
సాక్షి, అమరావతి : రాజధాని అమరావతిపై త్వరలో వాస్తవ పత్రాన్ని విడుదల చేస్తామని ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు తెలిపారు. గృహ నిర్మాణం, పోలవరం అంశాలపైనా వాస్తవ పత్రాలను విడుదల చేస్తామన్నారు. మంగళగిరిలోని ఓ రిసార్ట్‌లో సోమవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. వీటిపై రాష్ట్రమంతా చర్చ జరిగేలా చేస్తామన్నారు. అమరావతిపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజకీయాలు చేస్తోందని ఆయన విమర్శించారు. పెద్ద నగరాలతోనే ఆదాయం వస్తుందని.. అలాంటి నగర నిర్మాణాన్ని తాము ప్రారంభిస్తే వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం పట్టించుకోవడంలేదన్నారు. అమరావతిని మొదటి నుంచి వైఎస్సార్‌సీపీ వివాదం చేస్తోందని.. దాని నిర్మాణాన్ని అడ్డుకునేందుకు యత్నించిందని విమర్శించారు. అలాగే, అమరావతి రోడ్ల నిర్మాణానికి సంబంధించిన పనులకు నాలుగు కంపెనీలు టెండర్లు దాఖలు చేస్తే తక్కువ కోట్ చేసిన వారికి పనులివ్వడాన్ని తప్పుపడుతున్నారన్నారు.
భూముల ధరలు పడిపోయాయి
రెండు నెలల్లో రాజధానితో పాటు రాష్ట్రవ్యాప్తంగా భూముల ధరలు పడిపోయాయని దీనికి వైఎస్సార్‌సీపీ విధానమే కారణమని చంద్రబాబు ఆరోపించారు. ఆర్థికమంత్రి ముళ్ల కంపలు అని వ్యంగ్యంగా మాట్లాడుతున్నారని.. నిర్మాణంలో ఉన్న రాజధానిపై విమర్శలు చేయడం సరికాదన్నారు. రాజధాని ప్రాంతంలో ప్రపంచ బ్యాంకు తనిఖీలు చేయడానికి వైఎస్సార్‌సీపీయే కారణమన్నారు. ప్రభుత్వ వైఖరివల్ల పెట్టుబడులు పెట్టే వారు కూడా వెనక్కి వెళ్లిపోతున్నారన్నారు.
అసెంబ్లీలో హడావుడిగా బిల్లులు పెట్టి, వాటిని తాము వ్యతిరేకించామంటున్నారని బాబు విమర్శించారు. కాగా, చంద్రయాన్–2ను విజయవంతంగా ప్రయోగించిన ఇస్రో శాస్త్రవేత్తలకు అభినందనలు తెలిపిన చంద్రబాబు, ఆ ప్రాజెక్టుకు కేటాయించిన వెయ్యి కోట్లు దండగని, అవినీతి అని కూడా అంటారేమోనని వ్యాఖ్యానించారు. పీపీఏలపై నిపుణుల కమిటీ పేరుతో తప్పుడు సమాచారం ఇస్తున్నారని, ఈ వ్యవహారంపై కోర్టుకు వెళ్తామని ఆయన చెప్పారు. అనంతరం.. రిసార్ట్‌లోనే టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సమావేశం నిర్వహించి అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై సుదీర్ఘంగా చర్చించారు.
Comments
Please login to add a commentAdd a comment