పాలకొల్లులోని ఫైనాన్స్ కంపెనీ యజమాని సుబ్బారావు ఇల్లు
సాక్షి, ఏలూరు: పాలకొల్లుకు చెందిన ఫైనాన్స్ కంపెనీ మోసంతో బాధితులు ఘొల్లుమంటున్నారు. పట్టణంలో నాలుగు నెలల క్రితం ఓ రియల్టర్, ఫైనాన్స్ వ్యాపారి సుమారు రూ.130 కోట్లకు బోర్డు తిప్పనున్నాడంటూ పెద్ద ఎత్తున అలజడి రేగిన విషయం తెలిసిందే. ఈ వ్యాపారి వద్ద నగదు డిపాజిట్ చేసిన వ్యక్తులు సుమారు 1600పైనే ఉంటారని అంచనా వేస్తున్నారు. కానీ ఇంతవరకూ ఎవరూ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడానికి ముందుకు రాలేదు. ఒకవేళ కేసు పెట్టడానికి ముందుకు వచ్చినా పోలీసులు కేసు నమోదు చేయలేదనే ఆరోపణలూ వినిపించాయి. ఎట్టకేలకు పాలకొల్లు పట్టణానికి చెందిన మద్దుల వెంకట సుబ్బారావు అనే వ్యక్తి తనకు కోటి రూపాయల వరకూ ఇవ్వాలంటూ కలెక్టర్, ఎస్పీలను కలిసి స్పందనలో ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు రంగప్రవేశం చేసి కంపెనీ యజమాని అరెస్టుకు సిద్ధపడ్డారు.
పాలకొల్లు పట్టణానికి చెందిన లలితా ఫైనాన్స్ కంపెనీ యజమాని తాళ్లూరి వెంకట సుబ్బారావుకు చెందిన ఆస్తులను అమ్మితే ప్రతి డిపాజిట్‌దారునికి రూపాయికి 65 పైసలు చొప్పున మాత్రమే సరిపోతుందని అతని ఆస్తుల విలువ తెలిసిన వ్యక్తులు అంచనాలు వేసుకుంటున్నారు. కానీ ఇంతలో అతని వద్ద ఓ సెటిల్‌మెంట్ బ్యాచ్ తయారైంది. సెటిల్‌మెంట్ బ్యాచ్ అడుగు పెట్టిన తరువాత 65 పైసలు చొప్పున ఇవ్వనవసరం లేదని 35 పైసలు చొప్పున ఇస్తే సరిపోతుందని సలహా ఇచ్చినట్లు సమాచారం. దీంతో దాదాపుగా ఓ 100 మంది డిపాజిట్‌దారులకు పైన చెప్పిన ప్రకారం సరిపెట్టినట్లు పాలకొల్లులో చర్చ జరుగుతోంది.
ఆ 35 పైసలు కూడా ఎలాగంటే
లలితా ఫైనాన్స్ వ్యాపారి సుబ్బారావుకు ఒక వ్యక్తి కోటి రూపాయలు అప్పు ఇచ్చి ప్రతి నెలా వడ్డీ తీసుకుంటున్నారు. ఆ వ్యక్తి వడ్డీ రూపంలో ఇప్పటివరకూ సుమారు రూ.50 లక్షలు తీసుకున్నాడు. ప్రస్తుతం జరుగుతున్న సెటిల్‌మెంట్‌లో ఆ వ్యక్తి 35 పైసలు చొప్పున రూ.35 లక్షలు వస్తుందని ఆశతో వెళ్లాడు. కానీ అక్కడ ఇచ్చిన అప్పు కోటి రూపాయల్లో తీసుకున్న వడ్డీ రూ.50 లక్షలు తగ్గించి మిగిలిన రూ.50 లక్షల్లో 35 పైసలు చొప్పున రూ.17.5లక్షలు ఇచ్చినట్లు తెలిసింది. ఇలా సుమారు ఓ వంద మందికి సరిపెట్టినట్లు పట్టణ వాసులు చర్చించుకుంటున్నారు. ఇదే కోణంలో భీమవరానికి చెందిన ఓ వ్యక్తి కోటి రూపాయలు డిపాజిట్ చేసి రూ.కోటిపైనే వడ్డీ తీసుకువెళ్లినట్లు తెలిసింది. అతనికి ఇక ఏమీ ఇచ్చేదిలేదంటూ చేతులెత్తేశారు. ఆ డిపాజిట్‌దారుని కోసం భీమవరానికి చెందిన ఓ మాజీ ఎమ్మెల్యే రంగంలోకి దిగి సెటిల్‌మెంట్ బ్యాచ్‌ను ఆశ్రయించారు. అతనికి పైసాకూడా ఇచ్చేదిలేదంటూ తేల్చి చెప్పినట్లు తెలిసింది. ఆ మాజీ ఎమ్మెల్యే కనీసం ఆ 35 పైసలు చొప్పునైనా ఇవ్వాలంటూ అడిగినా తాము ఏమి చేయలేమంటూ చేతులెత్తేసినట్లు సమాచారం. ఆ సెటిల్‌మెంట్ బ్యాచ్‌కు ఇన్నోవా కారు గిఫ్ట్‌గా ఇచ్చినట్లు పట్టణంలో ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతానికి తాళ్లూరి సుబ్బారావు ఇంటిలో పోలీసులు సోదా చేసి అధికారికంగా ఉన్న అకౌంట్ పుస్తకాల ప్రకారం జనాల నుంచి తీసుకున్న అప్పులు రూ.25 కోట్లు, బ్యాంక్ అప్పు రూ.3.30 కోట్లు ఉండగా రూ. 34 కోట్ల ఆస్తులు ఉన్నట్లు లెక్కతేలింది. ఇవి కాక బయట పడని బాకీలు సుమారు రూ.100 కోట్లు ఉంటాయని అంచనా వేస్తున్నారు.
బాధితులు బయటకు రాకపోవడానికి కారణం నల్లధనమేనా?
పట్టణంలో కొందరు వ్యాపారులు, వైద్యులు ఈ ఫైనాన్స్ కంపెనీ యజమానికి అప్పులు ఇచ్చినట్లు తెలిసింది. వీళ్లంతా తమకు డబ్బు ఇవ్వకపోయినా పరవాలేదు తమ పేర్లు మాత్రం దయచేసి బయటపెట్టవద్దని కోరినట్లు సమాచారం. మరి కొందరు తమ సొమ్ము తమకు ఇవ్వాలంటూ ఒత్తిళ్లు తీసుకువస్తున్నారు తప్ప బహిరంగంగా అడగలేకపోతున్నారు. బహిరంగం చేస్తే ఆదాయపన్ను శాఖ అధికారులకు లెక్కలు చూపించాలని భయపడుతున్నారు. కొందరు బడా బాబులు తమ సొమ్ములు రికవరీ కోసమే సెటిల్‌మెంట్ బ్యాచ్‌ను ఏర్పాటు చేసినట్లు చెబుతున్నారు. ప్రస్తుతానికి అధికారికంగా అప్పు ఇచ్చిన వ్యక్తులకు ఉన్న బాకీలు లెక్కిస్తే పూర్తి మొత్తంలో వడ్డీతో సహా ఇచ్చినా ఇంకా నగదు మిగులుతుందని లెక్కలు వేసుకుంటున్నారు.
చీటింగ్ కేసు నమోదు చేయని పోలీసులు
ఆ రియల్టర్ తనను చీటింగ్ చేశాడంటూ పట్టణానికి చెందిన బోడపాటి జోగయ్య అనే వ్యక్తి కోర్టును ఆశ్రయించాడు. చీటింగ్ కేసు నమోదు చేయాలని నరసాపురం డీఎస్పీని కలవగా పాలకొల్లు పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలని చెప్పినట్లు జోగయ్య తెలిపారు. ఆగస్టు 28న పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసినట్లు గానీ, ఆ రియల్టర్‌ను పిలిచి విచారించినట్లు గానీ ఇంతవరకూ సమాచారం అందించలేదని తెలిసింది.
ఓ సినీ నటి ఆగ్రహం?
సినీ ఇండస్ట్రీతో కూడా సంబంధాలు ఉన్న ఆ రియల్టర్ ఓ హాస్య నటి నుంచి కూడా పెద్ద మొత్తంలో నగదు డిపాజిట్ సేకరించినట్లు సమాచారం. ఈ రియల్టర్ వద్ద ఆ నటి పెద్దమొత్తంలో డిపాజిట్ చేయడానికి ఓ హాస్య కథానాయకుడు మధ్యవర్తిగా వ్యవహరించినట్లు తెలిసింది. ఆ హాస్య కథానాయకుడి తాతగారు ఊరు యలమంచిలి మండలం కావడంతో ఆ పరిచయాలతో పెద్దమొత్తంలో డిపాజిట్ చేసినట్లు తెలిసింది. ఇటీవల ఒక రోజు ఆ రియల్టర్ ఇంటికి వచ్చిన ఆ నటి తీవ్రంగా దుర్భాషలాడినట్లు చెబుతున్నారు.
పాల‘ఘొల్లు’
Comments
Please login to add a commentAdd a comment