తెలంగాణలో గతంలో ఎన్నడూ లేని రీతిలో వరి ధాన్యం దిగుబడి భారీగా పెరిగింది. అయినా బియ్యం ధరలు భగ్గుమంటున్నాయి. మరోవైపు కరోనా కారణంగా గ్రేటర్‌లో బియ్యం వినియోగం కూడా భారీగా తగ్గింది. వివిధ ఉపాధి అవకాశాలు, వృత్తులను నమ్ముకొని వచ్చిన ఇతర జిల్లాల్లోని వారు తమతమ సొంత ఊళ్లకు వెళ్లిపోవడంతో స్థానికంగా వినియోగం తగ్గిందని వ్యాపారులు చెబుతున్నారు. వినియోగం.. డిమాండ్ తగ్గినా గ్రేటర్‌లో మాత్రం ధరలు తగ్గడం లేదని వినియోగదారులు లబోదిబోమంటున్నారు.
సాక్షి, హైదరాబాద్: బియ్యాన్ని వ్యవసాయ ఉత్పత్తుల జాబితాలో చేర్చి జీఎస్టీ నుంచి మినహాయింపు ఇచ్చారు. దీని వల్ల బియ్యం ధరలు తగ్గి సామాన్య ప్రజలకు అందుబాటులోకి వస్తుందని భావించారు. గతంలో బియ్యంపై 4 శాతం వ్యాట్‌ను వసూలు చేసేవారు. వ్యాట్ వసూలు చేయడం వల్లే బియ్యం ధరలు పెరుగుతున్నాయని వ్యాట్‌ను తొలగించాలంటూ రైస్ మిల్లర్లు, వ్యాపారులు ఆందోళన చేసి ప్రభుత్వానికి వినతి పత్రాలను సమర్పించారు. జీఎస్టీ పుణ్యమా అని బియ్యంపై అసలు పన్నులేకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ప్రస్తుతం బియ్యం అమ్మకాలు ఫ్రీ మార్కెట్ అయ్యింది. ఈ నేపథ్యంలో ప్రజలు బియ్యం ధరలు తగ్గుతాయని సంతోషించారు. వ్యాపారులపై పన్నుల భారం తగ్గింది కానీ... వినియోగదారులపై ధరాఘాతం మాత్రం తగ్గలేదు.
ప్రస్తుతం గ్రేటర్‌లో బియ్యం కిలో రూ. 46 నుంచి రూ. 50కి తక్కువ లేవు. వ్యాట్ ఉన్నప్పుడూ అదే ధర వ్యాట్ తొలగించిన తర్వాతా అదే ధరకు బియ్యం అమ్ముతుండటంతో వ్యాట్‌తో ఎవరికి లాభం కలిగిందనే విషయం అందరికీ ఇట్టే అర్థం చేసుకోవచ్చు. వ్యాపారులు మిల్లర్ల నుంచి కిలో రూ. 28 నుంచి రూ. 30కు కొనుగోలు చేస్తున్నారు. కానీ సాధారణ వినియోగదారులకు కిలో రూ. 46 నుంచి రూ. 50లకు అమ్ముతున్నారు. ఈ పరిస్థితిపై ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే సామాన్య ప్రజలు మరింతగా ఇబ్బంది పడాల్సి వస్తుందనే ఆందోళన సర్వత్రా వ్యక్తం అవుతోంది. (ప్రభుత్వ అధీనంలోకి ప్రైవేటు ఆస్పత్రులు)
వరి సాగులో గణనీయమైన మార్పు
తెలంగాణ పూర్తిగా వరిపై ఆధారపడిన రాష్ట్రంగానే చెప్పవచ్చు. ఏటా దాదాపు అన్ని జిల్లాల్లోనూ వరినే అధికంగా సాగు చేస్తుంటారు. ఖరీఫ్‌లో ఊహించని విధంగా దిగుబడి పెరిగింది. ఖరీఫ్‌లో 41 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని పౌరసరఫరాల శాఖ రైతుల నుంచి కొనుగోలుచేసింది. ఇక మిల్లర్లు నేరుగా రైతుల నుంచి మరో 10 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలుచేసి ఉంటారని అంచనా. అలాగే ఖరీఫ్‌లో దాదాపు 50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయాలని పౌరసరఫరాల శాఖ నిర్ణయించింది. అంటే కొందరు మిల్లర్లు నేరుగా మరో 10 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలుచేసే అవకాశం ఉందని అంటున్నారు.
ఖరీఫ్ తర్వాత రెండోపంటగా రబీలో ఊహించని విధంగా వరి దిగుబడి పెరుగుతున్నా బహిరంగ మార్కెట్‌లో బియ్యం ధరలు మాత్రం తగ్గడం లేదు. మార్కెట్‌లో సన్న బియ్యం కొనాలంటే కనీసం రూ. 46 పెట్టనిదే దొరికే పరిస్థితి లేదు. బియ్యం వ్యాపారులు ఇష్టారాజ్యంగా ధరలు పెంచి అమ్ముతున్నా ప్రభుత్వం మాత్రం పట్టించుకోవడం లేదు. జీఎస్టీ నుంచి మినహాయింపు ఇచ్చిన ఉత్పత్తుల ధరలు తగ్గుతాయని, మినహాయింపు ఫలాలు వినియోగదారులకు అందేలా చూస్తామని ప్రభుత్వం చెప్పినా ఇప్పటి వరకూ బియ్యం విషయంలో మాత్రం ఏచర్య తీసుకోలేదు.
Comments
Please login to add a commentAdd a comment