సహకార వ్యవస్థను నాశనం చేసే చర్య
అనంతపురం అగ్రికల్చర్: జిల్లా కేంద్ర సహకార బ్యాంకు (డీసీసీబీ) వ్యవహారాలపై సెక్షన్ 51 ప్రకారం విచారణ చేయాలని రిజిస్ర్టార్ ఆదేశించడం సహకార వ్యవస్థను నాశనం చేసేదిగా ఉందని బ్యాంకు ఉద్యోగుల సమన్వయ సంఘం అధ్యక్షుడు డి.రుష్యేంద్రబాబు విమర్శించారు. విచారణను నిలిపివేయాలనే డిమాండ్‌తో నాలుగు రోజులుగా డీసీసీబీ ఎదుట ఉద్యోగ సంఘాలు చేస్తున్న నిరసన కార్యక్రమం ఐదో రోజు మంగళవారం కూడా కొనసాగింది.
ఇలాంటి ఏకపక్ష విచారణను తక్షణం ఉపసంహరించుకోవాలని ఉద్యోగులంతా డిమాండ్ చేశారు. ఆందోళనలో భాగంగా గురువారం స్థానిక జిల్లా సహకార అధికారి (డీసీఓ) కార్యాలయం ఎదుట మహాధర్నా తలపెట్టామన్నారు. సహకార బ్యాంకు ఉద్యోగులు, సొసైటీ ఉద్యోగులు, రైతులు, ఖాతాదారులు గురువారం ఉదయం 9.30 గంటలకు డీసీఓ కార్యాయానికి తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు. నిరసన కార్యక్రమంలో ఉద్యోగుల యూనియన్ నాయకులు సుఖదేవబాబు, జానకీరామ్‌రెడ్డి, అనంతపద్మనాభం పాల్గొన్నారు.