పంచాయతీలకు షాక్
పంచాయతీలకు సంబంధించి పేరుకుపోయిన విద్యుత్ బకాయిలను ముక్కు పిండి వసూలు చేసేందుకు ఆ శాఖ సమాయత్తమవుతోంది. ఇప్పటికే నిధులు లేక నీరసించిన స్థానిక సంస్థల మెడకు ఇది గుదిబండగా మారనుంది. ప్రభుత్వం స్పందించి తగు చర్యలు తీసుకోని పక్షంలో జిల్లాలోని వందలాది పంచాయతీల్లో చీకట్లు అలుముకోనున్నాయి. మరోవైపు మున్సిపాలిటీలు, నెల్లూరు కార్పొరేషన్‌లోనూ అదే పరిస్థితి నెలకొననుంది.
నెల్లూరు(హరనాథపురం), న్యూస్‌లైన్ : జిల్లాలో 40 మేజర్, 900 మైనర్ గ్రామ పంచాయతీలున్నాయి. ప్రతి పంచాయతీ వీధిదీపాలు, మంచినీటి పథకాల నిర్వహణకు సంబంధించి విద్యుత్ కనెక్షన్లు కలిగి ఉన్నాయి. వీటికి సంబంధించి విద్యుత్ బిల్లులను ఐదేళ్ల క్రితం వరకు పంచాయతీల తరఫున ప్రభుత్వమే చెల్లించేది. అనంతరం ఆ బాధ్యతను పాలకమండళ్లకే వదిలేసింది. మొదట్లో కొంతకాలం బిల్లులను సక్రమంగా చెల్లించినా చాలా పంచాయతీలు తర్వాత కట్టడం మానేశాయి. ఎప్పటికైనా ప్రభుత్వం చెల్లించికపోతుందా..అనే ధీమాతోనే బకాయిలను పెండింగ్‌లో పెట్టినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో జిల్లా వ్యాప్తంగా బకాయిలు రూ.45.22 కోట్లకు చేరుకున్నాయి.
వీటి వసూలు విషయంలో కఠినంగా వ్యవహరించాలని, అవసరమైతే సరఫరా అయినా నిలిపేయాలని క్షేత్రస్థాయి సిబ్బందికి విద్యుత్ శాఖ అధికారులు సూచించినట్లు సమాచారం. ఇదే జరిగితే జిల్లాలోని అనేక గ్రామాలు సమస్యల్లో చిక్కుకునే ప్రమాదం నెలకొంది. తాగునీటి సరఫరా నిలిచిపోవడంతో పాటు వీధిలైట్లు వెలగక వీధులు చిమ్మచీకట్లో చిక్కుకోనున్నాయి. మరోవైపు ఇప్పటికప్పుడు ఈ బిల్లులు చెల్లించే పరిస్థితిలో కూడా పంచాయతీలు లేవు. సకాలంలో ఎన్నికలు నిర్వహించకపోవడంతో పంచాయతీలకు ప్రభుత్వం నుంచి పలు రకాల నిధుల విడుదల నిలిచిపోయింది.
కొన్ని నెలల క్రితం ఏర్పడిన పాలకవర్గాలు ఇప్పుడిప్పుడే పాలనపై దృష్టి పెడుతున్నాయి. ఈ సమయంలోనే విద్యుత్ బకాయిల సమస్య సర్పంచ్‌లకు పెద్ద సవాల్‌గా మారింది. కాలిపోయిన మోటార్ల మరమ్మతులు, సిబ్బంది జీతభత్యాల చెల్లింపునకే ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో బకాయిల చెల్లింపునకు నూతన ప్రభుత్వ సహకారం కోసం పంచాయతీలు ఎదురు చూస్తున్నాయి.
అన్ని స్థానిక సంస్థలది అదే పరిస్థితి
పంచాయతీలతో పాటు జిల్లాలోని మున్సిపాలిటీలు, కార్పొరేషన్ కూడా విద్యుత్ బకాయిల సమస్యను ఎదుర్కొంటున్నాయి. నెల్లూరు కార్పొరేషన్ ఇప్పటికే రూ.21.4 కోట్ల బకాయి పడడంతో పదిహేను రోజుల క్రితం కార్యాలయానికి విద్యుత్ సరఫరా నిలిపేశారు. వెంటనే స్పందించకుంటే వీధిలైట్లు, మంచినీటి పథకాలకు కూడా విద్యుత్ సరఫరా నిలిపేస్తామని హెచ్చరించారు. మరోవైపు మున్సిపాలిటీలు కూడా విద్యుత్ శాఖకు రూ.2.12 కోట్లు చెల్లించాల్సి ఉంది.
2009 నుంచి పెండింగ్
పంచాయతీలకు సంబంధించిన విద్యుత్ బకాయిల చెల్లింపు 2009 నుంచి నిలిచిపోయింది. అంతకుముందు మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ఓ జీఓ విడుదల చేశారు. పంచాయతీలను విద్యుత్ బిల్లుల నుంచి మినహాయించాలని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అందులో భాగంగా 2009 వరకు ప్రభుత్వమే విద్యుత్ బిల్లులను చెల్లించేది.
మహానేత మరణానంతరం అధికారం చేపట్టిన వారు ఈ విషయాన్ని పట్టించుకోకపోవడంతో పంచాయతీలకు భారం పెరిగిపోయింది. రాష్ట్ర విభజనకు ముందు వరకు సీఎంగా వ్యవహరించిన కిరణ్‌కుమార్‌రెడ్డి బకాయిలు చెల్లిస్తామని, బిల్లులను ప్రభుత్వమే కట్టేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినా ఒక్క రూపాయి విదల్చలేదు. త్వరలో ఏర్పడబోతున్న ప్రభుత్వమైనా ఈ విషయంలో తగిన నిర్ణయం వెంటనే తీసుకోవాలని పంచాయతీ పాలకమండళ్లు కోరుతున్నాయి.