
'ఎంసెట్ కౌన్సెలింగ్ జరగనివ్వం'
హైదరాబాద్: తెలంగాణ విద్యార్థులకు అన్యాయం చేయడానికి ఉన్నత విద్యా మండలి కంకణం కట్టుకుందని ఓయూ విద్యార్థి జేఏసీ నేతలు పిడమర్తి రవి, బాలరాజు ఆరోపించారు. ఎంసెట్ కౌన్సెలింగ్ పై సుప్రీంకోర్టు తీర్పు రాకముందే నోటిఫికేషన్ ఎలా ముందుకు వెళ్తారని వారు ఉన్నత విద్యా మండలి ఉన్నతాధికారులను ప్రశ్నించారు. ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ వేణుగోపాల్ రెడ్డి ఆంధ్రా మేధావుల ఫోరం వ్యక్తిగా ఏకపక్ష నిర్ణయం తీసుకున్నారని ఆరోపించారు.
ఎంసెట్ కౌన్సెలింగ్ ఎట్టి పరిస్థితుల్లో జరగనివ్వమని స్పష్టం చేశారు. ఆంధ్ర ప్రాంతంలో జరిగే కౌన్సెలింగ్లో తెలంగాణ కాలేజీల ఎంపిక విషయంలో ఆలోచించుకోవాలని ఓయూ విద్యార్థి జేఏసీ నేతలు తెలంగాణ విద్యార్థులకు సూచించారు. ఎంసెట్ కౌన్సెలింగ్ నోటిఫికేషన్ నిలుపివేయాలని జేఏసీ నేతలకు అంతకుముందు ఉన్నత విద్యామండలి కార్యదర్శి సతీష్ రెడ్డికి విజ్ఞాపన పత్రాన్ని అందజేశారు.