కుందుర్తి : ఎవరైనా పాఠశాల ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తారు. కానీ అనంతపురం జిల్లా కుందుర్తి మండలం తూముకుంట గ్రామంలో మాత్రం పరిస్థితి మరోలా ఉంది. ఉపాధ్యాయులు లేని పాఠశాల మాకు అవసరం లేదంటూ గ్రామస్తులు శుక్రవారం ప్రాథమికోన్నత పాఠశాలకు తాళాలు వేసి నిరసన వ్యక్తం చేశారు. పాఠశాలలో ఒకే ఒక ఉపాధ్యాయురాలు ఉండగా విద్యార్థులు మాత్రం 150 మంది వరకు ఉన్నారు.
ఉన్న ఆ ఒక్క ఉపాధ్యాయురాలు కూడా అధికారులతో సమావేశాలకు, ఇతరత్రా విధులంటూ పాఠశాలకు ఆడపాదడపా వస్తుంటారు. దీంతో తగినంత మంది ఉపాధ్యాయులను కేటాయించని పరిస్థితుల్లో తమకు పాఠశాల అవసరం లేదని, ఉపాధ్యాయులు లేకపోవడంతో తమ పిల్లలు చదువుల్లేక చెడిపోతున్నారంటూ గ్రామస్తులు అభ్యంతరం వ్యక్తం చేశారు. శుక్రవారం పాఠశాలకు తాళాలు వేసి ఉపాధ్యాయురాలిని లోపలికి వెళ్లనీయకుండా నిరసన తెలిపారు.