టీడీపీలో పవన్ కల్యాణ్ దుమారం
‘పవన్ కల్యాణ్ వల్లే టీడీపీకి అధికారమొచ్చింది. రాష్ట్రానికి చంద్రబాబు సీఎం అయినా.. మాకు మాత్రం డెప్యూటీ సీఎం నిమ్మకాయల చినరాజప్పే ముఖ్యమంత్రి’ అంటూ ఇటీవల అధికార తెలుగుదేశం పార్టీలోని ఓ వర్గం నేతలు చేస్తున్న కోలాహలం ఎటు తిరిగి ఎటొస్తుందోనన్న చర్చ ఇప్పుడు రాజకీయ పరిశీలకుల్లో మొదలైంది. అధికారంలోకి వచ్చి మూడు నెలలు దాటినా ఇంకా సన్మానాలు, సత్కారాల మోజులోనే ఉన్న టీడీపీలోని ఓ సామాజిక వర్గానికి చెందిన ప్రజాప్రతినిధులు ఏలూరులో గత వారం తమ వర్గం నేతల నిర్వహణలో జరిగిన సభలో చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. పవన్‌కల్యాణ్‌ను కీర్తిస్తూ ఆ సామాజిక వర్గం నేతలు మాట్లాడితే ఎవరికీ ఇబ్బంది లేదు.
కానీ... టీడీపీ ప్రజాప్రతినిధులు కూడా ‘వర్గం’ కోణంలో మాట్లాడటం, కేవలం పవన్ ప్రచారంతోనే మన జిల్లాలోని పదిహేను సీట్లూ గెలుచుకున్నామంటూ చేస్తున్న వ్యాఖ్యలు వివాదాస్పదం అవుతున్నాయి. టీడీపీకి మొదటి నుంచీ కొమ్ముకాస్తున్న బలమైన ఓ సామాజిక వర్గం నేతలు ఈ వ్యాఖ్యలను ఏ మాత్రం జీర్ణించుకోలేకపోతున్నారు. పవన్ జనసేన పార్టీ పెట్టకముందే జరిగిన మునిసిపల్, పంచాయతీ, స్థానికసంస్థలు, సహకార ఎన్నికల్లో టీడీపీ పాగా వేసిన విషయాన్ని ఆ వర్గం నేతలు గుర్తు చేస్తున్నారు.
సార్వత్రిక ఎన్నికల్లో పవన్ ప్రభావం లేదని కొట్టిపారేయలేం కానీ.. కేవలం పవన్ వల్లనే అధికారంలోకి వచ్చామన్న భావన, వ్యాఖ్య లు సరైనవి కావని ఆ వర్గం నేతలు అంటున్నారు. ఎటూ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు సహా బీజేపీ నేతలు వీలు దొరికినప్పుడల్లా పవన్‌కు కీర్తిస్తున్నారని, ఇప్పుడు టీడీపీలోని ఓ వర్గం నేతలూ ఇదే రాగం ఆలపిస్తుండటంతో పార్టీకి కొమ్ముకాస్తున్న మిగిలిన వర్గాలు దూరమయ్యే ప్రమాదం ఉందని ఒకింత ఆందోళన చెందుతున్నారు. అరుుతే, పదేళ్ల తర్వాత పార్టీని పవర్‌లోకి తీసుకువచ్చిన సామాజిక వర్గ సమీకరణల నేపథ్యంలో సున్నితమైన ఈ అంశాన్ని బాహాటంగా చెబితే బాగోదని నోరునొక్కుకుంటున్నారు.
సఖ్యతతో ‘రాజు’.. లక్ష్యంతో ‘సాంబ’
ఎప్పుడొచ్చామన్నది కాదు.. వార్తల్లో నిలిచామా లేదా.. కేంద్ర మాజీ మంత్రి, భారతీయ జనతాపార్టీ నేత కావూరి సాంబశివరావు వ్యవహారశైలి ఇప్పుడు సరిగ్గా ఇలాగే నడుస్తోంది. ఎన్నికల ముందు.. ఆ తర్వాత మూడు నెలల పాటు ఎక్కడా కనిపించకుండాపోయిన కావూరి సరిగ్గా ఐదురోజుల కిందట బీజేపీ నేతగా జిల్లాకు వచ్చి హల్‌చల్ చేశారు. వచ్చీ రాగానే తెలుగుదేశం నేతల అరాచకాలపై నేరుగా విమర్శలు గుప్పించారు. కావూరి వ్యాఖ్యల వెనుక మర్మమేమిటన్నది తొలుత చాలా మందికి అర్థం కాకుండాపోయింది. ఎవరేమనుకున్నా తాను అనాలనుకున్నదీ.. చెప్పాలనుకున్నదీ కుండబద్దలు కొట్టినట్టు మాట్లాడే కావూరి ఇప్పుడు ఇలా దూకుడుగా వెళ్తుండటం వెనుక చాలా ‘ముందుచూపు’ ఉందంటున్నారు.
బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉన్నా ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం టీడీపీకి తోక పార్టీగానే ఉండిపోతోందన్నది రాజకీయ పరిశీలకులు చెబుతున్న వాస్తవం. సరిగ్గా ఈ నేపథ్యంలో రాష్ట్రంలో బలమైన పునాదులపై దృష్టిపెట్టిన బీజేపీలోని ఓ వర్గం టీడీపీతో దూకుడుగా వెళ్లాలని నిర్ణయించిన కార్యాచరణలో భాగంగానే కావూరి అలా దూసుకెళ్తున్నారని అంటున్నారు. మరోవైపు జిల్లాలో తనకంటూ ఓ వర్గా న్ని తయారుచేసుకునే పనిలో కూడా కావూరి ఉన్నారని విశ్లేషకులు చెబుతున్నారు. భీమవరంలో మునిసిపల్ వైస్ చైర్మన్ పదవిని ఆశించి భంగపడి.. కౌన్సిలర్‌గానే మిగిలిపోయిన జిల్లా బీజేపీ అధ్యక్షుడు భూపతిరాజు శ్రీనివాసవర్మను తోడుగా చేసుకుని కావూరి ఆ పార్టీ రాజకీయాల్లో వేగంగానే పావులు కదుపుతున్నారని అంటున్నారు.
ఇప్పటికే జిల్లాకు చెందిన మంత్రి పైడికొండల మాణిక్యాలరావును కలుకుపుని నరసాపురం ఎంపీ గోకరాజు గంగరాజు ఓ వర్గంగా టీడీపీతో సఖ్యతతో ముందుకెళ్తున్నారు. ఇప్పుడు ఇదే టీడీపీని టార్గెట్ చేస్తూ బీజేపీలో కావూరి పవర్‌సెంటర్‌గా మరో వర్గం తయారవుతోందని అంటున్నారు. పరస్పర విరుద్ధభావాలతో ఈ రెండు వర్గాలూ సమాంతరంగా ముందుకెళ్తూ జిల్లాలో బీజేపీని ఎటువైపు తీసుకువెళ్తాయో అన్నది కాలమే నిర్ణయించాలి.
- జి.ఉమాకాంత్,
సాక్షి ప్రతినిధి, ఏలూరు