తిరుమలలో క్యూలలో భక్తుల రద్దీ
ప్రధాన దేవాలయాల్లో ఉత్సవ వేళల్లో బాణసంచా వినియోగానికి అనుమతులు
తిరుమల, శ్రీశైలం, అన్నవరం ఆలయాల్లో వినియోగం
తగిన రక్షణ ఏర్పాట్లు లేవంటున్న అధికారులు
పుష్కరాల్లో ప్రభుత్వ ఖర్చుతోనే బాణసంచా వాడకం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని అన్ని ప్రధాన దేవాలయాల్లో పండుగ రోజుల్లో ఏ ఉత్సవం నిర్వహించినా ఆలయ ప్రాంగణంలోనో, సమీపానో బాణసంచా వినియోగం సంప్రదాయంగా వస్తోంది. తిరుమలలో ఏడాదికోసారి జరిగే పద్మావతి అమ్మవారి పరిణయోత్సవం సందర్భంగా కొండపై టీటీడీ సిబ్బంది అధికారికంగానే బాణసంచా కాల్చడం ఆనవాయితీ. కేరళ రాష్ట్రం కొల్లం ప్రాంతంలోని పుట్టింగల్ దేవి ఆలయంలో ఉత్సవం సందర్భంగా బాణసంచా పేలుళ్ల కారణంగా భారీఎత్తున ప్రాణ నష్టం చోటుచేసుకోవడం దేశవ్యాప్తంగా సంచలనం రేకెత్తించింది. ఈ నేపథ్యంలో మన రాష్ట్రంలోని ప్రధాన ఆలయాల్లో భద్రత విషయం తీవ్ర చర్చనీయాంశమైంది.
తిరుమలతో పాటు విజయవాడ కనకదుర్గమ్మ, శ్రీశైలం, అన్నవరం, సింహాచలం, శ్రీకాళహస్తి వంటి ప్రముఖ దేవాలయాల ప్రాంగణాల్లో దురదృష్టవశాత్తు ఏవైనా ప్రమాదాలు చోటుచేసుకుంటే వేలాది మంది భక్తులను తక్షణం గుడి ప్రాంగణం నుంచి సురక్షిత ప్రాంతాలకు తరలించడానికి తగిన ఏర్పాట్లు లేవని అధికారులే అంగీకరిస్తున్నారు. తిరుమలలో భక్తుడు ఒకసారి దేవుని దర్శనానికి క్యూలైనులోకి వెళ్లిన తరువాత అనుకోని సంఘటన ఏదైనా జరిగితే వారు సులువుగా, క్షేమంగా బయటకు వచ్చే వెసులుబాటు చాలా తక్కువగా ఉంది. దర్శన సమయంలో భక్తులు 500 మీటర్ల మేర క్యూలైను ద్వారానే గుడిలోకి చేరాల్సి ఉంటుంది. ఒకదాని పక్కన రెండు మూడు క్యూలైన్లు ఉండగా.. ఆపద సమయంలో రోడ్డు వైపున ఉండే క్యూలైను ద్వారా మాత్రమే భక్తులు బయటకు వచ్చే వెసులుబాటు ఉంది.
శ్రీశైలం మాడ వీధుల్లోనే కామ దహనం
రాష్ట్రంలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉండే రెండో దేవాలయమైన శ్రీశైలంలో ప్రతి ఏటా దసరా నవరాత్రుల ముగింపు రోజు, హోలీ పండుగ రోజు కామ దహనం సందర్భంగా మాడ వీధుల్లోనే బాణసంచా పెద్దఎత్తున పేల్చడం సంప్రదాయంగా కొనసాగుతోంది. కామదహనం రోజున చెత్తను భారీగా పోగుచేసి నిప్పంటించి వేడుక చేస్తారు. దుకాణాలు, భక్తులతో ఎప్పడూ రద్దీగా ఉండే మాడవీధుల్లో బాణసంచా పేల్చడం వల్ల ఏదైనా ప్రమాదం జరిగితే సురక్షితంగా బయట పడడం చాలా కష్టం.
అన్నవరంలో ప్రతి ఏటా వైశాఖ శుద్ద ఏకాదశి రోజున జరిగే దేవుడి కల్యాణోత్సవం సందర్భంగా కాల్చే బాణసంచాను తిలకించడానికి పెద్ద ఎత్తున భక్తులు గుమిగూడతారు. ఈ సమయంలో అక్కడ బాణసంచా వినియోగం ప్రమాదాలకు ఆస్కారమిస్తుందని అధికారులు, భక్తులు అభిప్రాయపడుతున్నారు. విజయవాడ కనకదుర్గమ్మ అమ్మవారి కొండపై బాణసంచా వంటి వినియోగం లేకపోయినా కొండపై రద్దీ పెరిగి తొక్కిసలాట చోటు చేసుకుంటే భక్తులు సులభంగా బయట పడే వీలు తక్కువగా ఉంది.
పుష్కరాల్లోనూ ఇదే పరిస్థితి
లక్షలాది భక్తులు వచ్చే పుష్కరాల సమయంలో ప్రభుత్వ చర్యలు నామమాత్రంగానే ఉంటున్నాయి. మొన్నటి గోదావరి పుష్కరాల ప్రారంభం రోజున తొక్కిసలాట జరిగి 28 మంది వరకు మృతి చెందిన విషయం తెలిసిందే. గోదావరి హారతి సమయంలో నది ఒడ్డున వేలాది మంది భక్తులు గుమిగూడి ఉన్న సమయంలో ఆ సమీపాన ప్రతి రోజూ ప్రభుత్వ ఖర్చుతో పుష్కరాలు జరిగినన్ని రోజులు బాణసంచా కాల్చారు.
బాణసంచా వినియోగం ఆచారం కాదు..
ఉత్సవాల సమయంలో ఎక్కువ మంది భక్తులు గుళ్లకు వచ్చే అవకాశం ఉన్న దృష్ట్యా ఆ సమయంలోనూ గుళ్లలోనూ, పరిసరాల్లో బాణసంచా వినియోగం నిషేధిస్తే మంచిదని భక్తులు, అధికారులు అభిప్రాయపడుతున్నారు. వేడుకల సమయంలో టపాసులు పేల్చడం ఒక సంప్రదాయంగా కొనసాగుతుంది తప్పితే, అదేమీ ఆచారం కాదని గుర్తు చేస్తున్నారు. పెద్ద ప్రమాదాలకు ఆస్కారమిచ్చే బాణసంచా వినియోగంపై ఉన్నతాధికారుల నుంచి కిందిస్థాయి ఈవో వరకు కఠినంగా వ్యవహరించాల్సిన అవసరముంది.