=సజేఎస్‌ఎఫ్ భూముల లీజు
=మామిడి చెట్ల నరికివేత
=8 మీటర్ల లోతు తవ్వి ఇసుక తరలింపు
=మామూళ్ల మత్తులో మైన్స్, రెవెన్యూ
తిరుపతి రూరల్ (చంద్రగిరి), న్యూస్‌లైన్: మూడు దశాబ్దాల క్రితం దళితులను ఆదుకోవడం కోసం ప్రభుత్వం సీజేఎస్‌ఎఫ్ పథకాన్ని ప్రవే శపెట్టింది. పది కుటుంబాలను ఒక సొసైటీగా ఏర్పాటు చేసి 30 ఎకరాల భూమిని కేటాయించింది. ఇందులో మామిడిచెట్లు పెంచుకుని ఫలసాయంతో బతకమని చెప్పింది. వారికి పంటపైన తప్ప భూమిపైన హక్కు ఉండదు. 30 ఎకరాల భూమి ఆర్డీవో పేరుపైన ఉంటుంది. ఈ పథకంతో దళితులు సంతోషించారు. 1979లో సొసైటీలుగా ఏర్ప డి భూములను పొందారు.
మామిడిచెట్లను నాటుకున్నారు. ఫలసాయం అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో తిరుపతి రూరల్ మండలం చిగురువాడ పంచాయతీలో సీజేఎస్‌ఎఫ్ (కమ్యూనిటీ జాయింట్ ఫార్మింగ్ సొసైటీ) కింద స్వర్ణముఖినది పక్కన 10 కుటుంబాలకు 30 ఎకరాల భూమిని ప్రభుత్వం కేటాయించింది. ఈ భూమిలో మామిడి తోట ఉంది. ఇందులో ఇసుక కూడా బాగుంది. దీనిపై ఇసుకాసురుల కన్ను పడింది. దళితులకు ఎర వేశారు. ఇసుకాసురుల మాయలో పడిన దళితులను ఆర్డీవో పేరుపైన ఉన్న ఆ భూమిని ఎకరం 12 లక్షల చొప్పున అనధికారికంగా లీజుకు ఇచ్చేశారు.
దీంతో 20 అడుగుల ఎత్తున్న మామిడి చెట్లు, 50 అడుగుల ఎత్తున్న తాటి చెట్లు, వేత, మర్రి తదితర చెట్లను నేలమట్టం చేసి ఇసుకను లోడేస్తున్నారు. ఈ భూముల్లో 5 నుంచి 8 మీటర్ల లోతువరకు ఇసుకను తవ్వేశారు. వాల్టా చట్టం కింద వీరిపై చర్యలు తీసుకునే వీలున్నా రెవెన్యూ అధికారులు పట్టించుకోవడం లేదు. పస్తుతం ఇక్కడ 20 ఎకరాల్లో మామిడి చెట్లు మాయమై గుంతలు మాత్రమే కనిపిస్తున్నాయి. ఇక్కడ రోజుకు 500 ట్రిప్పుల ఇసుకను తరలిస్తున్నారని సమాచారం.
ట్రాక్టర్ ఇసుక వెయ్యి, రెండు వేలు
దళితుల నుంచి అక్రమంగా కొనుగోలు చేసిన భూముల్లోంచి తవ్విన ఇసుకను మూడు రకాలుగా విక్రయిస్తున్నారు. ట్రాక్టర్ ఇసుక రకాన్నిబట్టి వెయ్యి నుంచి రెండు వేల రూపాయల వరకు అమ్ముకొంటున్నారు. ఎకరం రూ.12 లక్షలకు కొని అందులోంచి 20 లక్షల నుంచి 25 లక్షలు వరకు ఇసుక అమ్మకంద్వారా లబ్ధిపొందుతున్నారు. ముందు ఇసుకను అమ్మిన తరువాతే డబ్బు ఇస్తున్నారని సమాచారం.
మామూళ్ల మత్తులో అధికారులు
ఆర్డీవో పేరిట దళితులకు కేటాయించిన ప్రభు త్వ భూముల్లో ఇసుకను అక్రమంగా తరలిస్తున్నా మైనింగ్, రెవెన్యూ, ఫారెస్ట్ అధికారులు పట్టించుకోవడం లేదు. వీరంతా మా మూళ్ల మత్తులో జోగుతున్నానే విమర్శలున్నాయి. అధికారులు, కాంగ్రెస్ పెద్దల అండ ఉండడంతో ఇసుకాసురులు రెచ్చిపోతున్నారు. ఈ భూమిలోని భారీ వృక్షాలను జేసీబీల సాయంలో కులదోస్తున్నా అధికారులెవ్వరూ పట్టించుకోవడం లేదనే ఆరోపణలున్నాయి.
తప్పుడు నివేదికలు
ఇసుక అక్రమాలపై జిల్లా అధికారులు నివేది కలు కోరినప్పుడు స్థానిక అధికారులు తప్పు డు నివేదికలు ఇస్తున్నారని రెవెన్యూలోని కొం దరు ఆరోపిస్తున్నారు. కలెక్టర్ వచ్చి నేరుగా పరిశీలిస్తే తప్ప అక్రమాలపై చర్యలు తీసుకునే పరిస్థితి కనిపించడంలేదు.
త్వరలో క్రిమినల్ కేసులు
ఇసుకను అక్రమంగా తరలిస్తున్న వారిపై క్రిమినల్ కేసులు పెట్టేందుకు చర్యలు చేపట్టాం. సీజేఎఫ్‌ఎస్ కింద ఇచ్చిన భూముల్లో ఇసుకను అమ్ముకునే అధికారం ఎవ్వరికీ లేదు. ఆర్డీవో పేరుమీద పట్టాలు ఉంటాయి. వీరు కేవలం పంటను అమ్ముకునేందుకే అర్హులు. మిగిలి ఉన్న 10 ఎకరాల్లో ఇసుక తరలింపును అడ్డుకునేందుకు చర్యలు చేపట్టాం. కలెక్టర్, ఇతర అధికారులకు ఇచ్చే నివేదికలో నిజాలు ఉండవనడం అవాస్తవం. ఇసుక అక్రమ రవాణాను అడ్డుకోవడమొక్కటే మా పనికాదు కదా. అన్నీ చూసుకోవాలి.
- వెంకటరమణ, తహశీల్దార్, తిరుపతి రూరల్ మండలం
పండ్ల తోటలపై.. ఇసుక గద్దలు
Published Sat, Nov 23 2013 1:50 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM
Advertisement