విజయనగరం కంటోన్మెంట్, న్యూస్‌లైన్: కడుపు మండిన కార్మికులు కదం తొక్కారు. విజయనగరంలోని లక్ష్మీ శ్రీనివాసా జూట్‌మిల్లు ఆధ్వర్యంలో నడుస్తున్న అరుణా, ఈస్ట్ కోస్టు జూట్‌మిల్లులను వెంటనే తెరిపించి తమకు రావాల్సిన బకాయిలను ఇప్పించాలని డిమాండ్ చేశారు. సోమవారం కలెక్టరేట్ ఎదురుగా జూట్‌మిల్ కార్మికులంతా పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా కార్మిక నాయకులు కె సన్యాసిరావు, బి శంకరరావు, టీవీ. రమణలు మాట్లాడుతూ గత కొంతకాలంగా లక్ష్మీ శ్రీనివాసా జూట్‌మిల్లుల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అరుణా, ఈస్ట్ కోస్టు జూట్‌మిల్లుల యాజమాన్యం కార్మికుల తరఫున జమ చేయాల్సిన ప్రావిడెంట్ ఫండ్ చెల్లించకపోవడమే కాకుండా కార్మికుల నుంచి వసూలు చేసిన సొమ్ము కూడా కాజేయడం దారుణమని ఆరోపించారు.
కార్మికులకు ప్రయోజనాలు కల్పించాల్సిన యాజమాన్యమే ఇలా కార్మికులు కష్టాన్ని కాజేయడం ఎంత వరకూ సమంజసమో చెప్పాలంటూ ధ్వజమెత్తారు. అరుణా, ఈస్ట్ కోస్టు, బొబ్బిలి యూనిట్లలో ఈ విధంగా కార్మికుల సొమ్మును కాజేశారని కార్మిక నాయకులు ఆరోపించారు. కోట్లాది రూపాయల పీఎఫ్, ఎల్‌ఐసీ, ఈఎస్‌ఐ, గ్రాట్యుటీ బకాయిలు సకాలంలో చెల్లించడం లేదని ఆరోపించారు. ఆయా మిల్లుల్లో గుర్తింపు సంఘాలు, వివిధ ప్రతిపక్ష కార్మిక సంఘాల తరపున పలుమార్లు ఆందోళనలు చేపట్టినా యాజమాన్యం పరిష్కారానికి ముందు కు రావడం లేదని వాపోయారు.
గత కలెక్టర్ హయాంలో వారం రోజు లపాటు నిరసన దీక్షలు చేపట్టిన ఫలితంగా జరిగిన ఒప్పందాన్ని కూడా యాజమాన్యం అమలు చేయలేదని ఆందోళన వెలిబుచ్చారు. యాజమాన్యం నిర్లక్ష్య చర్యలు, దోపిడీ విధానంతో మే 22నుంచి అరుణా జూట్‌మిల్లులోని కార్మికులు, మే 31 నుంచి ఈస్ట్ కోస్టు జూట్ మిల్లు కార్మికులు విధులను బహిష్కరించాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. బొబ్బిల జూట్ మిల్లు కూడా నేడో రేపో మూతపడే పరిస్థితి ఉందన్నారు. సుమారు 10 వేల మంది కార్మికులు రోడ్డున పడే దయనీయ పరిస్థితి నెలకొందని ఆవేదన వెళ్లగక్కారు. అనంతరం కార్మికులంతా జేసీరామారావును కలిసి వినతిపత్రాన్ని అందజేశారు.
మీరేం చేస్తున్నారు ? : జేసీ
కార్మికులంతా ఇంత నష్టానికి గురవుతుంటే మీరేం చేస్తున్నారు? కార్మికుల పక్షాన మీరు నోడల్ అధికారి కదా! పీఎఫ్ తినేయడం వంటి చర్యలకు పాల్పడుతున్న యా జమాన్యాలపై మీ ఉన్నతాధికారులకు మీరే చెప్పవచ్చు కదా అంటూ డీసీఎల్ ఆనందరావుపై జాయింట్ కలెక్టర్ బి రామారావు ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లాలో కార్మికుల సమస్యలు పెరిగిపోతున్నాయి. ఎస్‌ఎంఎస్, అరుణా, ఈస్ట్ కోస్టు వంటి మిల్లుల్లో కార్మికులకు అన్యాయం జరగుతుంటే మీరేం చేస్తున్నారని ప్రశ్నించడంతో లేఖ రాశానని డీసీఎల్ సమాధానమిచ్చారు.
దీంతో జేసీ మాట్లాడుతూ కార్మికులకు న్యాయం చేసే విధంగా వ్యవహరించండని అనడంతో ఆయన వెంటనే విశాఖలోని కమిషనర్ ఆఫ్ లేబర్‌తో మాట్లాడారు. వెంటనే ఫోన్‌ను అందుకున్న జేసీ కమిషనర్‌తో మాట్లాడుతూ యాజమాన్యం, కార్మికులతో సమావేశం నిర్వహించి కార్మికులకు ఆయా యాజమాన్యాలు ఎంత మేరకు బకాయిలు ఉన్నాయో పరిశీలించి వెంటనే చర్యలు తీసుకోవాలన్నారు. దీంతో కార్మికులు కాస్త శాంతించి ధర్నా విరమించి వెనుదిరిగారు.
కదం తొక్కిన కార్మికులు
Published Tue, Jun 3 2014 1:18 AM | Last Updated on Sat, Sep 2 2017 8:13 AM
Advertisement
Advertisement