యువకుల బలిదానాలకు కాంగ్రెసే కారణం: పవన్ కళ్యాణ్
నిజమాబాద్: పదేళ్ల యూపీఏ ప్రభుత్వ హయాంలో తెలంగాణ ఎందుకు ఇవ్వలేదని జననేత అధినేత పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. నిజమాబాద్ లో మోడీతో కలిసి సభలో పాల్గొన్న పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ కుల, మత ప్రాంతాలకు అతీతంగా సమన్యాయం జరగాలి అని అన్నారు. తనకు తెలంగాణ అంటే ఇష్టం, ప్రేమ అని పవన్ తెలిపారు. ప్రత్యేక రాష్ట్రం కోసం తెలంగాణ యువకులు ఆత్మత్యాగం చేసుకుంటుంటే బాధేసిందన్నారు. తెలంగాణ ఇచ్చాం..కాంగ్రెస్ ఓటయ్యండి అనే నాయకులను వేయి మంది యువకులను ఎందుకు బలి తీసుకున్నారని ప్రశ్నించాలని ప్రజలకు పవన్ కళ్యాణ్ విజ్క్షప్తి చేశారు.
తెలంగాణలో యువకుల బలిదానాలకు కాంగ్రెసే కారణమని పవన్ ఆరోపించారు. ప్రజారాజ్యం పార్టీ తరపున తెలంగాణ ప్రాంతంలో పర్యటించాను. తెలంగాణ పరిస్థితులు తనకు బాగా తెలుసన్నారు. తనకు కుటుంబ పాలన అంటే ఇష్టం లేదని.. అందుకే తాను ఎమ్మెల్యే, ఎంపీగా పోటీ చేయలేదన్నారు. కూతురు, కుమారుడు, అల్లుడ్లకే టిక్కెట్లు ఎందుకు ఇవ్వాలి అని అంటూ కేసీఆర్ కు చురకలంటించారు. కంసాలి కులానికి ఓట్లు లేవని తెలంగాణవాది డాక్టర్ శ్రవణ్ కు టీఆర్ఎస్ సీటు ఇవ్వకపోవడం చాలా అన్యాయమన్నారు. చట్టసభల్లో ప్రవేశించడానికి కులమే అర్హత కావాలా అంటూ ప్రశ్నించారు.
నోరు మంచిదైతే ఊరు మంచిదంటారు. బంగారు తెలంగాణ తెస్తాననే కేసీఆర్ అందరిపై అనుచిత వ్యాఖ్యలు చేయడం సబబు కాదన్నారు. దేశాభివృద్ది కోసం పాటుపడే మోడీ లేదు గీడీ లేదని కేసీఆర్ వ్యాఖ్యాలను తప్పుపట్టారు. తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే కేంద్ర ప్రభుత్వ అనుమతులు అవసరం ఉంటుందన్నారు. మోడీ లాంటి నేతలను, బీజేపీని విమర్శించే కేసీఆర్ తెలంగాణను ఎలా అభివృద్ధి చేస్తారన్నారు. తాను మోడీకి మద్దతు తెలిపితే... తాను స్థాపించిన జనసేనను మోడీసేన అంటూ ఎద్దేవా చేస్తున్నారన్నారు. దేశం గురించి ఆలోచించే వ్యక్తికి మద్దతు తెలిపితే తప్పా అంటూ ప్రశ్నించారు.