పండుగ పూట ఆకలికేకలు | outsourcing employees salary problems | Sakshi
Sakshi News home page

పండుగ పూట ఆకలికేకలు

Published Tue, Oct 8 2013 4:03 AM | Last Updated on Fri, Sep 1 2017 11:26 PM

outsourcing employees salary problems

 సాక్షి, మంచిర్యాల : జిల్లాలోని ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల, సిబ్బంది పరిస్థితి దీనంగా ఉంది. నెలల తరబడి వేతనాలు అందక, కుటుంబపోషణ భారమై అప్పుల పాలవుతున్నారు. వీరు ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా విధులు నిర్వర్తిస్తున్నా పాలకులు గుర్తించడం లేదు.  వేతనాల కోసం ఆందోళనలు చేపట్టాలని ఉన్నా ఉద్యోగాలు పోతాయనే భయంతో బాధిత ఉద్యోగులు, సిబ్బంది వెనుకంజ వేస్తున్నారు. ఈ నెల 14న దసరా, 16న బక్రీద్, నవంబర్ 2న దీపావళి పండుగల సందర్భంగానైనా పాలకులు వేతనాలు విడుదల చేస్తారని వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. జిల్లాలోని కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ కార్మికుల దుస్థితిపై ‘న్యూస్‌లైన్’ కథనం.
 
 చితికిన సాక్షర భారత్ కో-ఆర్డినేటర్లు
 గ్రామీణ మహిళలను అక్షరాస్యులుగా తీర్చిదిద్దడానికి కేంద్ర ప్రభుత్వం సాక్షర భారత్ పథకాన్ని ప్రవేశపెట్టింది. పర్యవేక్షణ బాధ్యత వయోజన విద్యాశాఖకు అప్పగించింది. జిల్లా వ్యాప్తంగా 52 మంది మండల కో-ఆర్డినేటర్లు, గ్రామ పంచాయతీకి ఇద్దరి చొప్పున 1,732 గ్రామ కో-ఆర్టినేటర్లు ఉన్నారు. మండల కో-ఆర్టినేటర్లకు నెలకు రూ.6 వేలు, గ్రామ కో-ఆర్డినేటర్లకు రూ.2 వేల వేతనం. వీరికి 11 నెలలుగా వేతనాలు అందడం లేదు. మండల కో-ఆర్టినేటర్లకు రూ.34.32 లక్షలు, గ్రామ కో-ఆర్డినేటర్లు రూ. 3,81,04,000 మొత్తం రూ.4,15,36,000 ప్రభుత్వం బకాయి ఉంది.
 
 నిరాశలో ‘ఆయుష్’
 జిల్లావ్యాప్తంగా 91 ఆయుష్ డిస్పెన్సరీలు ఉన్నాయి. ఒక్కో డిస్పెన్సరీకి ఒక్కో వైద్యుడి చొప్పున 91 మెడికల్ ఆఫీసర్ల పోస్టులున్నాయి. నేషనల్ రూరల్ హెల్త్ మిషన్ (ఎన్‌ఆర్‌హెచ్‌ఎం) కింద కాంట్రాక్టు పద్ధతిలో 10 మంది వైద్యులు, 23 మంది కాంపౌండర్లు, 39 మంది ఎస్‌ఎన్‌వోలు విధులు నిర్వర్తిస్తున్నారు. వీరికి ఆగస్టు, సెప్టెంబర్ వేతనం రావాల్సి ఉంది. వైద్యులకు ఒక్కొక్కరికి నెలకు రూ.18 వేల చొప్పున రూ.3.60 లక్షలు, కాంపౌండర్లకు రూ.9,200 చొప్పున రూ.4,23,200, ఎస్‌ఎన్‌వోలకు రూ.6,700 చొప్పున  రూ. 5,22,600.. అందరికి కలిపి రూ.13,05,800 రావాల్సి ఉంది.
 
 అధ్యాపకులకు అందని వేతనాలు
 ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో అధ్యాపకుల కొరతతో ప్రభుత్వం 150 మంది కాంట్రాక్టు అధ్యాపకులను నియమించింది. వీరికి నెలకు రూ.21 వేలు వేతనం. జూలై, ఆగస్టు, సెప్టెంబర్ నెలల వేతనాలు రావడం లేదు. 150 మందికి కలిపి నెలకు రూ.31.50 లక్షల చొప్పున మూడు నెలలకు రూ.94.50 లక్షల వేతనం రావాలి.
 
 పంచాయతీ కార్మికులు పస్తులే..
 జిల్లాలో 866 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. వీటిలో కారోబార్లు, ఎన్‌ఎంఆర్‌లు, పారిశుధ్య కార్మికులు, ఎలక్ట్రీషియన్లు, ఫిట్టర్లు, పంపు మెకానిక్‌లు, అటెండర్లు 3 వేల మంది పని చేస్తున్నారు. వీరిలో 2,490 మందికి నెలల తరబడి వేతనాలు లేవు. అత్యధికంగా రూ.3,500.. అత్యల్పంగా రూ.1000 వరకు వేతనాలు ఉంటాయి. సగటున రూ.1500 తీసుకుంటే నెలకు 2,490 మందికి రూ. 37.35 లక్షలు, మూడు నెలలకు కలిపి రూ.1,12,05,000 బకాయి ఉంది.
 
 ఐకేపీ వీవోఏ
 మండల సమాఖ్య కమ్యూనిటీ కో-ఆర్డినేటర్(విలేజ్ ఆర్గనైజర్ అసిస్టెంట్లు) ఇందిరాక్రాంతి పథంలో కీలక ప్రాత పోషిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 1,600 మంది ఉన్నారు. వీరికి ప్రతి నెల రూ.2 వేలు ఇవ్వాల్సి ఉంది. కానీ మూడు నెలల నుంచి వేతనాలు అందలేదు. నెలకు రూ.32 లక్షల చొప్పున, మూడు నెలలకు కలిపి రూ.96 లక్షలు రావాలి.
 
 104కు ఆగిన వేతనం, డీఏ..
 104 సర్వీసులు జిల్లా వ్యాప్తంగా 25 ఉన్నాయి. ఫార్మసిస్టు, డ్రైవర్, ల్యాబ్ టెక్నీషియన్, డాటా ఎంట్రీ ఆపరేటర్లు 80 మంది ఉన్నారు. ఒక్కొక్కరికి ఒక్కో వేతనం ఉంటుంది. అందరికీ కలిపి ప్రతి నెల రూ.25 లక్షల వేతనం రావాలి. దీంతోపాటు ప్రతి సిబ్బందికి రోజుకు రూ.75 చొప్పున నెలలో 24 రోజులపాటు రూ.1,800 డీఏ రావాల్సి ఉంది. కానీ ఆగస్టు, సెప్టెంబర్ నెలల వేతనం, జూలై నుంచి డీఏ అందలేదు. రూ.50 లక్షల వేతనం, రూ.4.32 లక్షల డీఏ కలిపి రూ. 54.32 లక్షలు రావలి.
 
 విద్యుత్ ఆపరేటర్లదీ గోసే..
 33/11 కెవి విద్యుత్ స్టేషన్లు జిల్లావ్యాప్తంగా 130 వరకు ఉన్నాయి. ఆపరేటర్లకు ప్రతి నెల రూ.7,400, వాచ్‌మెన్‌లకు రూ.3,500 వేతనం. ఆరు నెలల నుంచి వేతనాలు రావడం లేదు. ఆపరేటర్లకు రూ.2,30,88,000, వాచ్‌మెన్‌లకు రూ.27.30 లక్షలు, మొత్తం రూ. 2,58,18,000 రావాలి.
 
 బోధకులకు తప్పని తిప్పలు
 జిల్లాలో ప్రభుత్వ ఇంటర్, డిగ్రీ కాలేజీల్లో విద్యార్థుల సంఖ్యకు అనుణంగా అధ్యాపకులు లేవు. దీంతో ప్రభుత్వం ఐదేళ్ల క్రితమే ఇంటర్ కాలేజీల్లో 500 మంది.. డిగ్రీ కాలేజీల్లో 99 మంది కాంట్రాక్టు లెక్చరర్లను నియమించింది. ఇంటర్ అధ్యాపకులకు ప్రతి నెల రూ.18 వేలు, డిగ్రీ అధ్యాపకులకు రూ. 21 వేలు ఇవ్వాలి. మూడు నెలల నుంచి నయాపైసా విదిల్చలేదు. ఇంటర్ అధ్యాపకులకు రూ.2.70 కోట్లు, డి గ్రీ అధ్యాపకులకు రూ.62.37 లక్షలు రావాలి.
 
 పంపు మెకానిక్‌ల బాధలు..
 జిల్లావ్యాప్తంగా అన్ని మండల  పరిషత్ కార్యాలయాల్లో కాంట్రాక్టు పద్ధతిలో 55 మంది పంప్ మెకానిక్‌లు పనిచేస్తున్నారు. వీరికి ఆర్‌డబ్ల్యూఎస్‌కు వచ్చే గ్రాంట్ల నుంచి వేతనాలు ఇవ్వాలి. ఒక్కొక్కరికి ప్రతి నెల రూ.5 వేల చొప్పున రూ. 2.75 లక్షల వేతనం. కొందరికి 16 నెలల నుంచి వేతనాలు అందకపోతే ఇంకొందరికి ఆరు నెలల నుంచి లేవు. వేమనపల్లి మండల కార్యాలయంలో పని చేసే సిబ్బందికి, కోటపల్లి సిబ్బందికి 15 నెలల నుంచి వేతనాలు అందలేదు. సగటున 8 నెలల వేతనాలు లెక్కిస్తే.. దాదాపు రూ. 22 లక్షల వేతనాలు పెండింగ్‌లో ఉన్నాయి.
 
 అప్పులతో నెట్టుకొస్తున్న..
 నా పేరు గాందర్ల సాయిబాబ. రెబ్బెన మండల సాక్షరభారత్ కో-ఆర్డినేటర్ గా పని చేస్తున్నా. పీజీ వరకు చదివా. చేసేందుకు ఎన్నో ఉద్యోగాలున్నా నిరక్షరాస్య మహిళలను అక్షరాస్యులుగా తీర్చిదిద్దేందుకు కేంద్రం ప్రారంభించిన సాక్షరభారత్‌లో మండల కో-ఆర్డినేటర్‌గా చేరా. నెలకు రూ.6 వేల గౌరవ వేతనం ఇవ్వాల్సి ఉంది. కానీ 11 నెలల నుంచి అందలేదు. నాకు పెళ్లయింది. వే తనాలు అందక ఆర్థికంగా ఇబ్బందిపడుతున్నా. దసరా, దీపావళి పండుగ ఉంది. ఇప్పటికే అప్పులు చేశా. పండుగ జరుపుకోవాలంటే మళ్లీ అప్పు చేయక తప్పదు. అధికారులు చర్యలు తీసుకుని మాకు వేతనాలు అందేలా చర్యలు తీసుకోవాలి.
 
 ఆరు నెలలుగా రావడం లేదు..
 నా పేరు ఆత్రం బాపు. బెజ్జూరు మండల పరిషత్ కార్యాలయం లో బోరు మెకానిక్‌గా పని చేస్తు న్నా. గ్రామాల్లో బోర్లు పాడైతే వెళ్లి మరమ్మతు చేస్తా. అధికారు లు ప్రతిరోజు రూ.285 ఇస్తారు. కానీ అవి ప్రతి నెల అందవు. ఆరు నెలలకోసారి వస్తాయి. అప్పటి వరకు అప్పులు చేయక తప్ప దు. బోర్లు మర మ్మతు చేసినప్పుడు సర్పంచులు రూ.50, రూ.100 ఇస్తారు. అవి పెట్రోల్‌కే అయిపోతాయి. కుటుంబ పోషణ భారంగా ఉంది. ప్రతి నెల వేతనాలందేలా చర్యలు తీసుకోవాలి.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement