వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేల ధ్వజం
సాక్షి, హైదరాబాద్: డెల్టా ప్రాంత రైతులను నట్టేట ముంచేందుకే టీడీపీ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం పట్టిసీమ ప్రాజెక్టును చేపట్టిందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే సీహెచ్ జగ్గిరెడ్డి ధ్వజమెత్తారు. సోమవారం అసెంబ్లీ మీడియా పాయింట్‌లో పార్టీ ఎమ్మెల్యేలు గడికోట శ్రీకాంత్‌రెడ్డి, ఎస్‌బీ అమ్జాద్ బాషా, అత్తార్ చాంద్‌బాషా, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, సర్వేశ్వరరావులతో కలసి జగ్గిరెడ్డి మాట్లాడారు. ధవళేశ్వరం ప్రాజెక్టు వద్ద 12.5 మీటర్ల ఎత్తులో పట్టిసీమ ఎత్తిపోతల పథకం కింద మోటార్లు బిగించడం వల్ల గోదావరి జిల్లాల రైతులకు సాగునీరందని పరిస్థితి ఏర్పడుతుందని జగ్గిరెడ్డి చెప్పారు. పోలవరం ప్రాజెక్ట్ నిర్మిస్తే అన్ని ప్రాంతాలకు న్యాయం జరుగుతుందని, దీనికి తమ పార్టీ కూడా కలసివస్తుందన్నారు. రాయలసీమ మీద ప్రేమ ఉంటే జీవోలో సీమ ప్రస్తావన ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. కమీషన్ల మోజుతో సింగపూర్, జపాన్ విధానాన్ని రాష్ట్ర ప్రజలపై రుద్దే ప్రయత్నం చేయవద్దన్నారు.
ఈ పరిస్థితుల్లో శాసనసభలో పట్టిసీమపై చర్చించేందుకు విపక్షానికి తగిన సమయం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే అమ్జాద్‌బాషా మాట్లాడుతూ.. ప్రజా సమస్యలపై చర్చించే ప్రయత్నం చేస్తుంటే పాలక పక్షం సభలో, బయట కూడా విపక్షంపై ఎదురు దాడి చేయడమే పనిగా పెట్టుకుందని దుయ్యబట్టారు. బడ్జెట్‌లో ప్రాజెక్టులకు కేటాయింపులు చూస్తే ఉద్యోగుల జీతాలకు సరిపోయే పరిస్థితి, అలాంటిది రాయలసీమను ఆదుకుంటామని పాలకపక్షం చెప్పడంపై ప్రజలు బాధపడుతున్నారన్నారు.
చివరికి బ్రాహ్మణి స్టీల్స్‌కు కూడా బడ్జెట్‌లో కేటాయింపులు చూపలేదన్నారు.రాయలసీమను ఆదుకోవాలన్న చిత్తశుద్ధి లేకుండా కాంట్రాక్టర్లకు సొమ్ము చేయడానికే పట్టిసీమ ప్రాజెక్టును చేపట్టిందన్నారు. దీనివల్ల రూ.4 వేల కోట్ల ప్రజాధనం దుర్వినియోగమవుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. మరో ఎమ్మెల్యే చాంద్‌బాషా మాట్లాడుతూ పట్టిసీమపై సుదీర్ఘమైన చర్చ జరిగినప్పడే న్యాయం జరుగుతుందన్నారు. ఈ ప్రాజెక్ట్ విషయంలో పాలకపక్షం సభ్యులు అసంతృప్తితో ఉన్నప్పటికీ సీఎం చంద్రబాబుకు భయపడి మాట్లాడడం లేదన్నారు.
డెల్టా రైతులను ముంచేందుకే పట్టిసీమ
Published Tue, Mar 17 2015 4:18 AM | Last Updated on Mon, Aug 20 2018 6:35 PM
Advertisement
Advertisement