గ్రేటర్... గో బ్యాక్!
‘శివారు గ్రామాల విలీనం’పై అఖిలపక్షాల నిరసన
హైదరాబాద్, న్యూస్‌లైన్: ‘గ్రేటర్ - గోబ్యాక్, సీఎం - డౌన్‌డౌన్, ప్రాణాలైనా ఇస్తాం - మా గ్రామాలను గ్రేటర్‌లో కలపనివ్వం...’ నినాదాలతో రాజేంద్రనగర్ మండలం నార్సింగ్ జంక్షన్ దద్దరిల్లింది. రాజధాని శివారు గ్రామాలను గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్‌లో కలపటాన్ని వ్యతిరేకిస్తూ మండల అఖిలపక్ష నాయకుల ఆధ్వర్యంలో శనివారం నార్సింగ్ జంక్షన్‌లో మహాధర్నా నిర్వహించారు. పెత్తందారుల భూముల కోసమే ప్రభుత్వం ప్రజాభీష్టానికి వ్యతిరేకంగా రాజేంద్రనగర్ మండలం పరిధిలోని 13 గ్రామాలను గ్రేటర్‌లో విలీనం చేసిందని ఈ సందర్భంగా నిరసనకారులు ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘పచ్చని పొలాలతో కళకళలాడే గ్రామాలను నగరంలో ఎలా విలీనం చేస్తారు? ఎవరిని అడిగి విలీన ప్రక్రియ కొనసాగించారు?’ అంటూ మండిపడ్డారు. రాష్ట్ర విభజనపై ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి తన పదవికి రాజీనామా చేయటానికి వెనకాడనప్పుడు.. తాము తమ సొంత గ్రామాలను నగరంలో విలీనం చేయటంపై పోరాడటంలో తప్పేముందని అధికార కాంగ్రెస్ నాయకులు వ్యాఖ్యానించారు.
విలీనానికి నిరసనగా తొలుత ర్యాలీ నిర్వహించారు. ధర్నా సందర్భంగా నిరసనకారులు, పోలీసుల మధ్య తోపులాట జరిగి ఉద్రిక్తత తలెత్తింది. ధర్నా నిర్వహిస్తున్న సమయంలో అటుగా వాహనాలను అనుమతించటంతో కోకాపేట్ మాజీ సర్పంచ్ రోడ్డుపై వాహనాలకు అడ్డంగా పడుకున్నారు. మిగతా నాయకులూ రోడ్డుపై బైఠాయించారు. దీంతో పోలీసులు వారిని బలవంతంగా పోలీసు వాహనంలోకి ఎక్కించారు. ఈ క్రమంలో నార్సింగ్ గ్రామ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు క్యాతమ్ అశోక్‌యాదవ్ సొమ్మసిల్లి రోడ్డుపై పడిపోయారు. నిరసనకారులు ఔటర్ రింగురోడ్డుపైకి దూసుకువెళ్లటానికి ప్రయత్నించగా పోలీసులు అడ్డుకుని నిలువరించారు. ధర్నా సందర్భంగా ఆ మార్గంలో కిలోమీటర్ మేర ట్రాఫిక్‌జామైంది.