- పంచాయతీ కార్యదర్శుల రాత పరీక్ష రేపే
- మానసిక ప్రశాంతతతోనే మార్కుల సాధన
విశాఖపట్నం, న్యూస్‌లైన్: నిరుద్యోగం రాజ్యమేలుతోంది. ఉపాధి అవకాశాలు లేక యువకులు నిరాశ..నిస్పృహలకు గురవుతున్నారు. ఇలాంటి పరిస్థితిలో ఏ చిన్న ఉద్యోగం కోసమైనా నోటిఫికేషన్ వస్తే దాన్ని దక్కించుకోవడానికి తీవ్రమైన పోటీ నెలకొంటుంది. అందులోనూ సర్కార్ కొలువంటే చెప్పలేనంతమంది పోటీపడతారు. ఇలాంటి పరిస్థితిలో కష్టపడితేనే ఫలితం సొంతమంటున్నారు నిపుణలు. ప్రణాళికాబద్ధంగా చదవడంతోనే విజయం ఖాయమంటున్నారు.
ఆదివారం జరగనున్న (ఈనెల 23న) పంచాయతీ కార్యదర్శుల ఉద్యోగం కోసం వేలాది మంది కుస్తీ పడుతున్నారు. విజయ తీరాలకు చేరాలని ఆశిస్తున్నారు. జిల్లాలో పంచాయతీ కార్యదర్శుల పోస్టులు 155 ఉండగా 42,326 మంది పోటీ పడుతున్నారంటే పోటీ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. అయితే అభ్యర్థుల సంఖ్యను చూసి భయపడవద్దని, పరీక్షకు పూర్తిస్థాయిలో సన్నద్ధం అయ్యేవారు 50 శాతం మందే ఉంటారని నిపుణుల అంచనా. పోటీ పరీక్షకు హాజరు శాతం, అర్హత సాధించిన వారి సంఖ్య బట్టి అంచనా వేస్తున్నారు. ఏదేమైనా ఆశావహ దృక్పథంతో సమయాన్ని సద్వినియోగం చేసుకొని పరీక్ష రాస్తే విజయం మీదే. భయాన్ని వీడి నిర్భయంగా పరీక్ష రాసి పంచాయతీ కార్యదర్శిగా కొలువుతీరాలని ఆశిస్తున్నాం.
సమయమే కీలకం
పరీక్షలకు మరో రోజు మాత్రమే సమయం ఉంది. ఇదే అత్యంత కీలకమైంది. ఉన్న సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ప్రీవియస్ మోడల్ పేపర్లను సరిచూసుకోవాలి. ఇది వరకూ చదువుకున్న అంశాలను రివిజన్ చేయాలి. బృంద చర్చలు చేస్తే బాగుంటుంది. చదివే సమయంలో కొద్దిసేపు విశ్రాంతి తీసుకోవాలి. పరీక్ష రోజు ఉదయం సాధ్యమైనంత వరకూ చదవకుండా ఉంటేనే మంచిది. పరీక్షా కేంద్రంలో ప్రశ్నలకు అనుగుణంగా సమయం కేటాయించుకోవాలి. పరీక్ష చివరి సమయంలో తొందర పడుతూ సమాధానాలు గుర్తించ వద్దు.
పరీక్షల నిర్వహణపై సమీక్ష
విశాఖ రూరల్: జిల్లాలో ఈ నెల 23న జరిగే పంచాయతీ కార్యదర్శుల పరీక్షను విజయవంతంగా నిర్వహించాలని అధికారులను కలెక్టర్ సాల్మన్ ఆరోఖ్యరాజ్ ఆదేశించారు. శుక్రవారం జెడ్పీ సమావేశ మందిరంలో చీఫ్ సూపరింటెండెంట్లు, లైజన్ ఆఫీసర్లతో సమావేశం నిర్వహించారు. ప్రశ్న పత్రాలు లీకు కాకుండా జాగ్రత్త వహించాలని, అటువంటి సంఘటనలు జరిగితే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. జిల్లా పరిషత్ సీఈఓ మహేశ్వరరెడ్డి మాట్లాడుతూ ఓఎంఆర్ షీట్లు నింపేటప్పుడు పొరపాట్లు జరిగితే ఆఫీసర్ తిరస్కరిస్తారని తెలిపారు. అభ్యర్థి ఓఎంఆర్ షీటు సరిగా నింపినది, లేనిది ఇన్విజిలేటర్ సరిచూడాలన్నారు.
పేపర్-1లో...
జాతీయ, అంతర్జాతీయ ప్రాముఖ్యతాంశాలుంటాయి. కరెంట్ అఫైర్సు(స్థానిక, జాతీయ, అంతర్జాతీయ), శాస్త్ర సాంకేతిక, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగాల్లో ప్రస్తుత అభివృద్ధి, భారత ఆధునిక చరిత్ర (ప్రత్యేకించి జాతీయ ఉద్యమం), స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి నేటి వరకూ దేశార్థికాభివృద్ధి, తార్కిక విషయ పరిజ్ఞానం (లాజికల్ రీజనింగ్), విశ్లేషణాత్మక సామర్థ్యం (ఎబిలిటీ), విపత్తుల నిర్వహణ సాధారణ అంశాలపై ప్రశ్నలు వచ్చే అవకాశాలున్నాయి.
పేపర్-2
గ్రామీణాభివృద్ధిలో ప్రజారోగ్యం, పారిశుధ్యంలో పాత్ర, సంక్రమిత వ్యాధులు, నివారణ, ఆరోగ్యకరమైన జీవన విధానం, సామాజిక సంఘర్శన, అణగారిన వర్గాల సమస్యలు, భారత ప్రజాస్వామ్య వ్యవస్థ (ప్రజాస్వామిక సంస్థలు, పంచాయతీరాజ్ వ్యవస్థ, సహకార పరపతి సంఘాలు, గ్రామీణ వికాసంలో వీటి పాత్ర, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి, గ్రామీణాభివృద్ధిలో శాస్త్ర శాంకేతిక పాత్ర, శ్రమ పొదుపునకు ఉపయుక్తమైన ఆధునిక పరకరాలు, గణాంక శాస్త్రంపై ప్రశ్నలుంటాయి.
ఎంపిక విధానం
అభ్యర్థులను రాత పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు. పరీక్ష డిగ్రీ స్థాయిలో ఆబ్జెక్టివ్ మల్టీపుల్‌చోయస్ ప్రశ్నలు ఉంటాయి. పేపర్-1, పేపర్-2 పరీక్షలు నిర్వహిస్తారు. పేపర్-1 జనరల్ స్టడీస్, సాధారణ విషయ పరిజ్ఞానం. పేపర్-2 గ్రామీణాభివృద్ధి, గ్రామ సమస్యలు (ఆంధ్రాకు సంబంధించి)పై ఉంటాయి. పేపర్-1, పేపర్-2కు రెండున్నర గంటలు చొప్పున్న సమయం కేటాయించారు. ఒక్కో పేపరుకు 150 ప్రశ్నలకు 150 మార్కులుంటాయి. రెండు పేపర్లు కలిపి మొత్తం 300 మార్కులకు ఆన్సర్ చేయాల్సి ఉంటుంది.
పాటించాల్సిన సూచనలు
ఏపీపీఎస్సీ ఆధ్వర్యంలో పరీక్ష నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి చేశారు.
ముందుగానే హాల్‌టిక్కెట్ డౌన్‌లోడ్ చేసుకొని సరిచూసుకోవాలి. ఫొటో సరిగ్గా ఉందో లే దో గమనించాలి. సరిగ్గా కనిపించక పోతే గజిటెడ్ అధికారితో సంతకం చేయించిన మూడు పాస్ ఫొటోలను పరీక్ష కేంద్రానికి తీసుకెళ్లాలి.
రెండు బాల్ పెన్నులు, పరీక్ష ప్యాడ్ వెంట పట్టుకెళ్లాలి. గంట ముందుగా పరీక్ష కేంద్రానికి చేరుకోవాలి.
ఇప్పటి వరకూ ఓఎంఆర్ పత్రంలో సమాధానం రాయని వారు హాల్‌టిక్కెట్‌తో పాటు వచ్చిన నమూనా పత్రాన్ని పరిశీలించాలి.
తెలుగు, ఆంగ్లం అ భ్యర్థులకు ఒకే ప్రశ్న పత్రం ఉంటుంది. ఎవరి మాధ్యమం ప్రకారం వారు ప్రశ్నలు చదవాలి. లేదంటే పరీక్షల్లో కీలకమైన సమయం వృథా అవుతుంది.