
'క్షమాపణలు చెప్పి సీఎం పదవి నుంచి తప్పుకో'
హైదరాబాద్: ఎన్నికల సందర్బంగా రుణమాఫీపై రైతులకు ఆశలు కల్పించిన చంద్రబాబు... ప్రస్తుతం అధికారంలోకి వచ్చాక అదే రైతులను మోసం చేస్తున్నారని తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు పాల్వాయి గోవర్థన్ రెడ్డి ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్లో టీడీపీ అధికారం దక్కించుకున్న తర్వాత చంద్రబాబు అనుసరిస్తున్న వ్యవహారశైలిపై పాల్వాయి ఆదివారం హైదరాబాద్లో నిప్పులు చెరిగారు. రుణమాఫీపై హామీలిచ్చినప్పుడు తెలియదా ? అవి ఆచరణ సాధ్యం కానివని చంద్రబాబును ప్రశ్నించారు.
రైతు, డ్వాక్రా, చేనేత రుణాలు వెంటనే చంద్రబాబు మాఫీ చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. రుణాలు మాఫీ చేయాలేక పోతే ప్రజలకు క్షమాపణలు చెప్పి పదవి నుంచి తప్పుకోవాలని చంద్రబాబుకు పాల్వాయి హితవు పలికారు. సీఎంగా ప్రమాణ స్వీకార కార్యక్రమానికి, తన ఛాంబర్ హంగులకు చంద్రబాబు రూ. వందలాది కోట్లు దుబారా చేస్తున్నారని పాల్వాయి విమర్శించారు. ఇప్పటికైనా వాస్తవాలను ప్రజల ముందుంచాలని పాల్వాయి గోవర్థన్ రెడ్డి ఈ సందర్బంగా చంద్రబాబుకు సూచించారు.