పంచదార పైపైకే వెళ్తోంది.. మంచినూనె చెంతకు రానంటోంది. బియ్యం ధర మండిపోతోంది. పప్పుల ధరలు తిప్పలు పెడుతున్నాయి. ఇలా.. నిత్యావసర వస్తువులు సామాన్యుడికి అందనంత దూరానికి చేరాయి. బంధువులతో కలసి సరదాగా జరుపుకుందా మనుకుంటున్న దసరా పండుగ ఆశ నెరవేరేలా కనిపించడం లేదు. నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశన్నంటడంతో వాటిని కొనే పరిస్థితి లేక పండుగ నాడు కూడా పస్తులుండాల్సిందేనా అన్న నిరాశలో పేదలున్నారు.
పాలమూరు :
ఏం కొనేటట్టు లేదు.. ఏం తినేటట్టు లేదు.. అన్న చందంగా తయారైంది. పేద, మధ్య తరగతి ప్రజల పరిస్థితి. ప్రధాన పండగల వేళ నిత్యావసర వస్తువుల ధరలు అమాంతం పెరగడం ఇబ్బందిగా మారింది. పేద, మధ్య తరగతి కుటుంబాలు పండుగ పూట పిండివంటలు చేసుకునేందుకు జంకుతున్నారు. ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే.. పండుగ పూట పస్తులుండాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఉప్పు, పప్పు, చక్కెర, మంచినూనె తదితర నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ప్రభుత్వ చౌక ధరల దుకాణాల ద్వారా సరఫరా చేస్తున్న రేషన్ సరుకులను కుదించడంతో సామాన్యుడిపై అదనపు భారం పడుతోంది. దీంతో తెలంగాణలో అత్యంత వైభవంగా జరుపుకునే బతుకమ్మ, దసరా పండుగలు ఇప్పుడు సామాన్యులకు భారంగా మారాయి. ఓ వైపు పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలు, మరోవైపు రేషన్ సరుకుల్లో కోత.. వెరసి పండగ పూట వస్తులుండే పరిస్థితి నెలకొంది. బతుకమ్మ, దసరా, బక్రీద్.. వరుసగా వస్తున్న పండుగలు పేద, మధ్య తరగతి వారికి భారంగా మారాయి.
తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమైన ఈ పండుగలను ఆర్భాటవంగా జరుపుకోవాలని చెబుతున్న ప్రభుత్వం ధరలను నియంత్రించి రేషన్ సరుకులను సకాలంలో అందించాలని ప్రజలు కోరుతున్నారు. జిల్లాలో 9 సరుకుల జాడే లేకుండా పోయింది. జిల్లాలో 10 లక్షల కుటుంబాలున్నాయి. తెలుపు, అంత్యోదయ, అన్నపూర్ణ కార్డులు 9.57 లక్షల వరకున్నాయి. తెలుపు కార్డులపై కేవలం బియ్యం, అరకిలో చక్కెర మాత్రమే సరఫరా చేస్తున్నారు. అమ్మహస్తం పేరుతో ఇస్తున్న 9 రకాల వస్తుల్లో ప్రస్తుతం బియ్యం,చక్కెర మాత్రమే ఇస్తున్నారు. దీంతో కార్డుదారులు మిగతా సరుకులను బహిరంగ మార్కెట్‌లో కొనుగోలు చేయక తప్పని పరిస్థితి నెలకొంది. పండుగల సందర్భంగా ప్రజలు ఎక్కువగా పిండి వంటలు చేస్తుంటారు. వీటిలో వినియోగించే పామోలిన్, కందిపప్పు, ఉప్పు, కారం ఇలా ప్రధానమైన సరుకులు రేషన్ దుకాణాల్లో అందుబాటులో ఉండటం లేదు. బయటి మార్కెట్‌లో అధిక ధరలకు కొనుగోలు చేయాలంటే జంకుతున్నారు. ప్రతి సంవత్సరం పండుగకు అదనంగా అరకిలో చక్కెర ఇచ్చేవారు. ఇప్పుడు ఆ ఊసే లేకుండా పోయింది.
నిలిచిపోయిన పామోలిన్, కందిపప్పు
రేషన్ దుకాణాల ద్వారా సరఫరా చేసే పామోలిన్ ఏడు నెలలుగా నిలిచిపోయింది. ప్రతినెల జిల్లాకు 8లక్షల పామోలిన్ ప్యాకెట్లు రావాల్సి ఉండగా ఎన్నికల ముందు నుంచి సరఫరా కావడం లేదు. గతంలో ప్రతి రేషన్ కార్డుపై లీటర్ పామోలిన్ రూ. 40కు ఇచ్చేవారు. ప్రస్తుతం బహిరంగ మార్కెట్‌లో పామోలిన్ రూ.55 ఉంది. కంది పప్పుదీ అదే పరిస్థితి. జిల్లాకు ప్రతినెల దాదాపు 8 లక్షల కంది పప్పు ప్యాకెట్లు రావాల్సి ఉండగా అవి 5 నెలలుగా నిలిచిపోయాయి.
కందిపప్పు రేషన్ దుకాణాల్లోకి కిలో రూ.47కు ఇవ్వగా బహిరంగ మార్కెట్‌లో రూ.80కి విక్రయిస్తున్నారు. గత నెల వరకు బహిరంగ మార్కెట్‌లో కిలోకు రూ.30 ఉన్న చక్కెర ప్రస్తుతం రూ.34కు చేరింది. ప్రభుత్వం చౌక ధరల దుకాణాల ద్వారా ఒక్కో కార్డుపై కేవలం అరకిలో చక్కెర మాత్రమే ఇస్తున్నారు. అదనపు చక్కెర కోసం ఆశపడుతున్న వారికి నిరాశే ఎదురవుతోంది. రేషన్ షాపులో కిలో రూ.13.50కు లభించే పంచదార కాస్తా బహిరంగ మార్కెట్‌లో రూ.34కి చేరడంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు.
పండగపూట పస్తులేనా ?
Published Wed, Oct 1 2014 3:45 AM | Last Updated on Sat, Sep 2 2017 2:11 PM
Advertisement