ఉపకార వేతనాలు, బోధనా ఫీజుల పథకం భారం తగ్గించుకునేందుకు ప్రభుత్వం ఏ ఒక్క అవకాశాన్ని వదులుకోవడం లేదు. ఆచరణ సాధ్యం కాని సవాలక్ష నిబంధనలు, ఆంక్షలు విధించి పేద విద్యార్థులకు ఫీజు చెల్లించకుండా తప్పుకునేందుకు ఎత్తుగడలు వేస్తోంది. ఈ నెల 10వ తేదీతో బోధనా ఫీజులు, ఉపకార వేతనాలు పొందేందుకు పునరుద్ధరణ గడువు ముగియనుండటంతో విద్యార్థులు, తల్లిదండ్రుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది.
యలమంచిలి : 20014-15 విద్యాసంవత్సరానికి బోధనా రుసుము, ఉపకార వేతనం పొందాలంటే అర్హులైన విద్యార్థులు ఆధార్‌సంఖ్యను నమోదు చేసుకునే వారు. ఇంత వరకు ఎవరికీ ఇబ్బంది లేదు. ఇప్పుడు తల్లిదండ్రులిద్దరి ఆధార్ సంఖ్యలను ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని తాజా మార్గదర్శకాల్లో మెలికపెట్టారు. ఇంటర్, డిగ్రీ, పీజీ, ఇంజనీరింగ్, బీఈడీ, డీఈడీ, ఎంఈడీ, బి-ఫార్మసీ, ఎంబీఏ, ఎంసీఏ తదితర కోర్సులు చదివే ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ, మైనార్టీ విద్యార్థులకు ప్రభుత్వం కోర్సును బట్టి బోధనా రుసుము చెల్లిస్తోంది.
ఇటువంటివారు జిల్లాలో దాదాపు రెన్యువల్ విభాగంలో సుమారు 50వేల మంది, కొత్తవారు 35వేల మంది విద్యార్థులు ఉంటారని అంచనా. 2013-14లో 70వేల మంది వరకు విద్యార్థులు లబ్ధి పొందారు. ప్రస్తుత విద్యాసంవత్సరంలో క్రమబద్ధీకరణకు ఈ నెల 10వ తేదీ వరకు గడువు ఇచ్చారు. శనివారం నాటికి కేలవం 20 మంది శాతం కూడా విద్యార్థులు పేర్లు నమోదు చేసుకోలేదని తెలిసింది. మరో ఒక్కరోజే గడువు ఉండటంతో దాదాపు 80 శాతం మంది పేర్లను నమోదు చేసుకోవాల్సి ఉంది.
ముగ్గురి ఆధార్ తప్పని సరి...
బోధనా ఫీజులు పొందడం కోసం ఆన్‌లైన్ ఈ-పాస్ వెబ్‌సైట్‌లో విద్యార్ధి వివరాలు నమోదు చేయాలి. విద్యార్థి, తల్లి, తండ్రి ముగ్గురి ఆధార్ నంబర్ల నమోదు తప్పని సరి. లేని విద్యార్థుల దరఖాస్తు పునరుద్ధరణ ప్రక్రియ పూర్తికావడం లేదు. విద్యార్థుల్లో కొందరికి తల్లిదండ్రుల్లో ఎవరో ఒకరు చనిపోవడం, కొందరికి ఇద్దరూ లేకపోవడం ఉంటోంది. ఇవే కాకుండా తల్లిదండ్రులు విడిపోయిన కేసులు, వేర్వేరుగా ఉంటున్న కేసులకు సంబంధించిన విద్యార్థులకు కొత్త ఉపకార వేతనాల ఆన్‌లైన్ పునరుద్ధరణ నిబంధనలు ఎలా అధిగమించాలో తెలియక తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు.
పునరుద్ధరణకు గత ఏడాది మార్కుల జాబితా, ఈ ఏడాది జూన్ 2 తరువాత మీ-సేవా కేంద్రం ద్వారా తహశీల్దార్ జారీ చేసిన ఆదాయ కులధ్రువీకరణ పత్రాలు, పాన్‌కార్డ్ ఉంటే ఆ నంబరు, కారులాంటి నాలుగు చక్రాల వాహనం ఉంటే దాని వివరాలు, సెల్‌ఫోన్ నంబరు తప్పనిసరిగా ఉండి తీరాలి. ఇవే కాక ఆధార్ తీయించుకున్నా రాకపోయిన వారు కూడా దరఖాస్తు పునరుద్ధరణ చేసుకోలేకపోతున్నారు. నిబంధనలు సడలించకపోతే పలువురు పేద విద్యార్థులు ఉపకార వేతనాలు, ఫీజులు పొందే అవకాశం కోల్పోనున్నారు.
ఉపకారం
Published Mon, Nov 10 2014 3:09 AM | Last Updated on Thu, Sep 27 2018 4:59 PM
Advertisement