మార్చి 17న నరేంద్ర మోడీతో పవన్ భేటి?
'కాంగ్రెస్ హటావో, దేశ్ బచావో' నినాదంతో క్రియాశీలక రాజకీయాల్లోకి ప్రవేశించిన టాలీవుడ్ నటుడు పవన్ కళ్యాణ్ బీజేపీకి దగ్గరవుతున్నట్టు ఓ ప్రముఖ ఆంగ్ల దినపత్రిక తన కథనంలో వెల్లడించింది. బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్రమోడీతో పవన్ కళ్యాణ్ మార్చి 17 తేదిన సమావేశం కాబోతున్నట్టు తన కథనంలో వెల్లడించింది. అయితే అధికారికంగా ఈ భేటికి సంబంధించిన విషయాలు వెల్లడికాలేదు.
మార్చి 14 తేదిన 'జనసేన పార్టీ' ప్రారంభోత్సవ కార్యక్రమంలో కాంగ్రెస్ పై దుమ్మెత్తిపోసిన పవన్ కళ్యాణ్.. బీజేపీ, టీడీపీలకు వ్యతిరేకంగా ఎలాంటి వ్యాఖ్యలు చేయకపోవడం కూడా మోడీతో పవన్ భేటి కావొచ్చనే వార్తలకు బలం చేకూరుస్తున్నాయి. అంతేకాకుండా 'కాంగ్రెస్ హటావో, దేశ్ బచావో' అనే నినాదంతో కాంగ్రెస్ పార్టీపై విరుచుకుపడుతూ మోడీ ప్రచారం చేస్తుండటం, అదే నినాదాన్ని పవన్ ఎత్తుకోవడం అనేక సందేహాలకు తావిస్తోంది.
బీజేపీ, తెలుగుదేశం పార్టీలు ఎన్నికల పొత్తు దాదాపు ఖారారైనట్టు వస్తున్న వార్తలు వెలువడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ రెండు పార్టీలపై ఓ రకమైన పవన్ సానుకూలతను తెలుగుదేశం, బీజేపీ నేతలు అనుకూలంగా మార్చుకోనే అవకాశం ఉన్నట్టు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఎన్నికల కమిషన్ గుర్తింపు ఇంకా రాకపోవడం, కామన్ సింబల్ సమస్య జనసేన పార్టీకి ఎన్నికల్లో పోటికి ఆటకం కలిగించే అవకాశాలున్నాయి.
దాంతో పవన్ బీజేపీ వైపు దృష్టిసారించారా అనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. మరో రెండు రోజుల్లో ఓ సమావేశాన్ని ఏర్పాటు చేసి జనసేన సిద్దాంతాలకు సంబంధించిన ఓ పుస్తకాన్ని ఆవిష్కరించే ప్రయత్నాలు వేగంగా జరుగుతున్నట్టు తెలుస్తోంది. ఏది ఏమైనా మోడీ, పవన్ ల భేటి వార్త రాజకీయాల్లో కొంత ఆసక్తి రేకేత్తిస్తోంది.