
మాజీ ఎంపీ పండుల రవీంద్రబాబు
సాక్షి, తూర్పు గోదావరి: 2019 ఎన్నికల్లో ఒకవేళ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గెలవకపోయింటే భవిష్యత్తులో మనల్ని మనం క్షమించుకోలేని నేరం చేసినవాళ్లమని మాజీ ఎంపీ పండుల రవీంద్రబాబు పేర్కొన్నారు. శనివారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. అవినీతి సొమ్ముతో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమరావతి కట్టుంటే అక్కడ మనం ఉండకుండా ఈడీ సీజ్ చేసి ఉండేదని విమర్శించారు. ప్రపంచ మొత్తంలో అమరావతి అవినీతి సొమ్ముతో కట్టిన రాజధాని నగరమై ఉండేదన్నారు. అదృష్టవశాత్తు అమరావతి నిర్మాణం జరగలేదని, ఇప్పటికైనా అమరావతి రైతులను, ప్రజలను ధర్నాలు మానుకోవాలని కోరారు. చంద్రబాబు మోసాన్ని.. భూటకపు నాటకాన్ని ఇప్పటికైనా ప్రజలు అర్థం చేసుకోవాలన్నారు. మీ దగ్గర తీసుకున్న భూములతో చంద్రబాబు అండ్ కో వ్యాపారాలు చేసి ఆ అవినీతి సొమ్మును విదేశాలకు పంపి.. మళ్లీ వాటిని ఇక్కడకు రప్పించి అమరావతి కట్టేవారని పేర్కొన్నారు.
ఇక ఇప్పటికైనా సీఎం జగన్‌ను నమ్మండని, మీకు ఆయన న్యాయం చేస్తారని పండుల రవీంద్రబాబు తెలిపారు. చంద్రబాబు దగ్గర పీఏగా చేసిన వ్యక్తి దగ్గరే రూ. 2వేల కోట్లు దొరికాయాంటే.. ఒకవేళ చంద్రబాబు, లోకేష్‌పై నేరుగా ఐటీ దాడులు చేసుంటే ఎన్న లక్షల కోట్లు బయటపడేవో అన్నారు. అమరావతిని ఈడీ సీజ్‌చేయకుండా మనం బయట పడగలిగామన్నారు. ఇటువంటి అవినీతి ముందు ముందు జరగకుండా సీబీఐ, ఈడీ, ఎస్‌ఎఫ్‌ఐజో ద్వారా విచారణ జరిపించి దోషులను కఠినంగా శిక్షించాలన్నారు. కొత్తగా పుట్టిన రాష్ట్రాన్ని ఈ విధంగా దోచుకోవడం దేశ ద్రోహమే అవుతుందని, ఇలాంటి దోషులను దేశ ద్రోహులుగా పరిగణించి శిక్షించాలని ఆయన కేంద్రాన్ని కోరారు.