లెక్కలన్నీ చెప్పినా రాద్ధాంతమేల? | Kilari Rosaiah Fires On TDP Leaders | Sakshi
Sakshi News home page

లెక్కలన్నీ చెప్పినా రాద్ధాంతమేల?

Published Thu, Jul 15 2021 3:13 AM | Last Updated on Thu, Jul 15 2021 7:16 AM

Kilari Rosaiah Fires On TDP Leaders - Sakshi

సాక్షి,అమరావతి: రాష్ట్ర ప్రభుత్వంపై బురద జల్లడమే పనిగా టీడీపీ తప్పుడు ఆరోపణలు చేస్తోందని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే కిలారి రోశయ్య మండిపడ్డారు. ప్రభుత్వ బిల్లులకు సంబంధించి కాగ్‌ అడిగిన ఒక చిన్న వివరణను పట్టుకుని ఆర్థిక శాఖలో ఏదో జరిగిపోతోందంటూ టీడీపీ రాద్ధాంతం చేస్తోందని ధ్వజమెత్తారు. రూ.41 వేల కోట్లకు సంబంధించి లెక్కలు, బిల్లులు లేవంటూ పీఏసీ చైర్మన్‌ పయ్యావుల కేశవ్, టీడీపీ నేతలు ప్రచారం చేయడం పట్ల తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు.

పీఏసీ చైర్మన్‌ కోరినట్లుగా రూ.41 వేల కోట్లకు సంబంధించి ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ పూర్తి లెక్కలు చెప్పినా ఇంకా స్పష్టత కావాలంటూ పయ్యావుల కేశవ్‌ అవే అబద్ధాలను వల్లిస్తున్నారని విమర్శించారు. స్టేట్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ (ఎస్డీసీ)కు సంబంధించిన రూ.25 వేల కోట్లకు బ్యాంకు గ్యారెంటీ నేటివరకు ఇవ్వలేదని స్పష్టంగా చెప్పినా ఎందుకు రభస చేస్తున్నారని ప్రశ్నించారు. కాగ్‌ అడిగిన క్లారిఫికేషన్‌ను పట్టుకుని ప్రభుత్వంపై నిందలు మోపడానికి సిగ్గులేదా? అని దుయ్యబట్టారు. టీడీపీ ఆరోపణలు చేస్తున్నట్లుగా తెలంగాణ వాటా అప్పులు మనం తీసుకోవడం  అసలు సాధ్యమేనా? నిధులు ఇచ్చే సంస్థలు అంత గుడ్డిగా ఉంటాయా? అని నిలదీశారు.  
మసాలా బాండ్ల పేరుతో రూ.2 వేల కోట్లు ఏమయ్యాయి? 
టీడీపీ హయాంలోనే రూ.300 కోట్లు ఖర్చు చేసి సీఎఫ్‌ఎంఎస్‌ విధానం తెచ్చారని, ఓ ప్రైవేట్‌ వ్యక్తికి అప్పగించి సాఫ్ట్‌వేర్, టెక్నాలజీ పేరుతో దోపిడీ చేశారని ఎమ్మెల్యే రోశయ్య పేర్కొన్నారు. టీడీపీ హయాంలో మసాలా బాండ్ల పేరిట రూ.2 వేల కోట్లు వసూలు చేశారని, అది ఎవరికైనా చెప్పారా? అని ప్రశ్నించారు. ఈ అవినీతి బాగోతాలన్నీ ఒక్కొక్కటిగా ఏపీ ఫైబర్‌ నెట్, ఏపీ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్లలో బయటపడుతూనే ఉన్నాయని గుర్తు చేశారు. రూ.41 వేల కోట్ల సంగతి అయిపోయాక ఇప్పుడు రూ.17 వేల కోట్ల గురించి మాట్లాడుతున్నారని, అందులో రూ.16,818 కోట్లు ఎక్సెస్‌గా వాడింది టీడీపీ హయాంలోనేనన్నారు. ఈ ప్రభుత్వం వాడింది కేవలం రూ.300 కోట్లేనని తెలిపారు. నిధుల్లో కేంద్రం కోత విధించిందంటూ అసత్య కథనాలు ప్రచురిస్తున్నారని మండిపడ్డారు.  

అభివృద్ధి అంటే.. 
సంక్షేమ పథకాల అమల్లో దేశంలోనే ఏపీ మొదటి స్థానంలో ఉండటాన్ని చూసి ఓర్వలేక తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని కిలారి దుయ్యబట్టారు. నిజమైన అభివృద్ధి అంటే ప్రజల జీవన విధానంలో మార్పు తేవడమని, అది సీఎం జగన్‌ ప్రభుత్వంలో జరుగుతోందన్నారు. చంద్రబాబు మాదిరిగా నాలుగు బిల్డింగులు చూపి ప్రజలను కడుపు నింపుకోమంటే ఎలాగని ప్రశ్నించారు.   భ్రమరావతిని చూపి ప్రజలను మోసం చేయడం లేదని, అన్ని ప్రాంతాల అభివృద్ధికి సీఎం జగన్‌ కృషి చేస్తున్నారని తెలిపారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement