ఆస్పత్రిలోకి వీల్‌చైర్‌లో అరుణను తీసుకొస్తున్న స్థానికులు
దాడికి పాల్పడింది ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు రియాజ్ అనుచరులే
కులంపేరుతో దూషించినట్లు పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితురాలు అరుణ
పార్టీ అధినేత పవన్‌కళ్యాణ్‌కు ఫిర్యాదు చేసినా స్పందన నిల్
ఒంగోలు టౌన్ : జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి రాయపాటి అరుణ మీద అదే పార్టీకి చెందిన జిల్లా అధ్యక్షుడు రియాజ్ వర్గం దాడికి పాల్పడ్డారు. ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలం దాసరివారిపాలెం కనపర్తిల వద్ద జరిగిన ఈ ఘటన జిల్లాలో సంచలనం రేకెత్తించింది. బాధితురాలు అరుణ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు వివరాలిలా ఉన్నాయి. ముక్తినూతలపాడు గ్రామానికి చెందిన రాయపాటి అరుణ జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధిగా వ్యవహరిస్తున్నారు. ఆదివారం నాగులుప్పలపాడు మండలంలోని ఎన్జీపాడు, వినోదరాయునిపాలెం, అమ్మనబ్రోలు, దాసరిపాలెం, కనపర్తి గ్రామాల్లో జెండా ఆవిష్కరణ కార్యక్రమానికి హాజరయ్యారు.
రాత్రి 9 గంటల సమయంలో తిరుగు ప్రయాణంలో దాసరివారిపాలెం గ్రామ శివారు వద్దకు రాగానే జనసేన జిల్లా అధ్యక్షుడైన షేక్ రియాజ్ అనుచరులు ఒంగోలుకు చెందిన చెనపతి రాంబాబు, ఆరిగ శివ, షాలు, చిట్టెం ప్రసాద్, పల్లి రాజేష్, ముత్యాల కళ్యాణ్ రియాజ్ ప్రోత్సాహంతో కారును అడ్డగించారు. కారులో ఉన్న అరుణ అనుచరుడైన చరణ్‌ను బయటకు లాగి కొట్టారు. ఈ దాడి నుంచి చరణ్ తప్పించుకుని తిరిగి కారులో బయలు దేరినా విడిచిపెట్టకుండా రియాజ్ అనుచరులు కారును వెంబడించారు. కనపర్తి గ్రామం వద్ద అటకాయించారు.
మహిళ అని కూడా చూడకుండా ఛాతిపై చెయ్యివేసి గుండెల మీద బలంగా పిడి గుద్దులు గుద్దారు. అదే కారులో ఉన్న ఉప్పుగుండూరుకు చెందిన జనసేన నాయకుడు బాలిశెట్టి నాగేశ్వరరావు అడ్డుపడగా చిట్టెం ప్రసాద్ ఆయనపై కర్రలతో దాడి చేసి కొట్టారు. ఈ దాడిలో అతడి తల పగిలి రక్త స్రావం కావడంతో స్థానికుల సాయంతో బయట పడ్డారు. అక్కడి నుంచి తప్పించుకున్న అరుణ నేరుగా ఒంగోలు జీజీహెచ్‌కు వెళ్లి చికిత్స చేయించుకున్నారు. అరుణ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. దాడి విషయాన్ని పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లినా పొత్తులతో బిజీగా ఉన్నామని, ఎన్నికలయ్యాక చూద్దాంలే అని తేలిగ్గా
తీసుకున్నట్టు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment