నిజాం సొమ్ము కోసం 'పాక్' లాట
సాక్షి, హైదరాబాద్: లండన్‌లోని వెస్ట్ మినిస్టర్ బ్యాంకులో 7వ నిజాం నవాబు మీర్ ఉస్మాన్ అలీఖాన్ దాచిన సొమ్ముపై ఇప్పుడు భారత్, పాకిస్థాన్‌ల మధ్య న్యాయపోరాటం సాగుతోంది. ఆ బ్యాంకులోని నిజాం నవాబు అకౌంటు నుంచి 1947-48 ప్రాంతంలో అప్పటి పాకిస్థాన్ హైకమిషనర్ హబీబ్ ఇబ్రహీం రహీముతుల్లా అకౌంట్‌లోకి భారీ మొత్తంలో డబ్బు లు బదిలీ అయ్యాయి. నిజాం ప్రభుత్వంలోని ఆర్థిక మంత్రే అక్రమంగా ఆ డబ్బుల్ని బదిలీ చేశారు. ఆ విషయం తెలిసి దాన్ని తక్షణం నిలిపివేయాలని కోరుతూ లండన్ కోర్టులో నిజాం స్టే పొందారు.
1967లో నిజాం మృతి చెందారు. ఆ తరువాత స్టేను తొలగించి సొమ్మును కైవసం చేసుకోవడానికి పాకిస్థాన్ ప్రయత్నాలు ప్రారంభించింది. ఆ మొత్తం భారీగా ఉండటంతో భారత ప్రభుత్వం కూడా రంగంలోకి దిగింది. మొదట న్యాయస్థానం బయట చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని కేంద్ర ప్రభుత్వం భావించి, అందుకనుగుణంగా చర్యలు తీసుకున్నప్పటికీ పరిష్కారం లభించలేదు. ఈ లోపు పాకిస్థాన్ ప్రభుత్వం వెస్ట్‌మినిస్టర్‌బ్యాంకులోని మొత్తం సొమ్మును తమకు బదలాయించాలంటూ లండన్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దాంతో భారత ప్రభుత్వం కూడా న్యాయపోరాటం ప్రారంభించింది.
ఇందులో భాగంగా వెస్ట్‌మినిస్టర్ బ్యాంకులో నిజాం డిపాజిట్‌కు సంబంధించిన పత్రాలతో పాటు ఇతర ఆస్తులకు చెందిన వివరాలను, నిజాం డబ్బులు, ఆస్తులపై గతంలో వివిధ బ్యాంకులకు, కేంద్ర ప్రభుత్వానికి మధ్య జరిగిన ఉత్తర ప్రత్యుత్తరాలకు సంబంధించిన సమగ్ర సమాచారంతో కూడిన డాక్యుమెంట్లను వెంటనే ఢిల్లీకి పంపాల్సిందిగా కేంద్ర విదేశాంగ శాఖ కార్యదర్శి సుజాతా సింగ్ ఇటీవల రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పి.కె. మహంతికి లేఖ రాశారు. ప్రస్తుతం రాష్ట్ర అధికారులు ఆ వివరాలను సేకరించే పనిలో నిమగ్నమయ్యారు. నిజానికి, 1957 సంవత్సరంలోనే అప్పటి రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శి వెస్ట్‌మినిస్టర్ బ్యాంకులో నిజాం దాచిన డబ్బుల విషయంపై కేంద్ర హోంమంత్రిత్వ శాఖకు సమాచారమిచ్చారు.