
'పవన్ కన్నా గొప్ప నాయకుడు దొరకడు'
హైదరాబాద్: 'జనసేన' పేరులోనే ఇంతుంటే పార్టీలో ఇంకెంతుంటుందోనని సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ వ్యాఖ్యానించారు. జనసేన అనే పేరు శివసేన కన్నా వెయ్యి రెట్లు మెరుగ్గా ఉందని ట్విటర్లో పేర్కొన్నారు. జనసేన కన్నా గొప్ప పేరు ఒక పార్టీకి ఉండే అవకాశం లేదన్నారు. ప్రజారాజ్యం పార్టీలో జరిగిన అవకతవక పనులు జనసేనలో అసలు జరిగే అవకాశం లేదని వర్మ విశ్వాసం వ్యక్తం చేశారు.
పవన్ కళ్యాణ్ కన్నా గొప్ప నాయకుడు దొరకడు కాబట్టి జనసేన పార్టీని అత్యధిక మెజారిటీతో గెలిపించి తెలుగువాళ్లు తెలివైనవారని నిరూపించుకోవాలన్నారు. తన ఉద్దేశంలో తెలివి, నీతి, అభిమానం, పౌరుషం ఉన్నవాళ్లెవరైనా పవన్ జనసేన పార్టీకి ఓటు వేస్తారని వర్మ వ్యాఖ్యానించారు. జనసేన పేరుతో పవన్ కళ్యాణ్ కొత్తపార్టీ పెడుతున్నట్టు వార్తలు వచ్చిన నేపథ్యంలో ఆయనీ వ్యాఖ్యలు చేశారు.