సివిల్స్‌లో మంచి ర్యాంకు సాధించి ఐఏఎస్, ఐపీఎస్ కావాలని యువత ఎన్నో కలలు కంటుంది. సివిల్స్ సాధన ఎంతోమందికి జీవితాశయం. తమ ఎదురుగా ఉన్న కలెక్టర్, ఎస్పీ, ఇతర అధికారులను రోల్ మోడల్‌గా తీసుకుని సివిల్స్ సాధించినవారు ఎంతోమంది ఉన్నారు. అయితే తిరుపతి లాంటి చిన్న నగరంలో సివిల్స్‌కు శిక్షణ ఇచ్చేందుకు సరైన కేంద్రాలు లేవు. ఆశ ఉన్నా, ఆర్థిక వనరులు లేక చాలామంది ఈ కోర్సుల్లో శిక్షణ పొందేందుకు దూర ప్రాంతాలకు వెళ్లలేరు. యువత బలహీనతను ఉపయోగించుకుని దోపిడీకి తెరలేపింది మహిళా వర్సిటీ.
సాక్షి, తిరుపతి : సివిల్స్‌కు యూనివర్సిటీలో శిక్షణ అనగానే చాలా ఉన్నత ప్రమాణాలు ఉంటాయని భావిస్తారు. అయితే అక్కడ సరిపడా అధ్యాపకులు లేరు. ఫీజులు మాత్రం కార్పొరేట్‌కు ఏమాత్రం తీసిపోవు. మహిళా విశ్వవిద్యాలయం ఉన్నతాధికారులు కమీషన్లకు కక్కుర్తిపడి కోర్సు నిర్వహణను ప్రయివేటు సంస్థకు అప్పజెప్పినట్టు ఆరోపణలున్నాయి. మహిళలకు ఉన్నత విద్యను అందించి వారిని ఉన్నత స్థానాల్లో నిలిపి మహిళా సాధికారత సాధించాలనే లక్ష్యంతో శ్రీ పద్మావతీ మహిళా విశ్వవిద్యాలయం ఏర్పాటైంది. కొంతమంది అధికారుల స్వార్థానికి లక్ష్యం నీరుగారుతోంది.
గత ఏడాది ప్రైవేటు సంస్థతో వర్సిటీ అవగాహన ఒప్పందం (ఎంఓయూ) కుదుర్చుకుని బీఏ/ఎంఏ పబ్లిక్ పాలసీ అండ్ ఆంత్రోపాలజీ పేరిట కోర్సును ప్రారంభించింది. 60 సీట్లు పెట్టింది. ఎస్‌పీఎంవీవీ సెట్‌ద్వారా ఇందులో ప్రవేశం కల్పిస్తోంది. గత విద్యాసంవత్సరంలో ఈకోర్సును ప్రారంభించింది. 30 మంది అడ్మిషన్ పొందారు. ఈ ఏడాది నిర్వహించిన ప్రవేశ పరీక్షకు 80 మంది దరఖాస్తు చేయగా, 18 మంది అర్హత సాధించారు. దీంతో సీట్లు మిగిలిపోయాయి. మిగిలిన సీట్లను భర్తీ చేసేందుకు స్పాట్ అడ్మిషన్లు నిర్వహించాలని అధికారులు ప్రయత్నిస్తున్నారు. కోర్సు ఫీజు రూ.1.2లక్షలు బీఏ/ఎంఏ పబ్లిక్ పాలసీ అండ్ ఆంత్రోపాలజీ కోర్సులో భాగంగా యూనివర్సిటీతో పారా అసోసియేషన్ ఆఫ్ రూరల్ డెవలప్‌మెంట్(పీఏఆర్‌డీ) సంస్థ కుదుర్చుకున్న ఒప్పందం మేరకు ఉదయం డిగ్రీ కోర్సుకు తరగతులు నిర్వహిస్తారు. మధ్యాహ్నం సివిల్స్‌లో శిక్షణ ఇస్తారు. వారాంతాల్లో మోడల్ టెస్టులు నిర్వహిస్తారు.
ఈకోర్సు ఫీజు చూస్తే దిమ్మతిరగాల్సిందే. సెమిస్టర్‌కు సుమారు రూ.58,950. ఇవీగా కుండా అడ్మిషన్ ఫీజు, ఇతర ఫీజులు కలిపితే ఏడాదికి రూ.1.2లక్షలు చెల్లించాల్సిందే. ఇంత ఫీజు చెల్లించినా నాణ్యమైన విద్యను అందిస్తున్నారంటే అదీలేదు. అధ్యాపకులు లేరు ఏదైనా కోర్సును యూనివర్సిటీలో ప్రారంభించాలంటే ముందుగా అధ్యాపకులను నియమించుకోవాలి. మహిళా వర్సిటీలో సివిల్స్ శిక్షణ కోర్సు నిర్వహణను పూర్తిగా ప్రైవేటు సంస్థకు అప్పగించారు. ఈసంస్థ ఎలాంటి సిలబస్ పెట్టిందో వర్సిటీకి తెలియదు. అధ్యాపకులకు ఎలాంటి అర్హతలున్నాయనే అంశాన్ని కూడా పరిగణించడంలేదు. ఈకోర్సు నిర్వహణపై ఎవరైనా ప్రశ్నిస్తే అధికారులు సరిగా స్పందించడంలేదు. కనీసం క్యాంపస్‌కు చెందిన ఒక అధ్యాకుడిని కూడా కోర్సు ఇన్‌చార్జిగా నియమించలేదు. అధ్యాపకులు, సిలబస్ వివరాలు వెల్లడించడం లేదు. ప్రైవేటు సంస్థ కూడా ఇంజినీరింగ్ బ్యాక్‌గ్రౌండ్‌లేని వ్యక్తిని కోర్సు ఇన్‌చార్జిగా నియమించడంతో కోర్సు నిర్వహణ అధ్వానంగా తయారైంది. ఉపకార వేతనాలు లేవు యూనివర్సిటీకి సంబంధం లేకుండా ప్రైవేటు సంస్థ పర్యవేక్షణలో సాగుతున్న ఈకోర్సులో చేరిన విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ గాని, ఉపకారవేతనాలు గానీ వచ్చే అవకాశం లేదు. కోర్సు ఫీజు చాలా ఎక్కువగా ఉంది.
కార్పొరేట్ సంస్థల్లో కూడా ఈ స్థాయిలో ఫీజులు వసూలు చేయడంలేదు. ప్రభుత్వ రంగసంస్థ, మహిళలకు తక్కువ ఖర్చుతో ఉన్నత విద్యను అందించాల్సిన మహిళా వర్సిటీ విద్యార్థుల నుంచి దోపిడీకి ప్రైవేటు సంస్థకు లైసెన్స్ ఇవ్వడం విమర్శలకు తావి స్తోంది. ఎస్వీయూలో కూడా గ్రూప్స్, ఇతర పోటీ పరీక్షలకు ఎలాంటి ఫీజులు లేకుండా ఉచిత శిక్షణ ఇస్తున్నా రు. మహిళా వర్సిటీ కూడా తమ విద్యార్థులకు సామాజిక బాధ్యతతో నిపుణులను పిలిపించి సివిల్స్ శిక్షణ ఇప్పించవచ్చు. ఇందుకోసం యూజీసీ, ఇతర సంస్థలు అవసరమైన నిధులు కూడా సమకూర్చుతాయి. వర్సిటీ అధికారులు ఆ ప్రయత్నం చేయకుండా ప్రైవేటు సంస్థకు కట్టబెట్టి దగ్గరుండి దోపిడీ చేయిస్తున్నారు. ఈ వ్యవహారంలో అధికారులు భారీ ఎత్తున కమీషన్లు పొందినట్టు ఆరోపణలు ఉన్నాయి. రాయలసీమ విద్యార్థులంతా ఆర్థికంగా వెనుకబడినవారే. డబ్బున్న వారు మాత్రమే ప్రైవేటు వర్సిటీలు, ఇతర కార్పొరేట్ సంస్థల్లో చదువు కోవడానికి వెళుతారు. కానీ ఇక్కడ విభిన్నంగా దోపిడీ పర్వం సాగుతుండడం విశేషం.
ఎంవోయూ మేరకే..
మహిళా వర్సిటీ, పీఏఆర్‌డీ సంస్థల మధ్య కుదుర్చుకున్న ఒప్పందంలో భాగంగానే ఈ కోర్సును నిర్వహిస్తున్నాం. ఈ కోర్సు నిర్వహణ మొత్తం ఆ సంస్థ చూస్తుంది. అధ్యాపకులు, బోధన, ఇతర అంశాలు పర్యవేక్షిస్తుంది. సిలబస్ మాత్రం యూనివర్సిటీ కొంతమంది నిపుణులతో కమిటీ వేసి రూపొందిం చింది. ప్రభుత్వం గతంలో ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యం (పీపీపీ) విధానం అమలులోకి తెచ్చింది. దీనిని దృష్టిలో ఉంచుకుని విద్యార్థులకు సివిల్స్‌లో శిక్షణ ఇప్పించేందుకు ఆసంస్థతో ఒప్పదం కుదుర్చుకున్నాం. విద్యార్థులు చెల్లించిన ఫీజులో 70 శాతం పిఏఆర్‌డీ సంస్థకు, 30 శాతం వర్సిటీకి లభిస్తోంది. మహిళా వర్సిటీ కేవలం తరగతి గదులు, ఇతర సదుపాయాలు మాత్రమే కల్పిస్తుంది.
–ప్రొఫెసర్ వి.ఉమ, ఇన్‌చార్జి వీసీ, శ్రీపద్మావతి మహిళా వర్సిటీ
Comments
Please login to add a commentAdd a comment