సాక్షి, అమరావతి: తెలుగుదేశం పార్టీ ఎంపీ సుజనా చౌదరి మోసాలపై కేంద్ర ప్రభుత్వం గతంలోనే చర్య తీసుకొని ఉంటే.. ఆయన కంపెనీలు బ్యాంకుల నుంచి రూ.వేల కోట్లు తీసుకొని ఇంత భారీ మోసానికి పాల్పడటం సాధ్యమయ్యేది కాదని ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పేర్కొంది. ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం శనివారం ఒక ప్రకటన విడుదల చేసింది.
సుజనా గ్రూప్ 2017 మార్చి 31వ తేదీ నాటికి చేసిన మోసం దాదాపు రూ.7,346 కోట్లు కాగా, ఇప్పుడవి దాదాపు రూ.9,500 కోట్లకు చేరాయని ప్రసార సాధనాల్లో వార్తల్ని చూస్తే అర్థమవుతోందని తెలిపింది. ఈ డబ్బుంతా ఎటు పోయిందన్న ప్రశ్నకు సమాధానం కూడా అందరికీ తెలిసిందేనని పేర్కొంది. సుజనా చౌదరి ముఖ్యమంత్రి చంద్రబాబు చేతిలో పనిముట్టు, బినామీ మాత్రమేనని, అసలు లబ్ధిదారుడు చంద్రబాబేనని స్పష్టం చేసింది.
ఈ వేల కోట్ల రూపాయల డబ్బే 2009, 2014 ఎన్నికల్లో పంచడానికి గానీ, బినామీల ద్వారా రాజధానిలో భూముల కొనుగోలుకు గానీ, విదేశీ ఖాతాలకు మళ్లించటానికి గానీ ఉపయోగించచడం వల్లే వాటికి లెక్కాపత్రం లేకుండా పోయిందని వివరించింది.
బాబు మనుషులను చట్టం ముందు నిలబెట్టాలి: దేశంలోని బ్యాంకులన్నింటినీ సుజనా చౌదరి మోసం చేసి కొట్టుకొచ్చిన డబ్బులు నేరుగా చంద్రబాబుకు చేరాయని వైఎస్సార్‌సీపీ తేల్చిచెప్పింది. అందువల్లే సుజనా చౌదరికి రెండుసార్లు రాజ్యసభతోపాటు టీడీపీ కోటాలో కేంద్ర మంత్రి పదవిని కూడా క్విడ్ ప్రో కో విధానంలో చంద్రబాబు కట్టబెట్టినట్లు స్పష్టమవుతోందని పేర్కొంది.
‘‘సుజనా చౌదరి ఒక్కడే కాదు... చంద్రబాబు పెంచి పోషించిన చాలామంది సుజనాలు, సీఎం రమేష్‌లు బయటకు రావాల్సి ఉంది. దేశంలో బ్యాంకింగ్ రంగం పూర్తిగా కుప్ప కూలకముందే, సామాన్య డిపాజిటర్లకు నష్టం కలగకుండా.. అందుకు బాధ్యులైన చంద్రబాబు, ఆయన మనుషులందరినీ చట్టం ముందు నిలబెట్టి, వారి నుంచి ప్రతి రూపాయినీ కక్కించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
ఆస్తులు లేకపోయినా వాటినే పదేపదే చూపుతూ అప్పులు తీసుకుంటున్న విషయం బ్యాంకులకు, మార్కెట్‌లో అందరికీ తెలిసినా వ్యవస్థల్ని నేరుగా చంద్రబాబు ఇంతకాలం మేనేజ్ చేయబట్టే ఏనాడో విచారణ జరిగి బయటపడాల్సిన మోసాలు ఇప్పుడు బయటకు వస్తున్నాయి. రెండు దశాబ్దాలుగా జరుగుతున్న సుజనా చౌదరి మోసాలను చివరికి ఎల్లో మీడియాలో కూడా వారి వ్యక్తిగత వైరం నేపథ్యంలో గతంలో ప్రచురించారు’’ అని వైఎస్సార్‌సీపీ గుర్తుచేసింది.
Comments
Please login to add a commentAdd a comment