పళ్లంరాజు ఇల్లు ముట్టడికి యత్నం | Pallam Raju home invasion attempt | Sakshi
Sakshi News home page

పళ్లంరాజు ఇల్లు ముట్టడికి యత్నం

Published Sun, Oct 6 2013 1:40 AM | Last Updated on Fri, Sep 1 2017 11:22 PM

Pallam Raju home invasion attempt

 కాకినాడ సిటీ, న్యూస్‌లైన్ :కేంద్రమంత్రి ఎంఎం పళ్లంరాజు ఇంటి ముట్టడి యత్నం శనివారం తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది. ఒక దశలో పోలీసులు లాఠీచార్జిలో పదిమంది జేఏసీ నాయకులు తీవ్రంగా గాయపడ్డారు. జేఏసీ నేతలలో 153 మందిని పోలీసులు అరెస్టు చేశారు. జర్నలిస్టుల జేఏసీ సభ్యులు పళ్లంరాజు ఇంటి వద్ద ధర్నా చేసి ఇంట్లోకి చొచ్చు కెళ్లేందుకు చేసిన ప్రయత్నాన్ని పోలీసులు అడ్డుకున్నారు.సమైక్య రాష్ర్ట పరిరక్షణ వేదికఆధ్వర్యంలో వందలాదిగా ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మికులు శనివారం ఎన్జీఓ కార్యాలయానికి చేరుకొని అక్కడ నుంచి పళ్లంరాజు ఇంటివైపు ర్యాలీగా బయల్దేరారు. ఇంటికి వంద అడుగుల దూరంలో బారికేడ్లు, ముళ్ల కంచెలు వేసిన పోలీసులు జేఏసీ నేతలను ఇంటివైపు రాకుండా అడ్డుకున్నారు.
 
 65 రోజులుగా ఎన్నోసార్లు పళ్లంరాజు ఇంటిని ముట్టడించినప్పుడు చిన్నపాటి సంఘటన కూడా చోటుచేసుకోలేదని, అలాంటప్పుడు ఇప్పుడెందుకు అడ్డుకుంటున్నారంటూ జేఏసీ నేతలు పోలీసుల తీరుపై మండిపడ్డారు. ఈ దశలో ఇంటివైపు చొచ్చుకెళ్లేందుకు యత్నించిన ఉద్యోగులు-పోలీసుల మధ్య తీవ్రతోపులాట జరిగింది. ఈ సమయంలో పరిస్థితి విషమిస్తుండడంతో పోలీసులు లాఠీ చార్జి చేశారు. ఫార్మసిస్ట్ అసోసియేషన్ పసుపులేటి శ్రీనివాస్, సర్వేయర్ ఉద్యోగ సంఘ నాయకులు ఆచారి, ఉపాధ్యాయ జేఏసీ కన్వీనర్ కవి శేఖర్ తీవ్రంగా గాయపడ్డారు. మరో 10 మందికి స్వల్పగాయాలయ్యాయి. ఉద్యోగులు ఆగ్రహం చెంది ముట్టడికి తీవ్రంగా యత్నించగా పోలీసులు వారిని ప్రతిఘటించారు.
 
 జేఏసీ నేతలు బూరిగ ఆశీర్వాదం, కవిశేఖర్, అనీల్ జాన్సన్ డీఎస్పీ విజయభాస్కరరెడ్డిని నిలదీశారు. తాము ఆది నుంచి ఉద్యమాన్ని ప్రశాంత వాతావరణంలోనే నిర్వహిస్తుంటే రెచ్చగొట్టడం ఎంతవరకు సమంజసమని వారు ప్రశ్నించారు. వారికి మద్దతుగా జర్నలిస్టుల జేఏసీ మిత్రులు కూడా పళ్లంరాజు ఇంటి గేటు వద్ద ధర్నా చేశారు. మరొక వైపు పళ్లంరాజు ఇంటివైపు మళ్లీ దూసుకొస్తున్న జేఏసీ చైర్మన్ బూరిగ ఆశీర్వాదం, కన్వీనర్ పితాని త్రినాథ్, ఏపీఎన్‌జీఓ కాకినాడ నగర అధ్యక్షుడు అనిల్ జాన్సన్, ఉపాధ్యాయ జేఏసీ నాయకులు కవిశేఖర్, ప్రదీప్‌కుమార్, ఆర్టీసీ జేఏసీ నాయకులు ఎంఏ ఖాన్, ఇందేష్, పీఎన్ మూర్తిలతో పాటు 153 మందిని అరెస్టు చేసి టూటౌన్ పోలీస్ స్టేషన్‌కు తరలించి అనంతరం వ్యక్తిగత పూచీకత్తుపై విడిచిపెట్టారు. కాగా లాఠీచార్జిలో గాయపడిన జేఏసీ నేతలను కాకినాడ సిటీ తాజా మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి పరామర్శించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement