
సాక్షి, తూర్పుగోదావరి : ఓటు వేసిన మూడు కోట్ల మంది ప్రజలను, ఎన్నికలను సమర్ధవంతంగా నిర్వహించిన సిబ్బందిని చంద్రబాబు అవమానిస్తున్నారని అమలాపురం ఎంపీ, వైఎస్సార్‌సీపీ నాయకుడు పండుల రవీంద్రబాబు విమర్శించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 2014లో ఈవీఎంలు ఇంతకన్న ఎక్కువగా మొరాయించాయని చంద్రబాబు అప్పుడెందుకు మాట్లాడలేదని నిలదీశారు. ఢిల్లీలో చంద్రబాబు తీరు చూస్తుంటే.. మే23న ప్రజలకు తన ముఖం ఎలా చూపించాలని ప్రిప్రేర్ అవుతున్నట్లు ఉందంటూ ఎద్దేవా చేశారు.
ఓడిపోతామన్న భయం చంద్రబాబుకి, టీడీపీకి పట్టుకుందని, అత్త మీద కోపం దుత్త మీద చూపించినట్లు చంద్రబాబు తన కోపాన్ని ఈవీఎంల మీద చూపించి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు మీద ప్రజలు చాలా కోపంగా ఉన్నారని అందుకే ఆయన మీద వ్యతిరేకతతో ఓట్లు గుద్దేశారన్న క్లారీటీ చంద్రబాబుకు వచ్చిందన్నారు. రాష్ట్ర ఎన్నికల సీఈఓగా సిసోడి వద్దని.. ద్వివేదిని నియమించమని ఈసీకి పంపింది చంద్రబాబే అని గుర్తు చేశారు. ద్వివేది రాష్ట్ర అధికారి..సొంత అధికారిని ఎవరైనా తిడతారా? అంటూ ప్రశ్నించారు. చంద్రబాబు తీరును ప్రతిఒక్కరూ గమనిస్తున్నారని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment