Chalamalasetty Ramanujaya
-
పవన్ మాతో కలిసే పనిచేయొచ్చు
సాక్షి, ద్వారకాతిరుమల(పశ్చిమగోదావరి జిల్లా) : రాబోయే ఎన్నికల్లో జనసేన అధినేత పవన్‌కల్యాణ్ తమతో కలసి పనిచేస్తారన్న భావనలో టీడీపీ ఉందని రాష్ట్ర కాపు కార్పొరేషన్ చైర్మన్ చలమలశెట్టి రామానుజయ అన్నారు. పుణ్యక్షేత్రమైన ద్వారకాతిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆలయాన్ని శనివారం ఆయన సతీసమేతంగా సందర్శించారు. ఆలయానికి విచ్చేసిన ఆయనకు దేవస్థానం అధికారులు మర్యాదపూర్వకంగా స్వాగతం పలికారు. ముందుగా ఆయన స్వామి, అమ్మవార్లను దర్శించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయ ముఖమండపంలో అర్చకులు ఆయనకు శ్రీవారి శేషవస్త్రాన్ని కప్పి, వేద ఆశీర్వచనాన్ని పలికారు. ఆలయ ఏఈవో ఎం.దుర్గారావు ఆయనకు చినవెంకన్న చిత్రపటాన్ని, ప్రసాదాలను అందించారు. అనంతరం ఆయన శేషాచల కొండపైన ఒక అతిథి గృహంలో విలేకర్లతో మాట్లాడారు. పవన్ కల్యాణ్‌కు, టీడీపీ నేతలకు మధ్య సత్సంబంధాలు ఉన్నాయని, వచ్చే ఎన్నికల్లో ఆయన టీడీపీతో కలసి పనిచేస్తారన్న ఆశాభావం తమకు ఉందన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు కాపులను బీసీల్లో చేర్చడం ఖాయమని, ఎవరూ ఆవేదన చెందొద్దని ఆయన పేర్కొన్నారు. ఇప్పటి వరకు కాపు కార్పొరేషన్ ద్వారా లక్షా 50 వేల మందికి రుణాలు ఇచ్చామని, గ్రూప్స్ పోటీ పరీక్షలకు శిక్షణ పొందుతున్న 1250 మందికి తమ కార్పొరేషన్ ద్వారా ఖర్చుపెట్టామన్నారు. రాష్ట్రంలో సుమారు 60 వేల మంది మహిళలకు కుట్టు శిక్షణ ఇస్తున్నట్లు చెప్పారు. -
కాపులను బీసీల్లో చేర్చకపోతే ఉరేసుకుంటా
కాపు కార్పొరేషన్ చైర్మన్ రామానుజయ నూజివీడు: ముఖ్యమంత్రి చంద్రబాబు భవిష్యత్‌లో కాపులను బీసీల్లో చేర్చకపోతే తాను నూజివీడులో అందరిముందు ఉరేసుకుంటానని కాపు కార్పొరేషన్ చైర్మన్ చలమలశెట్టి రామనుజయ చెప్పారు. నూజివీడులో ఆదివారం జరిగిన కాపు సంఘం కార్తీక వనసమారాధనలో ఆయన మాట్లాడారు. ఆయన చంద్రబాబును పొగుడుతుండటంతో విస్తుపోయిన కాపు సంఘస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ అసలు కాపులకు చంద్రబాబు ఏం చేశాడంటూ నిలదీశారు. కాపులను బీసీల్లో చేరుస్తానని చెప్పి రెండున్నరేళ్లయినా చేర్చకుండా కమిషన్ పేరుతో కాలయాపన చేస్తున్న సంగతి తెలియదా అని ప్రశ్నించారు. కాపులను చంద్రబాబు ఎన్నికలపుడు ఓటుబ్యాంకుగా వాడుకున్నారు తప్పితే కాపులకు చేసిందేమీ లేదని స్పష్టంచేశారు. కాపు కార్పొరేషన్ రుణాలు కూడా ఎవరికీ రావడం లేదని, టీడీపీ నాయకులు సిఫార్సు చేసిన వారిలో కూడా కొందరికి మాత్రమే మంజూరవుతున్నాయని ధ్వజమెత్తారు. దీంతో కంగుతిన్న రామానుజయ వారికి సర్దిచెబుతూ వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. అయినా వారు శాంతించకపోవడంతో రామానుజయ మైక్ తీసుకుని.. మంజునాథ కమిషన్ నివేదిక ఇచ్చిన తరువాత కాపులను బీసీల్లో చేర్చడం ఖాయమని చెప్పారు. చంద్రబాబు కాపులను బీసీల్లో చేర్చకపోతే తాను నూజివీడులో అందరిముందు ఉరేసుకుంటానని ప్రకటించారు. మంజునాథ కమిషన్ ఇప్పటికే పది జిల్లాల్లో అభిప్రాయాలు సేకరించిందని, నివేదిక ఇచ్చిన తరువాత క్యాబినేట్లో ఆమోదించి కేంద్రప్రభుత్వానికి పంపుతారని ఆయన చెప్పారు. -
'మంజునాథ కమిషన్ నివేదక అందిన వెంటనే చర్యలు'
విజయవాడ: కాపులను బీసీల్లోచేర్చే విషయంలో ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని ఆంధ్రప్రదేశ్ హోంశాఖ మంత్రి, డిప్యూటీ సీఎం ఎన్ చినరాజప్ప స్పష్టం చేశారు. బుధవారం విజయవాడ నగరంలోని సూర్యారావుపేటలో కాపు కార్పొరేషన్ కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం చినరాజప్ప మాట్లాడుతూ... జస్టిస్ మంజునాథ కమిషన్ నుంచి నివేదిక అందిన వెంటనే అవసరమైన చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో వైద్య ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్, కాపు కార్పొరేషన్ చైర్మన్ చలమలశెట్టి రామానుజయ తదితరులు పాల్గొన్నారు. -
'ఎవరో అడిగారని చంద్రబాబు చేయడం లేదు'
విజయవాడ : కాపుల కోసం ఎవరో అడిగారని ముఖ్యమంత్రి చంద్రబాబు చేయడం లేదని ... ఎన్నికల్లో హామీ ఇచ్చారు కాబట్టి చేస్తున్నారని కాపు కార్పొరేషన్ చైర్మన్ చలమలశెట్టి రామానుజయ స్పష్టం చేశారు. ఆదివారం విజయవాడలో చలమలశెట్టి రామాంజనేయ మాట్లాడుతూ... తుని ఘటనలో అరాచకం సృష్టించిన వారిని ప్రభుత్వానికి అప్పజెప్తానని గతంలో మాజీ మంత్రి, కాపు నాయకుడు ముద్రగడ పద్మనాభం చెప్పారు. కానీ ఆయన దీనిపై స్పందించడం లేదని తెలిపారు. తుని ఘటనలో అరెస్ట్ చేసిన వారిని విడుదల చేయాలి అని ముద్రగడ డిమాండ్ చేయడం ఎంత వరకు సమంజసం అని చలమలశెట్టి రామానుజయ ప్రశ్నించారు. -
కాపునాడు చైర్మన్‌ను అడ్డుకున్న సంఘాలు
ఆర్‌ఆర్‌పేట: పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు పట్టణానికి వచ్చిన కాపునాడు కార్పొరేషన్ చైర్మన్ జలమలశెట్టి రామానుజయను సోమవారం కాపునాడు నగర శాఖ నిలదీసింది. సంఘం నగర అధ్యక్షుడు జెల్లా హరికృష్ణ ఆధ్వర్యంలో సంఘం నాయకులు జిల్లా పరిషత్ గెస్ట్‌హౌస్ వద్ద కాపునాడు చైర్మన్‌ను అడ్డగించారు. కాపులకు రిజర్వేషన్లపై ఇప్పటి వరకూ అసెంబ్లీలో ఎందుకు తీర్మానం చేయలేదని ప్రశ్నించారు. కాపులకు రిజర్వేషన్లకు సంబంధించి కోట్ల విజయభాస్కర్‌రెడ్డి హయాంలో జారీ చేసిన జీవో 30ని అమలు చేయాలని కోరారు. కాపునాడు కార్పొరేషన్‌కు ఏటా రూ.1,000 కోట్లు ఇస్తామని చెప్పి.. కేవలం రూ.100 కోట్లు ఇచ్చారని, అవి 13 జిల్లాలకు ఎలా పంచుతారని ప్రశ్నించారు. -
తొమ్మిది నెలల్లో బీసీల్లో చేర్చుతాం
తిరుపతి : రానున్న తొమ్మిది నెలల్లో కాపులను బీసీల్లో చేర్చుతామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాపు కార్పొరేషన్ చైర్మన్ చలమలశెట్టి రామానుజయ తెలిపారు. తిరుపతిలోని పద్మావతి అతిథి గృహంలో మంగళవారం చలమలశెట్టి రామానుజయ విలేకరుల సమావేశంలో మాట్లాడారు. టీడీపీ ప్రభుత్వం కాపుల సంక్షేమానికి కట్టుబడి పనిచేస్తోందన్నారు. అందులో భాగంగానే ఈ ప్రభుత్వం కాపు కార్పొరేషన్‌ను ఏర్పాటు చేసిందని ఆయన గుర్తు చేశారు. అలాగే కాపు సామాజిక వర్గం అభివృద్ధి కోసం టీడీపీ ప్రభుత్వం ఈ కార్పొరేషన్‌కు రూ. 100 కోట్ల కేటాయించిందన్నారు. ఈ నగదు మొత్తం కాపు సామాజిక వర్గ సంక్షేమానికి వినియోగిస్తామని చెప్పారు. బలిజ, ఒంటరి, తెలగ, కాపు కులాల సంక్షేమ చర్యల్లో భాగంగా తాను రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తున్నామన్నారు. ఈ పర్యటనలో భాగంగా ఇప్పటి వరకు గుంటూరు, ప్రకాశం, కర్నూలు, అనంతపురం, కడప, చిత్తూరు జిల్లాల్లో పర్యటించి... కాపు సామాజిక వర్గం నుంచి ఆర్జీలు స్వీకరించామని తెలిపారు. బ్రిటీష్ హయాంలో బీసీల్లో ఉన్న కాపు సామాజిక వర్గాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ఓసీల్లో చేర్చిందని గుర్తు చేశారు. ప్రస్తుతం సీఎం చంద్రబాబు నాయుడు తన ఎన్నికల హామీల్లో భాగంగా కాపులను బీసీల్లో చేర్చడానికి పని చేస్తున్నారన్నారు. ఇందుకోసం రిటైర్డ్ హైకోర్టు న్యాయమూర్తి నేతృత్వంలో కమిటీని ప్రభుత్వం నియమించిందన్నారు.ఈ కమిటీ కాపులను బీసీల్లో చేర్చే అంశంపై అధ్యయనం చేస్తోందన్నారు. తొమ్మిది నెలల్లో ఈ కమిటీ తన నివేదిక అందిస్తుందన్నారు. నివేదిక సమర్పించిన వెంటనే కాపులను బీసీల్లో చేర్చుతామన్నారు. ఈ కార్యక్రమంలో కాపు కార్పొరేషన్ సభ్యులు నవీన్, మురళి వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు.