World Bank Group
-
వారికి కరోనా వ్యాక్సిన్ కూడా పనిచేయదట!
సాక్షి, న్యూఢిల్లీ : కోవిడ్–19 బారిన పడితే ఆరోగ్యకరమైన బరువు కలిగిన వారికన్నా అధిక బరువు కలిగిన వారు 48 శాతం ఎక్కువ మరణించే అవకాశం ఉందని ప్రపంచ బ్యాంక్ నియమించిన శాస్త్రవేత్తల బృందం తెలిపింది. అధిక బరువు కలిగిన వారు 113 శాతం ఆస్పత్రుల్లో చేరే అవకాశం ఉండగా, వారిలో 74 శాతం మంది ఆక్సిజన్ వెంటిలేటర్లను ఆశ్రయించాల్సి వస్తుందని కూడా ఆ బృందం హెచ్చరించింది. అధిక బరువు కలిగిన వారికి మధుమేహం ఎక్కువగా ఉండే అవకాశం ఉందని, దానివల్ల వారి రక్తంలో సుగర్ పెరిగితే రక్తం గడ్డలు కట్టే ప్రమాదం ఉందని, పైగా వారి రక్తనాళాలు ఉబ్బిపోయి పెలుసుగా తయారవుతాయని, అధిక బరువు కలిగిన వారిలో రోగనిరోధక శక్తినిచ్చే కణాలు కూడా దెబ్బతింటాయని, అధిక బరువు కారణంగా వారికి వెంటిలేటర్ చికిత్స ఇవ్వడం కూడా కష్టం అవుతుందని, ఇలాంటి కారణాల వల్లనే అధిక బరువు కలిగిన వారు చనిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని శాస్త్రవేత్తల బృందం తెలియజేసింది. (కోవిడ్ సంక్షోభం తర్వాత అనేక అవకాశాలు) సరిగ్గా ఈ కారణాల వల్లనే కోవిడ్ నిరోధక వ్యాక్సిన్లు కూడా వారికి పెద్దగా పని చేయవని ఆ బందం పేర్కొంది. ప్రధానంగా అధిక బరువు కలిగిన వారిలో రోగ నిరోధ వ్యవస్థ సరిగ్గా పని చేయక పోవడం వల్లనే వ్యాక్సిన్ల ప్రభావం వారిపై ఎక్కువగా ఉండదని శాస్త్రవేత్తల బందం తెలిపింది. బ్రిటన్‌లో ప్రతి ముగ్గురు అధిక బరువు కలిగిన వారుకాగా, అమెరికాలో 40 శాతం మంది అధిక బరువు కలిగిన వారున్నారు. -
అమరావతిపై వాస్తవపత్రం
సాక్షి, అమరావతి : రాజధాని అమరావతిపై త్వరలో వాస్తవ పత్రాన్ని విడుదల చేస్తామని ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు తెలిపారు. గృహ నిర్మాణం, పోలవరం అంశాలపైనా వాస్తవ పత్రాలను విడుదల చేస్తామన్నారు. మంగళగిరిలోని ఓ రిసార్ట్‌లో సోమవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. వీటిపై రాష్ట్రమంతా చర్చ జరిగేలా చేస్తామన్నారు. అమరావతిపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజకీయాలు చేస్తోందని ఆయన విమర్శించారు. పెద్ద నగరాలతోనే ఆదాయం వస్తుందని.. అలాంటి నగర నిర్మాణాన్ని తాము ప్రారంభిస్తే వైఎస్సార్సీపీ ప్రభుత్వం పట్టించుకోవడంలేదన్నారు. అమరావతిని మొదటి నుంచి వైఎస్సార్సీపీ వివాదం చేస్తోందని.. దాని నిర్మాణాన్ని అడ్డుకునేందుకు యత్నించిందని విమర్శించారు. అలాగే, అమరావతి రోడ్ల నిర్మాణానికి సంబంధించిన పనులకు నాలుగు కంపెనీలు టెండర్లు దాఖలు చేస్తే తక్కువ కోట్ చేసిన వారికి పనులివ్వడాన్ని తప్పుపడుతున్నారన్నారు. భూముల ధరలు పడిపోయాయి రెండు నెలల్లో రాజధానితో పాటు రాష్ట్రవ్యాప్తంగా భూముల ధరలు పడిపోయాయని దీనికి వైఎస్సార్సీపీ విధానమే కారణమని చంద్రబాబు ఆరోపించారు. ఆర్థికమంత్రి ముళ్ల కంపలు అని వ్యంగ్యంగా మాట్లాడుతున్నారని.. నిర్మాణంలో ఉన్న రాజధానిపై విమర్శలు చేయడం సరికాదన్నారు. రాజధాని ప్రాంతంలో ప్రపంచ బ్యాంకు తనిఖీలు చేయడానికి వైఎస్సార్సీపీయే కారణమన్నారు. ప్రభుత్వ వైఖరివల్ల పెట్టుబడులు పెట్టే వారు కూడా వెనక్కి వెళ్లిపోతున్నారన్నారు. అసెంబ్లీలో హడావుడిగా బిల్లులు పెట్టి, వాటిని తాము వ్యతిరేకించామంటున్నారని బాబు విమర్శించారు. కాగా, చంద్రయాన్–2ను విజయవంతంగా ప్రయోగించిన ఇస్రో శాస్త్రవేత్తలకు అభినందనలు తెలిపిన చంద్రబాబు, ఆ ప్రాజెక్టుకు కేటాయించిన వెయ్యి కోట్లు దండగని, అవినీతి అని కూడా అంటారేమోనని వ్యాఖ్యానించారు. పీపీఏలపై నిపుణుల కమిటీ పేరుతో తప్పుడు సమాచారం ఇస్తున్నారని, ఈ వ్యవహారంపై కోర్టుకు వెళ్తామని ఆయన చెప్పారు. అనంతరం.. రిసార్ట్‌లోనే టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సమావేశం నిర్వహించి అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై సుదీర్ఘంగా చర్చించారు. -
ఏపీకి సాయంపై వరల్డ్ బ్యాంక్ స్పష్టత
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి ఆర్థిక సాయంపై ప్రపంచ బ్యాంక్ స్పష్టతనిచ్చింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వానికి పూర్తి సహకారం అందిస్తామని పేర్కొంది. ఏపీ ప్రభుత్వానికి 1 బిలియన్ డాలర్ల మేరకు ఆర్థిక సాయం అందిస్తున్నట్టు ప్రకటించింది. ఈ నెల 15న ఏపీ రాజధానికి ఆర్థిక సాయంపై ప్రతిపాదనను కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించుకుందని వరల్డ్ బ్యాంక్ తెలిపింది. కేంద్రం ఉపసంహరణతోనే తమ డైరక్టర్ల బోర్డు ఆ నిర్ణయం తీసుకుందని వెల్లడించింది. అయితే కొన్ని రోజులుగా ప్రతిపక్ష టీడీపీ నాయకులు లోకేశ్, ఇతర నాయకులు.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కారణంగానే ఏపీకి వరల్డ్ బ్యాంక్ ఆర్థిక సాయం వెనక్కు తీసుకుందనే దుష్ప్రచారం చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా వరల్డ్ బ్యాంక్ ప్రకటనతో టీడీపీ నేతల ప్రచారంలో వాస్తవం లేదని తేలింది. దీంతో లోకేశ్, టీడీపీ నేతలు మరోసారి పరువు పొగొట్టుకున్నారని పలువురు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. -
ప్రపంచ బ్యాంకు ఎండీ, సీఎఫ్‌వోగా అన్షులా
సాక్షి, న్యూఢిల్లీ : దేశీయ అతిపెద్ద ప్రభుత్వ రంగ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) మేనేజింగ్ డైరెక్టర్ అన్షులా కాంత్ మరో ఘనతను సొంతం చేసుకున్నారు. ప్రపంచ బ్యాంకు మేనేజింగ్ డైరెక్టర్, చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్‌గా నియమితులయ్యారు. ఈ మేరకు ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడు డేవిడ్ మాల్పాస్ శుక్రవారం ఒక ప్రకటన జారీ చేశారు. గత ఏడాదే కాంత్ ఎండీగా నియమితులైన సంగతి తెలిసిందే. అన్షులా కాంత్‌ను ప్రపంచ బ్యాంక్ గ్రూప్ ఎండీ, సీఎఫ్ఐగా నియమించడం సంతోషంగా ఉందని ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడు వ్యాఖ్యానించారు. ఎస్బీఐ ఎండీ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్‌గా ఉన్న ఆమె సుమారు 38 బిలియన్ డాలర్ల (రూ.2.3 లక్షల కోట్లు) ఆదాయాన్ని, 500 బిలియన్ డాలర్ల (రూ.35 లక్షల కోట్లు) ఆస్తులను నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు. ఆమెకు ఫైనాన్స్, బ్యాంకింగ్ సహా బ్యాంకింగ్ రంగంలో సాంకేతిక పరిజ్ఞానాన్నివినూత్నంగా ఉపయోగించడంలో 35 అనుభవం ఉందన్నారు. ఈ నేపథ్యంలో తన విధులను విజయవంతంగా కొనసాగిస్తారనే విశ్వాసాన్ని డేవిడ్ మల్పాస్ వ్యక్తంచేశారు. ప్రపంచ బ్యాంకు ఎండీ, సీవోవోగా కాంత్ ప్రపంచ బ్యాంక్ గ్రూప్ ఆర్థిక, రిస్క్ మేనేజ్మెంట్ బాధ్యత వహిస్తారు, రాష్ట్రపతికి నివేదిస్తారని తెలిపారు. అన్షులాకు ఉన్న అనుభవం నేపధ్యంలో ఆమెకు సాధారణ నిర్వాహణ వ్యవహారాలతో పాటు ఫైనాన్షియల్ రిపోర్టింగ్, రిస్క్ మేనేజ్మెంట్ బాధ్యతలను అప్పగించామన్నారు. కాగా లేడీ శ్రీరాం కాలేజ్ ఫర్ విమెన్ నుంచి ఎకనమిక్స్ హానర్స్ చేసిన అన్షులా కాంత్ ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనమిక్స్ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. 1960లో జన్మించిన ఆమె 1983లో ఎస్బీఐ బ్యాంకులో ప్రొబేషనరీ ఆఫీసర్‌గా పనిచేశారు. -
ప్రపంచ బ్యాంకు మేనేజర్ ఇంట్లో చోరీ
సాక్షి ప్రతినిధి, చెన్నై: చెన్నై ఈసీఆర్ రోడ్డులో నివసిస్తున్న ప్రపంచ బ్యాంకు బ్రాంచ్ మేనేజర్ ఇంట్లో దొంగలుపడి రూ.20 లక్షల బంగారు నగలు, నగదు దోచుకెళ్లారు. ఉత్తరాది రాష్ట్రానికి చెందిన సునీల్‌కుమార్ (51) తన కుటుంబంతో ఈసీఆర్ రోడ్డులోని విలాసవంతమైన గృహ సముదాయంలో నివసిస్తున్నాడు. చెన్నై తరమణిలోని ప్రపంచ బ్యాంకు బ్రాంచ్ మేనేజర్‌గా పనిచేస్తున్నాడు. ఇతను ఈనెల 1న ఇంటికి తాళం వేసి భార్య అనితతో కలిసి హైదరాబాద్ వెళ్లి ఆదివారం రాత్రి తిరిగొచ్చాడు. వంట గది కిటీకీ అద్దం పగులగొట్టి ఉండడాన్ని గమనించి దొంగలు పడ్డారని గ్రహించాడు. ఇంటి బీరువాలోని రూ.20 లక్షల విలువైన 90 సవర్ల బంగారు నగలు, రూ.80 వేల నగదు దొంగలు ఎత్తుకెళ్లినట్లు గుర్తించాడు. -
ప్రపంచ బ్యాంక్ ప్రెసిడెంట్ కిమ్ రాజీనామా
వాషింగ్టన్: ప్రపంచ బ్యాంక్ ప్రెసిడెంట్ పదవికి జిమ్ యోంగ్ కిమ్ రాజీనామా చేశారు. పదవీకాలం ఇంకా మూడేళ్లుండగానే ఆయన అర్ధంతరంగా తప్పుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది. ప్రైవేట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ సంస్థలో చేరే ఉద్దేశంతో ప్రపంచ బ్యాంక్ ప్రెసిడెంట్ పదవికి కిమ్(58) రాజీనామా చేశారు. ఫిబ్రవరి 1 నుంచి ఇది అమల్లోకి వస్తుంది. కొత్త చీఫ్ నియమితులయ్యేదాకా వరల్డ్ బ్యాంక్ సీఈవో క్రిస్టలీనా జార్జియేవా తాత్కాలిక ప్రెసిడెంట్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తారు. కిమ్ ఆరేళ్లుగా ప్రపంచ బ్యాంక్ ప్రెసిడెంట్ పదవిలో కొనసాగుతున్నారు. 2017లో రెండో దఫా ప్రెసిడెంట్‌గా ఎన్నికైన కిమ్ పదవీకాలం వాస్తవానికి 2022 నాటికి ముగియాల్సి ఉంది. వాతావరణ మార్పులు, కరువు, కాందిశీకుల సమస్యలు మొదలైనవి అంతకంతకూ పెరుగుతున్న నేపథ్యంలో ప్రపంచ దేశాల పేదల ఆకాంక్షలను నెరవేర్చాల్సిన బాధ్యత ప్రపంచ బ్యాంక్‌పై ఉందని ఒక ప్రకటనలో కిమ్ పేర్కొన్నారు. వృత్తి రీత్యా వైద్యుడైన కిమ్.. దక్షిణ కొరియా దేశానికి చెందినవారు. ముందుగా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్‌లో అడ్వైజర్‌గా చేరి, ఆ తర్వాత వరల్డ్ బ్యాంక్‌లో అంచెలంచెలుగా ప్రెసిడెంట్ స్థాయికి ఎదిగారు. కొత్త చీఫ్ నియామకం అంశం.. ప్రపంచ బ్యాంక్‌లోని ఇతర సభ్య దేశాలు, అమెరికా మధ్య రగడకు దారి తీసే అవకాశం ఉందని పరిశీలకులు భావిస్తున్నారు. సాధారణంగా ప్రపంచ బ్యాంక్ ప్రెసిడెంట్‌ను అమెరికా నామినేట్ చేస్తే, దానిలో భాగమైన అంతర్జాతీయ ద్రవ్య నిధి చీఫ్‌ను యూరప్ దేశాలు నామినేట్ చేస్తూ వస్తున్నాయి. మిగతా ప్రాంతాల వర్ధమాన దేశాలకు కూడా ఈ ప్రక్రియలో భాగం ఉండాలన్న డిమాండ్ నెలకొనడంతో 2012లో కిమ్‌ను ఎంపిక చేయడం ద్వారా పాత సంప్రదాయానికి అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా ఫుల్స్టాప్ పెట్టారు. కానీ ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. ప్రపంచ రాజకీయాల్లో అమెరికా ప్రాధాన్యాన్ని మరింతగా పెంచే ప్రయత్నాల్లో ఉండటం, దీనికి మిగతా దేశాల నుంచి వ్యతిరేకత వస్తుండటం తదితర పరిణామాల నేపథ్యంలో ప్రపంచ బ్యాంక్ కొత్త చీఫ్ నియామకంపై వివాదానికి దారితీయొచ్చన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. -
భారత్ రేటింగ్ మార్చడం లేదు!
న్యూఢిల్లీ: భారతదేశంలో పెట్టుబడులకు సంబంధించిన రేటింగ్‌ను యథాతథంగా కొనసాగిస్తున్నట్లు అంతర్జాతీయ రేటింగ్ దిగ్గజం– ఫిచ్ గురువారం ప్రకటించింది. ప్రస్తుతం భారత్‌కు ఫిచ్... స్థిర అవుట్‌లుక్‌తో ‘బీబీబీ–’ సావరిన్ రేటింగ్ ఉంది. ఇది అతి తక్కువ ఇన్వెస్ట్మెంట్ గ్రేడ్. 12 సంవత్సరాల నుంచీ ఇదే గ్రేడింగ్‌ను భారత్‌కు ఫిచ్ కొనసాగిస్తోంది. ప్రస్తుత రేటింగ్‌ను అప్‌గ్రేడ్ చేసే పరిస్థితి లేదని ఫిచ్ తాజాగా స్పష్టం చేసింది. బలహీన ద్రవ్య పరిస్థితులు ఇందుకు కారణంగా పేర్కొంది. ద్రవ్యోల్బణం, ద్రవ్యలోటు, కరెంట్ అకౌంట్‌లోటు (క్యాడ్) వంటి స్థూల ఆర్థిక అంశాలకు సంబంధించి భారత్‌కు ఇబ్బందులు ఉన్నాయని ఫిచ్ స్పష్టం చేసింది. భారత్ దీర్ఘకాల ఫారిన్ కరెన్సీ ఇష్యూయర్ డిఫాల్ట్ రేటింగ్ (ఐడీఆర్)ను ‘స్థిర అవుట్‌లుక్‌తో బీబీబీ–’గానే కొనసాగిస్తున్నాం అని ఫిచ్ ఈ ప్రకటనలో పేర్కొంది. ఫిచ్ ప్రకటనలో కొన్ని ముఖ్యాంశాలు చూస్తే... ►మధ్య కాలికంగా వృద్ధి పరిస్థితులు పటిష్టంగా ఉన్నాయి. విదేశీ మారక ద్రవ్య పరిస్థితులకు కూడా మధ్య కాలికంగా సానుకూలంగా ఉన్నాయి. అయితే ద్రవ్య పరిస్థితులు పేలవంగా ఉండడం, బలహీన ఫైనాన్షియల్‌అంశాలు, వ్యవస్థాగత అంశాలు బాగుండకపోవడం వంటి అంశాలు రేటింగ్ పెంపునకు ప్రతికూలంగా ఉన్నాయి. ►ముఖ్యంగా స్థూల ఆర్థిక అంశాల అవుట్‌లుక్‌కు ప్రతికూలతలు స్పష్టంగా ఉన్నాయి. రుణ వృద్ధి పడిపోయింది. మొండిబకాయిలు సహా బ్యాం కింగ్ పలు సమస్యలను ఎదుర్కొంటోంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ లీజింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సంక్షోభం అనంతరం తలెత్తిన లిక్విడిటీ పరమైన అంశాలు కూడా ఇక్కడ గమనార్హం. ► ఇక ప్రభుత్వ రుణ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో 70 శాతానికి చేరింది. మరోవైపు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2018–19)జీడీపీలో ద్రవ్యలోటు (ప్రభుత్వ ఆదాయాలు–వ్యయాలకు మధ్య నికర వ్యత్యాసం)ను 3.3 శాతానికి (6.24 లక్షల కోట్లు) కట్టడి చేయడం కష్టంగానే కనబడుతోంది. ఆదాయాలు తక్కువగా ఉండడం ఇక్కడ గమనార్హం. వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) నుంచి నెలనెలా లక్ష రూపాయల పన్ను వసూళ్లు లక్ష్యంగా పెట్టుకున్నా... ఇప్పటి వరకూ అది పూర్తిస్థాయిలో నెరవేరలేదు. కేవలం 2 నెలలు (ఏప్రిల్, అక్టోబర్) మినహా లక్ష కోట్లు వసూళ్లు జరగలేదు. ►ఇక వచ్చే ఆర్థిక సంవత్సరంలోనే సార్వత్రిక ఎన్నికలు. ఈ పరిస్థితుల్లో వ్యయాల అదుపు కష్టమే. ఒకపక్క రాబడులు తగ్గడం, మరోపక్క అధిక వ్యయాల తప్పని పరిస్థితులు ద్రవ్యలోటు పరిస్థితులను కఠినం చేసే అవకాశం ఉంది. ► ఇతర వర్థమాన దేశాలతో పోల్చిచూస్తే, ప్రపంచబ్యాంక్ గవర్నెర్స్ ఇండికేటర్ తక్కువగా ఉంది. ఐక్యరాజ్యసమితి మానవ అభివృద్ధి సూచీ కూడా బలహీనంగా ఉంది. ► ధరల పెరుగుదల, కరెంట్ అకౌంట్ లోటు కట్టడిపై భయాలు రేటింగ్ పెంపు అవకాశాలకు గండికొడుతున్నాయి. ► ఇక 2019 మార్చితో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం భారత్ జీడీపీ వృద్ధి 7.8 శాతంగా ఉంటుందన్న అంచనాల్లో మార్పులేదు. 2017–18లో ఈ రేటు 6.7 శాతం. అయితే కఠిన ద్రవ్య పరిస్థితులు, బలహీన ఫైనాన్షియల్ రంగ బ్యాలెన్స్‌షీట్ అంశాలు, అంతర్జాతీయ క్రూడ్ ధరలు ఇక్కడ పరిశీలనలోకి తీసుకోవాలి. అయితే 2019–21 ఆర్థిక సంవత్సరాల్లో వృద్ధి 7.3 శాతానికే పరిమితం కావచ్చు. ప్రభుత్వ వర్గాల నిరాశ? ఫిచ్ రేటింగ్ పెంపునకు ప్రభుత్వం గట్టిగా ప్రయత్నం చేసింది. 2004 తరువాత మొట్టమొదటి సారి మూడీస్ ఇన్వెస్టర్స్ సర్వీసెస్ (ఫిచ్ ప్రత్యర్థి) 2017 నవంబర్‌లో భారత్ సావరిన్ రేటింగ్‌ను ‘బీఏఏ3’ నుంచి ‘బీఏఏ2’కి అప్‌గ్రేడ్ చేసింది. తర్వాత భారత్ ఆర్థిక పరిస్థితులు మెరుగుపడ్డాయని, ఈ నేపథ్యంలో రేటింగ్ పెంపు సమంజసమని ఫిచ్‌ను ఒప్పించడానికి కేంద్రం ప్రయత్నం చేసింది. 2006 ఆగస్టు 1న ఫిచ్ భారత్ సావరిన్ రేటింగ్‌ను ‘బీబీ+’ నుంచి ‘స్థిర అవుట్‌లుక్‌తో బీబీబీ–’కు అప్‌గ్రేడ్ చేసింది. అప్పటి నుంచీ అదే రేటింగ్‌ను కొనసాగిస్తోంది. అయితే 2012లో అవుట్‌లుక్‌ను ‘నెగిటివ్’కు మార్చింది. కానీ తదుపరి ఏడాదే ‘స్థిరానికి’ పెంచింది. కాగా మరో అంతర్జాతీయ రేటింగ్ దిగ్గజ సంస్థ– ఎస్అండ్పీ కూడా తన భారత్ ప్రస్తుత రేటింగ్ ‘బీబీబీ–’ నుంచి అప్‌గ్రేడ్‌చేయడానికి ససేమిరా అంటోంది. ప్రభుత్వ అధిక రుణ భారం, అల్పాదాయ స్థాయి దీనికి కారణాలుగా చూపుతోంది. ఇదే రేటింగ్‌ను 2007 నుంచీ ఎస్అండ్పీ కొనసాగిస్తోంది. -
పలు భారత కంపెనీలపై ప్రపంచ బ్యాంకు నిషేధం
వాషింగ్టన్: అవినీతి చర్యలకు పాల్పడిన పలు భారత కంపెనీలపై ప్రపంచ బ్యాంకు నిషేధం విధించింది. మోసపూరిత విధానాలకు పాల్పడిన మధుకాన్ ప్రాజెక్ట్స్‌పై రెండేళ్ల వేటు పడింది. తెలుగుదేశం పార్టీ నాయకుడు, పార్లమెంటు మాజీ సభ్యుడు నామా నాగేశ్వరరావుకు చెందిన ఈ కంపెనీ... భారత్‌లో ప్రపంచ బ్యాంకుకు చెందిన ప్రాజెక్టులకు పనిచేస్తోంది. భారత్‌కు చెందిన ఓలివ్ హెల్త్‌కేర్, జే మోది కంపెనీలు బంగ్లాదేశ్‌లో ప్రపంచ బ్యాంకు ప్రాజెక్టు కింద కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. ఇవి మోసం, అవినీతి చర్యలకు పాల్పడడంతో నిషేధం విధించినట్టు ప్రపంచ బ్యాంకు వార్షిక నివేదిక తెలియజేసింది. ఓలివ్ హెల్త్‌కేర్‌పై పదేళ్లు, జైమోదిపై ఏడున్నరేళ్ల పాటు ఈ నిషేధం అమలుకానుంది. మొత్తం 78 కంపెనీలు, వ్యక్తులపై ప్రపంచ బ్యాంకు ఈ చర్యలు తీసుకుంది. భారత్‌కే చెందిన ఏంజెలిక్యూ ఇంటర్నేషనల్ లిమిటెడ్‌పై నాలుగున్నరేళ్లు, ఫ్యామిలీ కేర్‌పై నాలుగేళ్ల పాటు నిషేధం విధించింది. ఆర్కేడీ కన్‌స్ట్రక్షన్స్‌పై ఏడాదిన్నరపాటు వేటు వేసింది. తత్వ గ్లోబల్ ఎన్విరాన్మెంట్ ప్రైవేటు లిమిటెడ్, ఎస్ఎంఈసీ ఇండియా ప్రైవేటు లిమిటెడ్, మెక్లియోడ్స్ ఫార్మాస్యూటికల్స్‌పై ఏడాదిలోపు నిషేధం విధించింది. -
ప్రపంచ ఆర్థిక రథసారథులు
కూడబెడితే డబ్బు జమౌతుంది.. దాచిపెడితే ఖర్చులకు ఉంటుంది.ఈ జమాఖర్చులేనా... మనీ మేనేజ్మెంట్ అంటే?ఇంటి వరకైతే ఇంతే. దేశం వరకైతే ఇంతే. దేశాల మధ్య డబ్బుని తిప్పడం మాత్రం.. అంతకుమించిన పని! ఆ పనిని మహిళలు నేర్పుగా చేస్తున్నారు కనుకే..ప్రపంచ బ్యాంకులన్నీ ఇప్పుడు ఆడవాళ్ల చేతుల్లోకి వెళ్లిపోతున్నాయి. దేశాల అభివృద్ధికి తోడ్పడుతున్నాయి. సరకులు నిండుకున్నా.. ఆ క్షణంలో ఇంటికొచ్చిన అతిథికి కడుపు నిండా అన్నంపెట్టి పంపించగల నేర్పరులు మహిళలు. జేబులో చిల్లిగవ్వ లేకుంటే గడప దాటలేరు పురుషులు. అప్పంటే ఆడవారికి భయం. భర్త జీతంలోంచి ఖర్చుల కోసమని ఇచ్చే చాలీచాలని డబ్బుతోనే తులాల కొద్ది బంగారాన్ని కొనిపెట్టే ఇగురం ఆమెది.. ఆపదలో అక్కరకు వస్తుందని, భవిష్యత్ పట్ల విజన్ అది. వేలకు వేలు జీతం తీసుకుంటున్నా ఆ తెగువ చూపరు మగవాళ్లు. ఇన్వెస్ట్మెంట్ పట్ల ఇగ్నోరెన్స్ వీళ్లది. దుబారా.. మేల్కి నిర్వచనం. ఆదా ఆడాళ్ల పేటెంట్. అందుకే ఇంటి నుంచి ప్రపంచం దాకా మనీ మ్యాటర్స్ను మేనేజ్ చేస్తోంది మహిళే. ఇంటి పద్దు లోటు అప్పుగా మారకుండా ఎంత నేర్పుతో ఉంటుందో.. ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ వడ్డీని అంతే నిక్కచ్చిగా వసూలు చేస్తోంది. ఇది స్త్రీ శక్తి అని నిరూపిస్తున్నారు... ఐమ్ఎఫ్కు రెండు రోజుల క్రితమే చీఫ్ ఎకనమిస్ట్‌గా నియమితురాలైన గీతా గోపీనాథ్, ఐఎమ్ఎఫ్ మేనేజింగ్ డైరెక్టర్ క్రిస్టీన్ లెగార్డ్, వరల్డ్ బ్యాంక్ చీఫ్ ఎకనమిస్ట్ పినలోపి కౌజనో గోల్డ్బర్గ్, వరల్డ్ బ్యాంక్ సీఈఓ క్రిస్టలినా జార్జీవా, ఓఈసీడీ చీఫ్ ఎకనమిస్ట్ లారెన్స్ బూన్. వీళ్లే కాదు. ప్రతి సాధారణ గృహిణి కూడా! జగత్తుకు సంబంధించిన విత్తం వ్యవహారాలను చూస్తోన్న ఆ అయిదుగురి గురించి తెలుసుకుంటే.. మనింటి ఆడపడుచుల మీదా గౌరవం రెట్టింపవుతుంది. గీత గోపీనాథ్ డేటాఫ్ బర్త్.. డిసెంబర్, 1971. తండ్రి టీవీ గోపీనాథ్. రైతు, వ్యాపారి. తల్లి విజయలక్ష్మి గృహిణి. మలయాళీ కుటుంబం. కానీ గీత పుట్టింది కోల్‌కతాలో. తండ్రి వ్యవసాయంతో పాటు వ్యాపారమూ చేస్తుండడంతో ఆగ్రో ఎకనామిక్స్ మీద మొదటి నుంచి ఆసక్తి పెంచుకుంది. ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనమిక్స్‌లో మాస్టర్స్ చేసి యూనివర్శిటీ ఆఫ్ వాషింగ్టన్ వెళ్లింది. ప్రిన్స్టన్ యూనివర్శిటీలో పీహెచ్డీ చేసింది. 2010లో హార్వర్డ్ యూనివర్శిటీలో (ఎకనమిక్స్ డిపార్ట్మెంట్) పర్మినెంట్ ప్రొఫెసర్‌గా నియమితురాలైంది. ఆ అవకాశం దక్కిన మూడో మహిళ గీత. మన భారతదేశం నుంచి అమర్త్యసేన్ తర్వాత ఆ గౌరవం అందుకున్న మొదటి భారతీయురాలు కూడా. ‘‘నేను డిగ్రీ చదువుతున్న రోజుల్లో మన దేశం తీవ్ర ఆర్థిక ఎద్దడిలో ఉంది. కరెన్సీ క్రైసిస్‌ను ఫేస్ చేసింది. ఆ పరిస్థితులను చూసే ఆర్థికశాస్త్రంలో పీహెచ్డీ చేయాలని డిసైడ్ అయ్యాను. అదే ఈ రోజు నన్ను ఐఎమ్ఎఫ్కు చీఫ్ ఎకనమిస్ట్ను చేసింది’’ అంటుంది గీతా గోపీనాథ్. 2014లో ఐఎమ్ఎఫ్ ప్రకటించిన తొలి 25 మంది అత్యుత్తమ ఆర్థికవేత్తలో ఒకరిగా స్థానం సంపాదించుకుంది. 2011లో వరల్డ్ ఎకనమిక్ ఫారమ్ ‘యంగ్ గ్లోబల్ లీడర్’ కు ఎంపికైంది. ‘‘ప్రపంచంలోని ప్రతిభ గల ఆర్థికవేత్తల్లో గీతా గోపీనాథ్ ఒకరు. ఆర్థిక వ్యవహారాల మీద సమగ్రమైన అవగాహన.. సమర్థత ఆమె ఇంటలెక్చువల్ లీడర్షిప్కు ప్రతీకలు’ అంటూ కితాబిస్తుంది ఐఎమ్ఎఫ్ మేనేజింగ్ డైరెక్టర్ క్రిస్టీనా లేగార్డ్. క్రిస్టీనా లేగార్డ్ పారిస్‌లో పుట్టింది. విజయం ఆమెకు కొత్త కాదు. ఐఎమ్ఎఫ్కి ఎమ్డీ పదవితోనే అది ప్రారంభం కాలేదు. చిన్నప్పుడు ఈతతో ఆమె గెలుపు మొదలైంది. ఆ విజయం టీనేజ్ వరకూ సాగింది. అవును.. ఆమె స్విమ్మర్. సింక్రనైజ్డ్ స్విమ్మింగ్ (ఈత, డాన్స్, జిమ్నాస్టిక్స్ మూడూ కలిపి చేసేది) టీమ్‌కి లీడర్ కూడా. పదహారేళ్ల వయసులో చదువు కోసం పారిస్ నుంచి అమెరికాకు ప్రయాణమైంది. ఫ్రెంచ్ వాళ్లకు (యురోపియన్స్) ఇంగ్లీష్ రాదు అన్న అపవాదును తుడిచేసింది.. అనర్ఘళంగా ఇంగ్లీష్‌లో మట్లాడుతూ. అమెరికా వెళ్లిన యేడాదికే తండ్రి చనిపోవడంతో మళ్లీ పారిస్ వచ్చేసింది. లా స్కూల్ ఆఫ్ పారిస్ నుంచి డిగ్రీ పట్టా తీసుకుంది. ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎయిక్స్ ఎన్ ప్రావిన్స్‌లో పొలిటికల్ సైన్స్‌లో మాస్టర్స్ చదివింది. 1981లో మళ్లీ అమెరికా వెళ్లింది. ఇంటర్నేషనల్ లా ఫర్మ్ బేకర్ అండ్ మెకెంజీలో అసోసియేట్‌గా చేరి లేబర్, యాంటి ట్రస్ట్, ఎమ్ అండ్ ఏ (మెర్జర్స్ అండ్ అక్విజిషన్స్)లో స్పెషలైజేషన్ చేసింది. చదువు పూర్తయిన పద్దెనిమిదేళ్లకు అదే లా ఫర్మ్‌కు చైర్పర్సన్ అయింది. ఆ పదవి పొందిన మొదటి మహిళ క్రిస్టీనానే. ఇలాంటి ఫస్ట్లు చాలానే ఉన్నాయి ఆమె కెరీర్లో. 2005లో ఫ్రాన్స్ ట్రేడ్ మినిస్టర్ పదవి వరించింది. ఫ్రాన్స్ దేశపు ఎగుమతులను రికార్డ్‌స్థాయికి తీసుకెళ్లింది. ఆ సామర్థ్యం 2007లో ఆర్థికశాఖా మంత్రి పదవిని కట్టబెట్టింది. ఒక్క ఫ్రాన్స్‌లోనే కాదు.. జీ8 ప్రధాన దేశాల్లోనే ఆర్థిక శాఖ చేపట్టిన మొదటి మహిళా మంత్రిగా ఖ్యాతినార్జించింది. ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడగలిగే ముక్కుసూటి మనిషి. పారిశ్రామిక వేత్తలకు కాదు.. ప్రజలకు అవసరమయ్యే ఆర్థిక వ్యూహాలనే అనుసరించగల ధైర్యశాలి. ఈ నైజం నచ్చని పురుషాధిపత్య ఆర్థిక, పారిశ్రామిక రంగం.. 2008 నాటి ఆర్థిక సంక్షోభానికి ఆమె నిర్ణయాలను కారణంగా చూపుతూ క్రిస్టీనాను నిందించింది. అయినా ఆమె చరిష్మా తగ్గలేదు. ఫ్రాన్స్‌లోని బ్రాడ్‌కాస్టర్ ఆర్టీఎల్, లీ పారిసీన్ వార్తా పత్రిక 2009లో నిర్వహించిన ‘కంట్రీస్ మోస్ట్ ఫేవరేట్ పర్సనాలిటీస్’ పోల్‌లో పాపులర్ సింగర్, యాక్టర్ జానీ హాలీడేను ఓడించింది క్రిస్టీనా. ఆ కీర్తి అంతర్జాతీయ తీరాన్నీ తాకింది. అదే యేడు ఫైనాన్షియల్ టైమ్ ఆమెను యూరప్‌లోనే ది బెస్ట్ ఫైనాన్స్మినిస్టర్గా ఎన్నుకుంది. ఈ ఘనతలన్నిటిని ఆమె ఖాతాలో చేర్చింది ఆమె ముక్కుసూటి నైజమే. ‘‘క్రిస్టీనా.. ఇంప్రెసివ్ అండ్ స్ట్రాంగ్ పర్సనాలిటీ. ఒక్క మాటలో చెప్పాలంటే ఫైనాన్షియల్ ప్లాట్‌ఫామ్ మీద ఆమె ఒక రాక్‌స్టార్’’ అని అభివర్ణిస్తాడు ఐఎమ్ఎఫ్ మాజీ చీఫ్ ఎకనమిస్ట్ కెన్నెత్ రోగోఫ్. పినెలోపి కైజనో గోల్డ్బర్గ్ గ్రీస్‌లో పుట్టింది. ఏథెన్స్లోని జర్మన్ స్కూల్లో చదువుకుంది. జర్మనీలో అండర్ గ్రాడ్యుయేషన్ చేయడానికి స్కాలర్షిప్ రావడంతో తర్వాతి విద్యాభ్యాసం జర్మనీ దేశంలో సాగింది. అండర్ గ్రాడ్యుయేషన్ అయిపోగానే అమెరికా వెళ్లడానికి ప్లాన్ చేసుకుంది పినలోపీ. అమెరికాలోని ఓ బ్యాంక్‌లో ఇంటర్న్‌షిప్ కోసం ఉత్తరం రాసింది. ఆమె జాబుకు జవాబు వచ్చింది.. ‘‘మీరు డాక్టోల్ ప్రోగ్రామ్‌కి ఎన్రోల్ చేయించుకోకపోయుంటే కనుక మీ ఈ ఇంటర్న్‌షిప్ దరఖాస్తును కనీసం చూసి ఉండేవాళ్లం కూడా కాదు’’ అని. ‘‘ఆ జవాబు రాసిన వ్యక్తి ఎవరో కాని.. డాక్టోరల్ కోర్స్ చేయమని చెప్పకనే చెప్పాడు నాకు. అతని వల్లే డాక్టోరల్ డిగ్రీ చేశాను’’ అని గుర్తుచేసుకుంటుంది పినెలోపి. అలా ఆమె అమెరికాలోని ప్రతిష్టాత్మాకమైన స్టాన్‌ఫర్డ్ యూనివర్శిటీలో ఎకనామిక్స్‌లో పోస్ట్గ్రాడ్యూషన్ పూర్తి చేసింది. యేల్ యూనివర్శిటీలో ప్రొఫెసర్‌గా పనిచేసింది. వరల్డ్ బ్యాంక్ చీఫ్ ఎకనమిస్ట్ పదవి బరీలో మహామహులతో పోటీపడి ఆ స్థానాన్ని గెలుచుకుంది పినలోపీ. ‘‘పినెలోపి తన అకడమిక్ ఎక్స్‌పీరియెన్స్, మేధస్సుతో వరల్డ్ బ్యాంక్ గ్రూప్ వృద్ధికి పాటుపడుతుందని ఆశిస్తున్నాను’’ అన్నారు వరల్డ్ బ్యాంక్ గ్రూప్ ప్రెసిడెంట్ జిమ్ యోంగ్ కిమ్. వరల్డ్‌బ్యాంక్ చీఫ్ ఎకనమిస్ట్‌గా ఉన్నా పాఠాలు చెప్పడం మరిచిపోలేదు పినెలోపి. ఇప్పటికీ యేల్ యూనివర్శిటీలో గెస్ట్‌గా ఫ్యాకల్టీగా వెళ్తూనే ఉంది. అన్నట్టు.. వరల్డ్ బ్యాంక్ చీఫ్ ఎకనమిస్ట్‌గా ఎన్నికైన మొదటి గ్రీస్ దేశస్థురాలు ఈమె. లారెన్స్ బూన్ ఐర్లండ్ దేశస్తురాలు. లండన్ బిజినెస్ స్కూల్, యూనివర్శిటీ పారిస్‌లో చదువుకుంది. ఫ్రాన్స్ ఆర్థిక, రాజకీయ రంగాల్లోనూ కీలక పాత్ర వహించింది. బ్యాంక్ ఆఫ్ అమెరికాలోనూ పనిచేసింది. తన అనుభవంతో ప్రపంచ ఆర్థిక సవాళ్లను పరిష్కరించడానికి ప్రయత్నిస్తోంది. అంతేకాదు ప్రస్తుత పరిస్థితులకు అవసరమైన ఆర్థిక ప్రణాళికలనూ రచిస్తోంది లారెన్స్ బూన్. ఇప్పుడర్థమైంది కదా.. పోపులో ఇంగువ మోతాదును అంచనా వేసినంత ఈజీగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఒడిదుడుకులనూ పసిగట్టగల సమర్థులు మన మహిళలు అని! క్రిస్టలీనా జార్జీవా బల్గేరియా దేశస్తురాలు. బల్గేరియా, సోఫియాలోని యూనివర్శిటీ ఆఫ్ నేషనల్ అండ్ వరల్డ్ ఎకానమీలో పీహెచ్డీ (ఎకనామిక్స్‌లో) చేసింది. అదే యూనివర్శిటీలో సోషియాలజీతో మాస్టర్స్ చదివింది. తర్వాత లండన్ స్కూల్ ఆఫ్ ఎకనమిక్స్, మస్సాచ్యుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎకనామిక్స్‌లో నేచ్యురల్ రిసోర్స్ ఎకనామిక్స్ అండ్ ఎన్విరాన్మెంటల్ పాలసీ అభ్యసించింది. వరల్డ్ బ్యాంక్గ్రూప్లోనే ఆమె కెరీర్ మొదలైంది. యురోపియన్ యూనియన్ అనే కాన్సెప్ట్ రూపకల్పనలో భాగస్వామ్యం పంచుకుంది క్రిస్టిలీనా. వరల్డ్ బ్యాంక్ గ్రూప్‌లోని వివిధ శాఖలు, వివిధ స్థాయిల్లో పనిచేశాక యురోపియన్ యూనియన్‌లో చేరింది. మళ్లీ ఇప్పుడు తిరిగి వరల్డ్ బ్యాంక్ గ్రూప్ గూటికే చేరి ఏకంగా వరల్డ్ బ్యాంక్ సీఈఓ అయ్యింది. – శరాది -
మోదీ సర్కార్‌కు వరల్డ్ బ్యాంకు బూస్ట్
వాషింగ్టన్: ప్రపపంచబ్యాంకు మోదీ ప్రభుత్వానికి భారీ ఊరట నిచ్చింది.భారత వృద్ధిరేటును అప్‌గ్రేడ్ చేస్తూ అంచనాలను విడుదల చేసింది. అనేక సంవత్సరాల్లో మొట్టమొదటిసారిగా, ఈ ఏడాది భారత ఆర్థిక ప్రగతి 6.7 శాతం ఉంటుందని వరల్డ్ బ్యాంక్ వెల్లడించింది. భారత ప్రభుత్వం ఊహించినదానికన్నా ఎక్కువే వుంటుందంటూ మోదీ సర్కర్‌కు మంచి ఉత్సాహాన్నిచ్చింది. ముఖ్యంగా జీఎస్టీ, నోట్ల రద్దుపై విమర్శలు క్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో విడుదలైన ఈ ప్రపంచ బ్యాంకు నివేదికపై బీజీపీ వర్గాల్లో ఆనందం వెల్లివిరుస్తోంది. ఈ ఏడాది ఆర్థిక ప్రగతి 6.5 శాతం ఉంటుందని ప్రభుత్వం అంచనా వేసింది. అంతేకాదు 2018-19 సంవత్సరంలో జాతీయ స్థూల ఉత్పత్తి (జీడీపీ) కూడా 7.3 శాతం ఉంటుందని వరల్డ్ బ్యాంక్ తన నివేదికలో తెలిపింది. ప్రపంచదేశాలపైన కూడా తన నివేదికను వెల్లడించిన ప్రపంచ బ్యాంకు ఆర్థిక సంక్షోభం నుంచి ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కోలుకుంటోందని వెల్లడించింది. భారత్ మళ్లీ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక దేశమని గ్లోబల్ ఎకనామిక్ ప్రాస్పెక్ట్స్ రిపోర్ట్‌లో వరల్డ్ బ్యాంక్ పేర్కొంది. ఈ సందర్భంగా భారత ఆర్థిక ప్రగతిపై వరల్డ్ బ్యాంక్ ప్రశంసలు కురిపించింది. జీఎస్టీ వల్ల వృద్ధి రేటు గత ఏడాది రెండవ భాగంలో సుమారు 0.1 శాతం తగ్గినట్లు రిపోర్ట్ పేర్కొన్నది. 2019-20లో జీడీపీ 7.5 శాతం ఉంటుందని కూడా ప్రపంచ బ్యాంకు అంచనా వేసింది. జీఎస్టీ వల్ల లాభాలు మెలమెల్లగా వస్తుంటాయని వరల్డ్ బ్యాంక్ పేర్కొన్నది. నోట్ల రద్దు, జీఎస్టీ, మేకిన్ ఇండియా లాంటి కార్యక్రమాల వల్ల భారత్‌కు అనుకూల ఫలితాలు వచ్చే సూచనలు ఉన్నట్లు వరల్డ్ బ్యాంక్ అంచనా వేసింది. మేకిన్ ఇండియా వల్ల ఆవిష్కరణలు, పెట్టుబడులు పెరుగుతాయని వరల్డ్ బ్యాంక్ వెల్లడించింది. ప్రపంచ ఆర్థికవ్యవస్థ మంచి సందేశాన్ని అందిస్తున్నా, అప్రమత్తంగా వ్యవహరించాలని వరల్డ్ బ్యాంక్ ప్రెసిడెంట్ జిమ్ యంగ్ కిమ్ తెలిపారు. పెట్టుబడులకు ఇది మంచి అవకాశమని, గ్లోబల్‌గా ట్రేడ్ రికవరీ పుంజుకుంటోందనీ, తద్వారా ఎగుమతులు కూడా పెరుగుతాయన్నారు. ఏదేమైనా, దేశాలు తమ వృద్ధి అవకాశాలను మెరుగుపర్చడానికి పెట్టుబడులు పెట్టాలని సూచించింది. అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్, విద్య, ఆరోగ్య రంగాల్లోకి ఎక్కువ మంది ప్రజలను, ముఖ్యంగా మహిళా ఉద్యోగులు చేరడానికి ప్రోత్సహించే చర్యలు చేపట్టాలని పేర్కొంది. -
నిబంధనల మేరకే వ్యవహరిస్తాం
సాక్షి ప్రతినిధి, అమరావతి బ్యూరో: రైతులను భయపెట్టి తీసుకున్న భూముల్లో నిర్మిస్తున్న రాజధాని వల్ల పర్యావరణానికి పెను ముప్పు ఏర్పడుతుందంటూ ప్రముఖ సామాజిక కార్యకర్తలు రాసిన లేఖకు ప్రపంచ బ్యాంకు స్పందించింది. రాజధాని నిర్మాణంతో స్థానికులు జీవనోపాధిని కోల్పోతారని, పర్యావరణానికి విఘాతం కలుగుతుందని ఆందోళన వ్యక్తం చేస్తూ దేశంలోని 46 మంది ప్రముఖ సామాజిక కార్యకర్తలు, నిపుణులు నవంబర్ 27న ప్రపంచబ్యాంకుకు లేఖ రాసిన విషయం విదితమే. లేఖలో పేర్కొన్న అభ్యంతరాలకు ప్రపంచబ్యాంకు స్పందిస్తూ.. రాజధాని నిర్మాణానికి రుణం మంజూరు చేసే విషయంలో నిబంధనల మేరకు వ్యవహరిస్తామని సమాచారం ఇచ్చింది. సెప్టెంబర్‌లో ప్రపంచ బ్యాంకు తనిఖీ బృందం రాజధానిలో పర్యటించి రూపొందించిన నివేదికను వెబ్సైట్లో పెట్టి ఆ తర్వాత తొలగించడం పట్ల సామాజిక కార్యకర్తలు లేఖలో అభ్యంతరం వ్యక్తం చేశారు. తమ తనిఖీ బృందం నివేదికను పరిశీలిస్తున్నామని, ఈ నెల 12న బ్యాంకు వెబ్సైట్లో దానిని అప్లోడ్ చేస్తామని ప్రపంచబ్యాంకు తెలిపింది. సామాజిక కార్యకర్తలు లేవనెత్తిన ప్రతి అంశాన్ని పరిశీలిస్తామని, రైతుల అభ్యంతరాలను ప్రభుత్వం పరిష్కరించిన తర్వాతే రుణ మంజూరు విషయంలో తదుపరి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చింది. సామాజిక కార్యకర్తలు లేవనెత్తిన అంశాలను పరిశీలించడానికి వీలుగా ఒక కమిటీ ఏర్పాటు చేసే యోచనలో ప్రపంచ బ్యాంకు ఉన్నట్లు సమాచారం. ప్రతిపాదిత కమిటీలో వివిధ రంగాల నిపుణులను నియమిస్తారని తెలిసింది. -
పట్టెడన్నం పెట్టే రైతుల్ని బిచ్చగాళ్లు చేస్తారా?
ప్రపంచ బ్యాంకు బృందం ఎదుట రాజధాని రైతుల ఆవేదన సాక్షి, అమరావతి బ్యూరో: అమరావతి నిర్మాణం పేరుతో రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న భూ అరాచకాలను రాజధాని ప్రాంత రైతులు ఎలుగెత్తి చాటారు. రైతుల ఫిర్యాదులపై పరిశీలన జరిపేందుకు నలుగురు ప్రతినిధుల తో కూడిన ప్రపంచబ్యాంకు తనిఖీ బృందం బుధవారం రాజధాని ప్రాంతంలో పర్యటిం చింది. తొలిరోజు నేలపాడు, పెనుమాక, ఉండవల్లి, ఎర్రబాలెం గ్రామాల్లో రైతులను కలుసుకుంది. కొండవీటివాగు పనుల కోసం, గుంటూరులో మంచినీటి సరఫరా పనుల కోసం పురపాలక సంస్థకు గతంలో ప్రపంచబ్యాంక్ కేటాయించిన నిధులు ఏమ య్యాయని ప్రశ్నించారు. వీటిపై సమగ్ర సమాచారం సేకరించాకే రాజధానికి రుణం మంజూరు పె ఓ నిర్ణయానికి రావాలని ఉండవల్లి, పెనుమాక, ఎర్రబాలెం రైతులు తనిఖీ బృందానికి విన్నవించారు. ప్రపంచ బ్యాంకు బృంద కమిటీ చైర్మన్ గంజోలా క్యాస్ట్రో డీలా మార్టాతోపాటు సభ్యులు జాన్ మాట్స్‌న్, డీలేక్ బారాలాస్, బిగేట్ క్యూబా బృందంలో ఉన్నారు. ‘రాజధానికి భూములు ఇవ్వడానికి మేం వ్యతిరేకం కాదు. రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం వేలాది ఎకరాలు భూములు సేకరిస్తే ఒప్పుకోం. భూ సమీకర ణ కింద రైతులంతా భూములిచ్చారని చెబు తున్నారు. మరి అదే నిజమైతే సీఆర్డీఏకు కేవలం 150 ఎకరాలే ఎందుకు రిజిస్ట్రేషన్ చేశారో గమనించాలి’ అని ఉండ వల్లిలో ఓ మహిళ ప్రపంచ బ్యాంకు బృందా న్ని కోరిం ది. ‘రాజధానికి నాలుగైదు వేల ఎకరాలు చాలు. కేవలం రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం 33 వేల ఎకరాలను సేకరిం చారు. ప్రపంచ బ్యాంకు రుణాన్ని కూడా స్వాహా చేసేందుకు యత్నిస్తున్నారు. పంట భూముల్లో రాజధాని ని నిర్మించడానికి కారణ మేంటో ప్రభుత్వం చెప్పాలి. ఫిర్యాదు చేసిన రైతులను ప్రభుత్వం వేధిస్తోంది. 3 పంటలు పండే భూములు ప్రభుత్వానికి ఇచ్చి.. గార్డెన్లలో, అపార్ట్మెంట్ల లో పనిచేయ మని సీఆర్డీఏ అధికారులు చెబుతున్నారు. పట్టెడన్నం పెట్టే మమ్మల్ని బిచ్చగాళ్లుగా మారుస్తామంటే ఎట్టి పరిస్థితు ల్లోనూ భూము లివ్వం. క్షేత్రస్థాయిలో పరిశీలి స్తే సర్కారు అరా చకాలు వెలుగు చూస్తాయి. ఆ తర్వాతే రాజ ధాని నిర్మాణానికి రుణం ఇచ్చే విషయంలో ఓ నిర్ణయానికి రండి’ అని రాజధాని రైతులు విజ్ఞప్తి చేశారు. -
కాఫీ డే ఆఫర్.. 1.81 రెట్లు సబ్స్రిప్షన్
ముంబై: కేఫ్ కాఫీ డే (సీసీడీ) చెయిన్‌ను నిర్వహించే కాఫీ డే ఎంటర్ప్రైజెస్ ఐపీఓ(ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్) 1.81రెట్లు సబ్‌స్క్రైబ్ అయింది. శుక్రవారం ముగిసిన ఈ ఐపీఓ ద్వారా రూ.1,150 కోట్లు సమీకరించాలని కంపెనీ యోచిస్తోంది. రూ.316-328 ప్రైస్‌బాండ్ ఉన్న ఈ ఐపీఓ మూడేళ్లలో అతి పెద్దది.ఈ కంపెనీ ఇప్పటికే రూ.334 కోట్లను యాంకర్ ఇన్వెస్టర్ల ద్వారా సమీకరించింది. పోర్టియాలోకి భారీ పెట్టుబడులు! హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: బెంగళూరు కేంద్రంగా హోమ్ హెల్త్ కేర్ సేవలందిస్తున్న పోర్టియా సిరీస్ బీ విభాగం కింద భారీ నిధులను సమీకరించింది. వెంచర్ క్యాప్టలిస్ట్ ఆక్సెల్, వెంచరీస్ట్, క్వాల్కంలతో పాటుగా వరల్డ్ బ్యాంక్ గ్రూప్ మెంబర్ ఇంటర్నేషనల్ ఫైనాన్స్ కార్పొరేషన్ (ఐఎఫ్‌సీ)లు పోర్టియాలో 37.5 మిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టారు. ‘‘ఈ నిధులను సంస్థ విస్తరణకు ఉపయోగిస్తాం. ప్రస్తుతం పోర్టియా దేశంలోని 24 నగరాల్లో నెలకు 60 వేలకు పైగా రోగులకు సేవలందిస్తుంది.ప్రస్తుతమున్న 3 వేల మంది ఉద్యోగులకు తోడుగా వచ్చే 18 నెలల్లో మరో 5 వేల మందిని నియమించుకుంటాం’అని ఎండీ అండ్ సీఈఓ మీనా గణేష్ ఒక ప్రకటనలో వివరించారు. నవంబర్ 5న టి-హబ్ ప్రారంభం హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: టెక్నాలజీ స్టార్టప్స్ కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేస్తున్న ఇంకుబేషన్ కేంద్రం ‘టి-హబ్’ ప్రారంభోత్సవం నవంబరు 5న జరగనుంది. ప్రముఖ వ్యాపారవేత్త రతన్ టాటా ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు. రూ.40 కోట్ల వ్యయంతో గచ్చిబౌలిలో 60,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో టి-హబ్‌ను నిర్మించారు. సీటింగ్ సామర్థ్యం 800. టి-హబ్‌లో స్థలం కోసం 400 స్టార్టప్స్ దరఖాస్తు చేసుకున్నాయని ఐటీ శాఖ కార్యదర్శి జయేశ్ రంజన్ శుక్రవారమిక్కడ వెల్లడించారు. 40 ఎంపిక చేశామని, వచ్చే నెలకల్లా వీటి సంఖ్య 200లకు చేరొచ్చని చెప్పారు. త్వరలో ప్రకటించనున్న ఇన్నోవేషన్ పాలసీతో స్టార్టప్స్‌కు జోష్‌నిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి అవసరమైన ఉత్పత్తులను స్టార్టప్స్ నుంచి కొనుగోలుతోపాటు ఈ కంపెనీలకు ఆర్థిక సహాయం, మెంటార్షిప్, తక్కువ ధరకు మౌలిక వసతులు కల్పిస్తామన్నారు. సామాజికంగా ప్రభావం చూపే స్టార్టప్స్‌ను ప్రోత్సహిస్తామని పేర్కొన్నారు.