తొలి పాస్‌పోర్ట్‌ను దరఖాస్తుదారుకి అందజేస్తున్న ఎంపీ డాక్టర్ రవీంద్రబాబు
తూర్పుగోదావరి, అమలాపురం రూరల్: కోనసీమవాసులు ఉపాధి కోసం కువైట్ దేశాలకు వెళ్లి మోసపోతున్న క్రమంలో దుబాయ్‌లోని భారత రాయబారి కార్యాలయానికి అనుసంధానంగా విశాఖపట్నం, అమలాపురంలో ఓ కార్యాలయాన్ని ఏర్పాటు చేసేందుకు కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రిత్వ శాఖ యోచనలో ఉందని అమలాపురం ఎంపీ డాక్టర్ పండుల రవీంద్రబాబు తెలిపారు. అమలాపురం ప్రధాన తపాలా కార్యాలయంలో నూతనంగా ఏర్పాటుచేసిన పాస్‌పోర్టు సేవా కేంద్రాన్ని ఆయన మంగళవారం ప్రారంభించారు. అమలాపురం డివిజన్ పోస్టల్ సూపరింటెండెంట్ ఎ.ఈశ్వరరావు అధ్యక్షతన జరిగిన సభకు ఎంపీ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. పాస్‌పోర్ట్‌లు, వీసాలతో అవగాహన లోపంతో మోసపోతున్న కోనసీమ ప్రజల కోసం అమలాపురం పోస్టల్ కార్యాలయంలో ఓ హెల్ప్ లైన్ కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేయనున్నామని ఎంపీ వెల్లడించారు.
మరో అతిథి విశాఖపట్నం పాస్‌పోర్ట్ కేంద్రం అధికారి ఎన్‌ఎన్‌పీ చౌదరి మాట్లాడుతూ దేశంలోనే విశాఖపట్నం పాస్‌పోర్ట్ కేంద్రం మొదటి స్థానంలో ఉందని వివరించారు. తత్కాల్ పాస్‌పోర్ట్‌లు మూడు రోజుల్లో, సాధారణ పాస్‌పోర్ట్‌లు పది నుంచి పదిహేను రోజుల్లో జారీ చేస్తున్నామన్నారు. పాస్‌పోర్ట్ సేవలను గ్రామీణ ప్రాంతాల్లో కూడా సక్రమంగా అందించాలన్ని ఉద్దేశంతో ప్రతి పార్లమెంట్ నియోజవర్గానికి ఒకటి వంతున పాస్‌పోర్ట్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. ఇప్పటికే జిల్లాలో కాకినాడ, రాజమహేంద్రవరంలో ఈ కేంద్రాలు ఉన్నాయని, మూడో కేంద్రంగా అమలాపురంలో ప్రారంభించామని తెలిపారు. విశాఖ పోస్ట్ మాస్టర్ జనరల్ ఎం.ఎలీషా మాట్లాడుతూ పోస్టల్ శాఖ, విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖలు సంయుక్తంగా పోస్ట్ ఆఫీసుల్లో పాస్‌పోర్ట్ కార్యాలయాలు ఏర్పాటు చేస్తున్నాయని వివరించారు. రోజుకు ఈ కేంద్రం ద్వారా 50 మందికి మాత్రమే పాస్‌పోర్ట్ కోసం స్లాట్ బుక్ చేస్తామన్నారు. సభలో కొత్తగా మంజూరైన పాస్‌పోర్ట్‌లను ఎంపీ రవీంద్రబాబు దరఖాస్తుదారులకు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ డైరెక్టర్ మెట్ల రమణబాబు, ఉప్పలగుప్తం జడ్పీటీసీ సభ్యుడు దేశంశెట్టి లక్ష్మీనారాయణ, పోస్టల్ అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఎన్‌సీహెచ్ రాజేష్, మున్సిపల్ కౌన్సిలర్ యక్కల సాయిలక్ష్మి, మార్కెటింగ్ కమిటీ మాజీ చైర్మన్ అల్లాడ స్వామినాయుడు, మున్సిపల్ కౌన్సిల్ విప్ నల్లా స్వామి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment