సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ
పార్టీ 24వ జిల్లా మహాసభలు ప్రారంభం
ఏలూరు (ఫైర్‌స్టేషన్ సెంటర్) : కేంద్రంలో అధికారం చేపట్టిన బీజేపీ ప్రభుత్వం నల్ల కుబేరులతో కుమ్మకైందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ విమర్శించారు. సీపీఐ 24వ జిల్లా మహాసభల ప్రారంభం సందర్భంగా ఏలూరు సుబ్బమ్మదేవి మునిసిపల్ పాఠశాల ఆటస్థలంలో బుధవారం సాయంత్రం నిర్వహించిన బహిరంగ సభలో ఆయన ముఖ్యఅతిథిగాపాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బీజేపీకి నల్ల కుబేరులతో సంబంధాలు ఉన్న కారణంగానే వారి పేర్లు వెల్లడించలేమని సుప్రీంకోర్టుకు సమర్పించిన అఫిడవిట్ లో పేర్కొన్నారన్నారు.
అధికారంలోకి వచ్చిన తర్వాత విదేశీ బ్యాంకుల్లో ఉన్న నల్లడబ్బును వెనక్కి తీసుకువస్తామని నరేంద్రమోదీ ఎన్నికల సమయంలో చెప్పారని రామకృష్ణ గుర్తుచేశారు. కేంద్రంలో ఎన్‌డీఏ ప్రభుత్వం కార్పొరేట్ శక్తులకు ఊడిగం చేస్తూ పేదలు, కష్టజీవులు, గిరిజనులు, దళితుల సమస్యలను గాలికి వదిలి వేసిందని ఆరోపించారు. కేంద్ర ఆర్థికమంత్రి బడ్జెట్‌లో రూ. 5 లక్షల 26వేల కోట్ల రాయితీలను కార్పొరేట్ వర్గాలకు కల్పించారని తెలిపారు. ఎన్‌డీఏ 100 రోజుల పాలనలో దేశంలో కార్పొరేట్ శక్తులు రూ. 1లక్షా 60 వేల కోట్ల ఆస్తులను పెంచుకున్నాయన్నారు.
రిలయన్స్ సంస్థ రూ. 32 వేల కోట్లు అంబానీ గ్రూపు సంస్థలు రూ. 48 వేల కోట్లు బీజేపీ అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోనే సంపాదించారంటే ఏ మేరకు ఊడిగం చేస్తున్నారో అర్థమవుతుందని వివరించారు. బీజేపీ శక్తులు దేశంలో మతోన్మాదాన్ని రెచ్చగోడుతూ ప్రజల మధ్య చిచ్చు పెడుతున్నాయన్నారు. ఢిల్లీలో చర్చిలు, స్కూల్ భవానాలపై దాడులు చేస్తున్నారని తెలిపారు. మోడీ హవ ఇక సాగదని ఇటీవల జరిగిన ఢిల్లీ ఎన్నికలు రుజువు చేశాయన్నారు.
కేంద్రమంత్రి వెంకన్ననాయకుడు తాము అధికారంలోకి వస్తే 10 సంవత్సరాల పాటు ఏపీకి ప్రత్యేక హోదా కల్పిస్తామని చెప్పి పుస్తకాలు రాయించుకుని, సన్మానాలు చేయించుకున్నారని రామకృష్ణ తెలిపారు. అయితే ఆయన ప్రస్తుతం మాట మార్చుతున్నారని ఆరోపించారు. వెంకయ్యనాయుడు వెంటనే ఏపీ ప్రజలకు క్షమాపణ చెప్పి తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. జిల్లా కార్యదర్శి డేగా ప్రభాకర్ మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారానికి అలుపెరగని పోరాటాలు చేస్తామన్నారు.
రాష్ట్ర సహాయ కార్యదర్శి జేవీ సత్యనారాయణ మూర్తి, రాష్ట్ర సమితి సభ్యులు వంక సత్యనారాయణ, నెక్కంటి సుబ్బారావు, ఏఐవైఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నవనీతం సాంబశివరావు, పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు బండి వెంకటేశ్వరరావు, రెడ్డి శ్రీనివాస డాంగే, ఎం. వసంతరావు, కోణాల భీమారావు, వైట్ల విద్యాధరరావు, ఎం. సీతారాం తదితరులు ప్రసంగించారు. మహాసభలను పురస్కరించుకుని బుధవారం ఉదయం ఏలూరు నగరంలో నాయకులు, కార్యకర్తలు భారీ ర్యాలీ నిర్వహించారు.
నల్ల కుబేరులతో బీజేపీ కుమ్మక్కు
Published Thu, Feb 19 2015 3:04 AM | Last Updated on Fri, Mar 29 2019 9:04 PM