సాక్షి, ద్వారకాతిరుమల(పశ్చిమగోదావరి జిల్లా) : రాబోయే ఎన్నికల్లో జనసేన అధినేత పవన్‌కల్యాణ్ తమతో కలసి పనిచేస్తారన్న భావనలో టీడీపీ ఉందని రాష్ట్ర కాపు కార్పొరేషన్ చైర్మన్ చలమలశెట్టి రామానుజయ అన్నారు. పుణ్యక్షేత్రమైన ద్వారకాతిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆలయాన్ని శనివారం ఆయన సతీసమేతంగా సందర్శించారు. ఆలయానికి విచ్చేసిన ఆయనకు దేవస్థానం అధికారులు మర్యాదపూర్వకంగా స్వాగతం పలికారు. ముందుగా ఆయన స్వామి, అమ్మవార్లను దర్శించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయ ముఖమండపంలో అర్చకులు ఆయనకు శ్రీవారి శేషవస్త్రాన్ని కప్పి, వేద ఆశీర్వచనాన్ని పలికారు.
ఆలయ ఏఈవో ఎం.దుర్గారావు ఆయనకు చినవెంకన్న చిత్రపటాన్ని, ప్రసాదాలను అందించారు. అనంతరం ఆయన శేషాచల కొండపైన ఒక అతిథి గృహంలో విలేకర్లతో మాట్లాడారు. పవన్ కల్యాణ్‌కు, టీడీపీ నేతలకు మధ్య సత్సంబంధాలు ఉన్నాయని, వచ్చే ఎన్నికల్లో ఆయన టీడీపీతో కలసి పనిచేస్తారన్న ఆశాభావం తమకు ఉందన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు కాపులను బీసీల్లో చేర్చడం ఖాయమని, ఎవరూ ఆవేదన చెందొద్దని ఆయన పేర్కొన్నారు. ఇప్పటి వరకు కాపు కార్పొరేషన్ ద్వారా లక్షా 50 వేల మందికి రుణాలు ఇచ్చామని, గ్రూప్స్ పోటీ పరీక్షలకు శిక్షణ పొందుతున్న 1250 మందికి తమ కార్పొరేషన్ ద్వారా ఖర్చుపెట్టామన్నారు. రాష్ట్రంలో సుమారు 60 వేల మంది మహిళలకు కుట్టు శిక్షణ ఇస్తున్నట్లు చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment