
నేనా.. దందాలా..?
అబ్బే అదేమీ లేదు
ఎమ్మెల్యే పంచకర్ల
అచ్యుతాపురం: నేనా.. దందాలా.. అబ్బే అదేమీ లేదు.. మైనింగ్ కూడా ఆపేసి తొమ్మిది నెలలైంది.. అని యలమంచిలి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్‌బాబు వ్యాఖ్యానించారు. ఆదివారం సాక్షి దినపత్రికలో ‘అక్కడ పచ్చ భూతాలదే రాజ్యం’ శీర్షికన వచ్చిన కథనంపై ఆయన స్పందించారు. సోమవారం అచ్యుతాపురంలో విలేకరులతో మాట్లాడారు. కథనంలో తన పేరు ప్రస్తావించకపోయినా నియోజకవర్గం ప్రజాప్రతినిధిగా సంజాయిషీ ఇవ్వాల్సి వస్తోందన్నారు.
అక్రమ గ్రావెల్ తవ్వకాలు చేసి రూ.కోట్లు కొల్లగొట్టినట్టు వచ్చిన ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు. 9 నెలల క్రితం తానే స్వయంగా మైనింగ్ అధికారులతో చర్చించి అక్రమ గ్రావెల్ తవ్వకాలను అరికట్టానని చెప్పారు. ఎస్‌ఈజెడ్ పరిశ్రమల యాజమాన్యాలు స్థానికులకు ఉద్యోగాలు అడిగితేనే పట్టించుకోవడం లేదని... ఇక తమకు లంచాలు ఏవిధంగా ఇస్తారని ప్రశ్నించారు. దేవుడి మాన్యం భూములను ఆక్రమించలేదని చెప్పారు. నాలుగు మండలాల్లో ఎక్కడా ఇన్‌చార్జ్‌లను నియమించలేదని స్పష్టం చేశారు. విలేకరుల సమావేశంలో ఎంపీపీ చేకూరి శ్రీనివాసరాజు, రాజాన రమేష్‌కుమార్, రంగనాయకులు పాల్గొన్నారు.