పెద్దాపురం బహిరంగ సభలో ప్రసంగిస్తున్న పవన్ కల్యాణ్...
తూర్పుగోదావరి, పెద్దాపురం/సామర్లకోట: దేవుడని నమ్మితే దెయ్యమై కూర్చునట్లుంది రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పనితీరని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. ప్రజా పోరాట యాత్రలో భాగంగా సోమవారం రాత్రి పెద్దాపురం పట్టణంలో నిర్వహించిన బహిరంగ సభలో ప్రభుత్వ అవినీతిని ఎండగట్టారు. కష్టాల్లో ఉన్న రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే అనుభవజ్ఞుడు అవసరమని నాడు చంద్రబాబుకు మద్దతిస్తే అవినీతిపై అనుభవం పెంచుకున్నారన్న విషయం అర్థం కాలేదన్నారు. ప్రభుత్వ అవినీతిని చూడలేక ప్రశ్నించేందుకే జనసేన పార్టీని స్థాపించానని అన్నారు. ఒక్క సూరంపాలెంలోనే దళితులకు ఇచ్చిన పొలాలను లాక్కొని మంత్రులు, ఎమ్మెల్యేలు అక్రమ మట్టి తవ్వకాలతో దాదాపు రెండు వేల కోట్ల రూపాయల అవినీతికి పాల్పడితే చంద్రబాబుకు తెలియదా అని ప్రశ్నించారు.
ఎమ్మెల్యే కాకుండానే అడ్డదారిన ఎమ్మెల్సీ సంపాదించి మంత్రి అయిన యనమల రామకృష్ణుడు, హోం శాఖా మంత్రి నిమ్మకాయల చిన రాజప్ప అవినీతికి పాల్పడుతుంటే చోద్యం చూస్తున్న చంద్రబాబు, లోకేష్‌లకు ఏ మాత్రం వాటాలున్నాయో అర్థమవుతోందన్నారు. ఒక్క సూరంపాలెం గ్రామంలో దళితులకిచ్చిన దాదాపు 470 ఎకరాల పంట పొలాలను నిర్వీర్యం చేసి మట్టి వ్యాపారం చేసుకున్న చంద్రబాబు, లోకేష్, మంత్రులు రాజప్ప, యనమల అవినీతికి అడ్డూ అదుపూ లేకుండా పోతోందన్నారు. రెండు వేల కోట్ల అవినీతిని నిరూపించడానికి సాక్ష్యాధారాలతో సహా నిరూపిస్తానని మంత్రులు లోకేష్, రాజప్ప, యనమల సిద్ధమా అని ప్రశ్నించారు. 2019లో మాత్రం తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాదని పవన్ జోస్యం చెప్పారు. అవినీతిని ప్రోత్సాహించే అధికార పార్టీ నాయకులు దీపావళి టపాసుల్లా పేలిపోతారని, అవినీతి బుద్ధి మార్చుకోకుంటే వారి పాపాలకు చరమగీతం పాడుతామన్నారు. ఈ సభలో మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్, మాజీ ఎమ్మెల్సీ కందుల దుర్గేష్, పంతం నానాజీ, మాజీ ఎమ్మెల్యే పంతం గాంధీమోహ¯Œన్, మేడా గురుదత్ ప్రసాద్, నియోజకవర్గ నాయకులు, అభిమానులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment