కల్లూరు రూరల్, న్యూస్‌లైన్: తపాలా శాఖలో ఉద్యోగ నియామకాలపై నిషేధాన్ని ఎత్తివేయాలని పీ3 డివిజన్ కార్యదర్శి శ్రీనివాసరెడ్డి డిమాండ్ చేశారు. కర్నూలు హెడ్ పోస్టాఫీసు వద్ద బుధవారం తపాలా ఉద్యోగులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పోస్టల్ శాఖలో ఏళ్ల తరబడి ఉద్యోగ నియామకాలు లేవన్నారు. ఇది చాలదని ప్రభుత్వం కొత్తగా నియామకాలపై నిషేధం విధించే నిర్ణయం తీసుకోవడం మూలిగే నక్కపై తాటికాయ పడ్డ చందంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే ఉద్యోగులపై పనిఒత్తిడి పెరిగిందని, ప్రభుత్వం ఇలాంటి చర్యలు చేపడితే ఉద్యోగులు మానసిక వికలాంగులుగా మారే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తపాలా వ్యవస్థను నిర్వీర్యం చేసేందుకు కుట్ర పన్నుతోందని ఆరోపించారు. నిరుద్యోగ సమస్యను పెంచేందుకే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని విమర్శించారు. కార్యక్రమంలో జీడీఎస్ డివిజన్ కార్యదర్శి లక్ష్మీకాంత్, పీ4 పోస్టుమన్ యూనియన్ డివిజన్ కార్యదర్శి ఈశ్వరయ్య, మహిళా నాయకురాళ్లు గాయత్రి, అరుణ, అంకిత పాల్గొన్నారు.