, Nov 29 2014 12:52 AM | Last Updated on Tue, Aug 21 2018 5:46 PM
Advertisement
Advertisement