తిరుపతి : రానున్న తొమ్మిది నెలల్లో కాపులను బీసీల్లో చేర్చుతామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాపు కార్పొరేషన్ చైర్మన్ చలమలశెట్టి రామానుజయ తెలిపారు. తిరుపతిలోని పద్మావతి అతిథి గృహంలో మంగళవారం చలమలశెట్టి రామానుజయ విలేకరుల సమావేశంలో మాట్లాడారు. టీడీపీ ప్రభుత్వం కాపుల సంక్షేమానికి కట్టుబడి పనిచేస్తోందన్నారు.
అందులో భాగంగానే ఈ ప్రభుత్వం కాపు కార్పొరేషన్‌ను ఏర్పాటు చేసిందని ఆయన గుర్తు చేశారు. అలాగే కాపు సామాజిక వర్గం అభివృద్ధి కోసం టీడీపీ ప్రభుత్వం ఈ కార్పొరేషన్‌కు రూ. 100 కోట్ల కేటాయించిందన్నారు. ఈ నగదు మొత్తం కాపు సామాజిక వర్గ సంక్షేమానికి వినియోగిస్తామని చెప్పారు. బలిజ, ఒంటరి, తెలగ, కాపు కులాల సంక్షేమ చర్యల్లో భాగంగా తాను రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తున్నామన్నారు.
ఈ పర్యటనలో భాగంగా ఇప్పటి వరకు గుంటూరు, ప్రకాశం, కర్నూలు, అనంతపురం, కడప, చిత్తూరు జిల్లాల్లో పర్యటించి... కాపు సామాజిక వర్గం నుంచి ఆర్జీలు స్వీకరించామని తెలిపారు. బ్రిటీష్ హయాంలో బీసీల్లో ఉన్న కాపు సామాజిక వర్గాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ఓసీల్లో చేర్చిందని గుర్తు చేశారు.
ప్రస్తుతం సీఎం చంద్రబాబు నాయుడు తన ఎన్నికల హామీల్లో భాగంగా కాపులను బీసీల్లో చేర్చడానికి పని చేస్తున్నారన్నారు. ఇందుకోసం రిటైర్డ్ హైకోర్టు న్యాయమూర్తి నేతృత్వంలో కమిటీని ప్రభుత్వం నియమించిందన్నారు.ఈ కమిటీ కాపులను బీసీల్లో చేర్చే అంశంపై అధ్యయనం చేస్తోందన్నారు. తొమ్మిది నెలల్లో ఈ కమిటీ తన నివేదిక అందిస్తుందన్నారు. నివేదిక సమర్పించిన వెంటనే కాపులను బీసీల్లో చేర్చుతామన్నారు. ఈ కార్యక్రమంలో కాపు కార్పొరేషన్ సభ్యులు నవీన్, మురళి వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు.