సాక్షి, అమరావతి: రైతుల కష్టార్జితమైన సంగం డెయిరీని తెలుగుదేశం నేత ధూళిపాళ్ల నరేంద్ర తన సొంత ఆస్తిగా మలుచుకున్నాడని, రైతులకు దక్కాల్సిన లాభాలను తన జేబుల్లో నింపుకొన్నాడని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే కిలారు వెంకట రోశయ్య ధ్వజమెత్తారు. దోపిడీదారుడిని అరెస్టు చేస్తే తెలుగుదేశం పార్టీ రాజకీయం చేస్తోందని విమర్శించారు. తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యాలయంలో ఆయన బుధవారం మీడియాతో మాట్లాడారు. సీఎం వైఎస్ జగన్ అర్హులైన రైతులు అందరికీ ఈ నెల్లో మరోసారి రైతు భరోసా జమ చేయనున్నారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం రూ. 18 వేల కోట్లు రైతు శ్రేయస్సుకు వెచ్చించిందని, రైతు భరోసా కేంద్రాలు, ఇన్‌పుట్ సబ్సిడీలు.. అన్నీ సమకూర్చడం వంటివి రైతులపై వైఎస్ జగన్ ప్రేమకు నిదర్శనమన్నారు. ఆయన ఇంకేమన్నారంటే..
ధూళిపాళ్ల మోసం చెప్పరేం?
సంగం డెయిరీని అమూల్‌కు కట్టబెడుతున్నారని ఆరోపించే టీడీపీ నేతలు.. ధూళిపాళ్ల నరేంద్ర చేసిన మోసమేంటో ప్రజలకు చెప్పకపోవడం దారుణం. 1977లో రైతుల కృషితో రూపుదిద్దుకున్న ఈ డెయిరీని ధూళిపాళ్ల దొడ్డిదారిన హస్తగతం చేసుకున్నారు. సహకార చట్టం ప్రకారం రెండేళ్లు డెయిరీకి పాలుపోస్తేనే డైరెక్టర్‌గా ఎన్నికయ్యే అర్హత ఉంటుంది. ఇవేవీ లేకుండా నరేంద్ర చైర్మన్ అయ్యారు. సహకార డెయిరీని సొంత వ్యాపార సంస్థగా మార్చారు. అసలు సహకార డెయిరీలను నిర్వీర్యం చేసింది టీడీపీ కాదా? చిత్తూరు డెయిరీని మూసేసి హెరిటేజ్‌ను లాభాల్లోకి తెచ్చుకున్నారు. దీనివల్ల చంద్రబాబు రూ. వేల కోట్లు సంపాదించారు.
డీవీసీ ట్రస్టు పేరుతో అక్రమాలు
రైతులకు చెందాల్సిన సంగం డెయిరీ లాభాలను ధూళిపాళ్ల వీరయ్య చౌదరి (డీవీసీ) ట్రస్టుకి నరేంద్ర మళ్లిస్తున్నారు. లాభాలు ప్రకటించే ముందే సొసైటీల దగ్గర్నుంచి ఖాళీ చెక్కులు తీసుకున్నారు. బోనస్‌ను రైతు ఖాతాల్లో వేసి, తర్వాత డీవీసీ ట్రస్టుకు మళ్లించారు. సంవత్సరానికి రూ. 50 వేలు లాభాలుండని సొసైటీలు డీవీసీ ట్రస్టుకు రూ. లక్షల్లో చందాగా ఇచ్చారు. దీన్ని బట్టి చూస్తే రైతుల లాభాలు ధూళిపాళ్ల కాజేస్తున్నట్టా? కాదా? అసలు సంగం డెయిరీకి, డీవీసీ ట్రస్టుకు సంబంధమేంటి? డెయిరీ నుంచి వచ్చే లాభాల్లో 3 నుంచి 5 శాతం ట్రస్టుకు ఇవ్వొచ్చని తీర్మానం చేశారు. ఆ ప్రాంత ప్రజా ప్రతినిధిగా అక్కడి రైతులకు జరుగుతున్న అన్యాయాన్ని అవినీతి నిరోధక సంస్థకు తెలియజేయడం నా బాధ్యత. టీడీపీ హయాంలో మూతపడ్డ సహకార డెయిరీలను అమూల్ సంస్థ ద్వారా మళ్లీ దారికి తెస్తుంటే తప్పుబట్టడం శోచనీయం. సంగం డెయిరీని కూడా సహకార సంఘం కిందకు తీసుకొచ్చేలా, రైతులకు ఉపయోగపడేలా చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాను.
రైతుల లాభాలన్నీ ధూళిపాళ్ల జేబులోకే..
Published Thu, May 6 2021 5:12 AM | Last Updated on Thu, May 6 2021 5:12 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment