
సాహితీవేత్త పాలాది లేరిక
కడప కల్చరల్ : ప్రముఖ సాహితీ వేత్త, వైశ్య ప్రముఖుడు, వాసవీ గ్రాఫిక్స్ అధినేత పాలాది లక్ష్మీకాంతం శ్రేష్ఠి (79) శుక్రవారం తెల్లవారుజామున 2.30 గంటలకు కడప నగరంలోని ఎన్జీఓ కాలనీలోని తన స్వగృహంలో కన్నుమూశారు. జిల్లాలోని ఎర్రగుంట్ల మండలం కలమల్ల గ్రామంలో జన్మించిన ఆయన కన్నగి, చారుగుప్తా చారిత్రక నవలలు, వాసవీ పేరిట ఐతిహాసిక నవల, సంస్కృతి, అక్షర సుమాలు తదితర పద్య రచనలతోపాటు తెలుగులో జంట కవులు, మహాభాగవత పరిశీలన, విమర్శన గ్రంథం, పలువురు కవుల జీవిత చరిత్రలు రాశారు. దేవతల పూజా విధానాలు, పద్యకావ్యాలు, దండకాలు రచించారు.
20కి పైగా గ్రంథాలు రాసిన ఆయన ఆకాశవాణిలో పలు సాహి త్య ప్రసంగాలు చేశారు. ఏడు ఆధ్యాత్మిక గ్రంథాలు, మరో ఏడు ఇతరుల గ్రంథాలను ఆయన సొంతంగా ముద్రింపజేశా రు. ఎన్నో పుస్తకాలకు పీఠి కలు రాశారు. మరెన్నో పుస్తకాలకు సంపాదకత్వం వహించారు. కడపోత్సవాల సంచికలన్నింటికీ సంపాదక సభ్యుడిగా వ్యవహరించారు.
వైశ్య ప్రబోధిని
1969లో వైశ్యుల కోసం ప్రత్యేకంగా వైశ్య ప్రబోధిని మాస పత్రికను ప్రారంభించారు. సాహిత్య, సామాజిక, కళా వ్యాపార రంగాలకు సంబంధించిన విషయాలతో ఆ పత్రికను విజయవంతంగా నిర్వహించారు. ఆ పత్రిక పలువురు సాహితీవేత్తలు, విశ్వ విద్యాలయాల నుంచి ప్రశంసలందుకుంది. 1991లో శ్రీ దోమా వెంకటస్వామిగుప్తా సాహిత్య పీఠాన్ని ఏర్పాటు చేసిన ఆయన ప్రతి ఫిబ్రవరి 13న సాహితీవేత్తలకు పురస్కారాలు అందజేశారు. పాలాది శివలక్షుమమ్మ, లక్ష్మికాంతం శ్రేష్ఠి సాహిత్య పీఠం ద్వారా మరిన్ని సాహితీ సేవలు అందించారు. ప్రముఖ సాహితీవేత్తలకు, అవధానులకు పురస్కారాలు అందజేశారు. మహాకవి పుట్టపర్తి నారాయణాచార్యులను ఎంతో ఆరాధించే ఆయన సీవీ సుబ్బన్న కవిని ప్రాణంగా భావిస్తారు.
సామాజిక సేవలు
అభాగ్య సోదర సహాయనిధి, ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య యువజన సంఘాల సమాఖ్య, శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరీదేవి ఆలయాలు, ఆర్యవైశ్య ధర్మ సంస్థల సమాఖ్యల ద్వారా ఆర్యవైశ్య వర్గానికి ఎన్నో సేవలందించారు. ఆంధ్రప్రదేశ్ ప్రాచీనభాషగా తెలుగు ప్రతిపాదిత కార్యచరణ ప్రణాళిక రచన కమిటీ సభ్యుడిగా, చిన్న పత్రికల జాతీయ సంఘం, ఆలిండియా వైశ్య సమాజ్‌లకు ఉపాధ్యక్షుడిగా సేవలందించారు. రాష్ట్ర ప్రభుత్వంతోపాటు పలు సామాజిక, ఆర్యవైశ్య సేవా సంస్థల ద్వారా సంఘోద్దారక, వైశ్య భూషణ, సమాజక సేవ నిష్ణాత, సాహిత్యరత్న బిరుదులతో పాటు ప్రతిష్టాత్మకమైన 13 పురస్కారాలు పొందారు.
విశిష్ఠ వ్యక్తిత్వం
‘పాలాది’ విశిష్ఠమైన వ్యక్తిత్వం కలవారు. అనుకున్నది సాధించే వరకు పట్టుదలగా ఉండేవారు. స్నేహితులు, బంధుమిత్రులను ఆప్యాయంగా పలుకరించేవారు. యువ సాహితీవేత్తలను ‘నాయనా’ అంటూ సంబోధిస్తూ ఎంతో ప్రోత్సహించేవారు. మంచి కార్యక్రమాలకు తన తోడ్పాటు ఉంటుందని వెన్నుతట్టేవారు. ప్రస్తుత తమిళనాడు రాష్ట్ర గవర్నర్ కొణజేటి రోశయ్యతో పాలాదికి ఆత్మీయ అనుబంధం ఉంది. అన్నా అంటూ ఆయనతో ఎంతో ఆత్మీయంగా ఉండేవారు. పలుమార్లు ఆయనను కడపకు తన సాహిత్య కార్యక్రమాల కోసం పిలిపించారు. కాగా, పాలాది మృతి విషయం తెలిసిన వెంటనే జిల్లాలోని సాహితీ వేత్తలు, రాజకీయ ప్రముఖులు తరలివచ్చి ఆయన భౌతికకాయం వద్ద నివాళులర్పించారు.