‘పటాస్’ చిత్ర యూనిట్ సందడి
- చిత్ర విజయంలో జిల్లావాసుల ప్రతిభ
- పూల వర్షం కురిపించిన అభిమానులు
ఒంగోలు అర్బన్: ఒంగోలు నగరంలో ‘పటాస్’ చిత్ర యూనిట్ సందడి చేసింది. ఈ మేరకు నందమూరి కల్యాణ్‌రామ్ నిర్మించి నటించిన పటాస్ చిత్రం విజయోత్సవ యాత్రలో భాగంగా శనివారం చిత్రంలో నటించిన నటులు గోరంట్ల కాంప్లెక్స్ యాజమాన్యం ఏర్పాటు చేసిన విజయోత్సవ సభలో పాల్గొన్నారు. స్థానిక సంఘమిత్ర ఆసుపత్రి నుంచి ర్యాలీగా కొనసాగి గోరంట్ల కాంప్లెక్స్‌కి చేరుకున్నారు. తమ అభిమాన హీరో నందమూరి కల్యాణ్‌రామ్, సాయికుమార్ ఇతర నటులపై పూల వర్షం కురిసిస్తూ తమ అభిమానాన్ని చాటుకున్నారు.
విజయోత్సవ సభలో కల్యాణ్‌రామ్ మాట్లాడుతూ తాను నిర్మించిన నందమూరి తారక రామారావు ఆర్ట్స్ బ్యానర్‌లో గతంలో అతనొక్కడే చిత్రం విజయవంతమయిందని, చాలాకాలం తరువాత ‘పటాస్’ విజయం సాధించడం సంతోషంగా ఉందన్నారు. ఈ చిత్రాన్ని విజయపథంలో నిడిపించిన దర్శకులు రావిపూడి అశోక్, సంగీత దర్శకుడు కార్తీక్, పాటల రచయిత బరూరి సుబ్బరాయశాస్త్రి ప్రకాశం జిల్లా వారు కావడం జిల్లా పవరేంటో అర్ధమవుతుందన్నారు.
అటువంటి జిల్లాలో తాము విజయ యాత్ర చేయడం సంతోషకరమన్నారు. నటుడు సాయికుమార్ మాట్లాడుతూ తాను గతంలో పోలీస్ స్టోరీ చిత్రం చేస్తే ప్రజలు ఆదరించారని, ఈ చిత్రంలో పోలీసులకు వ్యతిరేకంగా ఉండే పాత్ర చేయడం కొత్తగా ఉందని, దీన్ని కూడా ప్రజలు ఆదరించడం సంతోషకరమన్నారు. ప్రకాశం జిల్లాతో తనకి ప్రత్యేక అనుబంధం ఉందని గుర్తుచేశారు.
విజయోత్సవ కార్యక్రమంలో చిత్ర యూనిట్‌తోపాటు ఒంగోలు శాసనసభ్యుడు దామచర్ల జనార్ధన్ పాల్గొని మాట్లాడుతూ నందమూరి అభిమానులకు వరుస విజయాలు చేకూరాయన్నారు. ఈ యాత్రలో నిర్మాత దిల్‌రాజు, హాస్యనటులు శ్రీనివాసరెడ్డి, డిస్ట్రిబ్యూటర్ హరి, గోరంట్ల కాంప్లెక్స్ యాజమాన్యం గోరంట్ల వీరనారాయణ, పూరిమిట్ల శ్రీనివాసరావు, ఆలపాటి రామయ్య తదితరులు పాల్గొన్నారు.