తీర్మానాలను పరిశీలిస్తున్న మంత్రి సురేష్, తెలుగు అకాడమీ చైర్‌పర్సన్ లక్ష్మీ పార్వతి
సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ స్కూళ్లలో వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో ప్రజలంతా దీనికి పూర్తి మద్దతు ప్రకటిస్తున్నారని మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. రాష్ట్రంలో 43 వేలకుపైగా ప్రభుత్వ స్కూళ్ల పేరెంట్స్ కమిటీలన్నీ ఆంగ్ల మాధ్యమం కోసం ఏకగ్రీవ తీర్మానాలు చేసి ప్రభుత్వానికి పంపాయని వివరించారు. రాష్ట్ర ప్రజలందరికీ తెలియచేసేలా 13 జిల్లాల నుంచి అందిన పేరెంట్స్ కమిటీల తీర్మానాల కాపీలను విద్యాశాఖ సచివాలయంలో ట్రంకు పెట్టెల్లో ప్రదర్శనకు ఉంచింది.
ఇది చారిత్రాక ఘటన
ప్రతిపక్ష నేత చంద్రబాబు సొంత గ్రామం నారావారిపల్లెతోపాటు ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నుంచి, చిత్తూరు జిల్లాలో అన్ని పాఠశాలల నుంచి ఆంగ్ల మాధ్యమం కోరుతూ తీర్మానాలు వచ్చాయని చెబుతూ మంత్రి సురేష్ వాటిని చూపించారు. టీడీపీ నేతలు యనమల రామకృష్ణుడు, అశోక్‌గజపతిరాజు, ప్రత్తిపాటి పుల్లారావు, అచ్చెన్నాయుడు తదితరుల గ్రామాల నుంచి కూడా ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెట్టాలని ప్రజల నుంచి తీర్మానాలు అందాయని తెలిపారు. ఇది చారిత్రాక ఘటన అని, ముఖ్యమంత్రి జగన్ నిర్ణయాలకు ప్రజల మద్దతును తెలియచేస్తోందని, ప్రభుత్వం చేస్తున్న మంచి పనులకు దీన్ని రిఫరెండంగా భావించాలని చెప్పారు.
నైపుణ్యాలు తెలుసుకునేందుకు యాప్
సీఎం ఆదేశాల మేరకు 67,145 మంది టీచర్లకు ఆంగ్ల మాధ్యమంపై బోధనలో శిక్షణ పూర్తి చేసినట్లు మంత్రి తెలిపారు. ఇంగ్లీషు మీడియంలో నైపుణ్యాలను పరీక్షించుకునేందుకు టీచర్ల కోసం యాప్ రూపొందించామని చెప్పారు. 1వ తరగతి నుంచి 3వ తరగతి విద్యార్ధులకు ఇంటెన్సివ్ లెర్నింగ్ కోర్సును రెండు నెలల పాటు రెసిడెన్సియల్ స్కూళ్లలో నిర్వహిస్తామని, 4, 5 తరగతుల వారికి వేసవి సెలవుల్లో రెండు నెలల పాటు బ్రిడ్జి కోర్సులు ఉంటాయని వివరించారు.
జగనన్న విద్యాకానుక కింద రూ.1,500 విలువైన కిట్
వచ్చే విద్యా సంవత్సరంనుంచి ‘జగనన్న విద్యా కానుక’ కింద విద్యార్థులకు కిట్‌లను అందిస్తామని మంత్రి సురేష్ తెలిపారు. రూ.1,500 వ్యయంతో ప్రతి విద్యార్థికి పుస్తకాలు, నోట్‌బుక్స్, యూనిఫారం, బెల్టు, షూ, సాక్స్‌లతో కూడిన కిట్‌ను ఇస్తామన్నారు.త్వరలో డీఎస్సీ నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నామని, టీచర్ పోస్టుల ఖాళీలన్నీ భర్తీ చేస్తామని మంత్రి ప్రకటించారు.
Comments
Please login to add a commentAdd a comment