కాపులను బీసీల్లో చేర్చకపోతే ఉరేసుకుంటా
కాపు కార్పొరేషన్ చైర్మన్ రామానుజయ
నూజివీడు: ముఖ్యమంత్రి చంద్రబాబు భవిష్యత్‌లో కాపులను బీసీల్లో చేర్చకపోతే తాను నూజివీడులో అందరిముందు ఉరేసుకుంటానని కాపు కార్పొరేషన్ చైర్మన్ చలమలశెట్టి రామనుజయ చెప్పారు. నూజివీడులో ఆదివారం జరిగిన కాపు సంఘం కార్తీక వనసమారాధనలో ఆయన మాట్లాడారు. ఆయన చంద్రబాబును పొగుడుతుండటంతో విస్తుపోయిన కాపు సంఘస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ అసలు కాపులకు చంద్రబాబు ఏం చేశాడంటూ నిలదీశారు.
కాపులను బీసీల్లో చేరుస్తానని చెప్పి రెండున్నరేళ్లయినా చేర్చకుండా కమిషన్ పేరుతో కాలయాపన చేస్తున్న సంగతి తెలియదా అని ప్రశ్నించారు. కాపులను చంద్రబాబు ఎన్నికలపుడు ఓటుబ్యాంకుగా వాడుకున్నారు తప్పితే కాపులకు చేసిందేమీ లేదని స్పష్టంచేశారు. కాపు కార్పొరేషన్ రుణాలు కూడా ఎవరికీ రావడం లేదని, టీడీపీ నాయకులు సిఫార్సు చేసిన వారిలో కూడా కొందరికి మాత్రమే మంజూరవుతున్నాయని ధ్వజమెత్తారు. దీంతో కంగుతిన్న రామానుజయ వారికి సర్దిచెబుతూ వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు.
అయినా వారు శాంతించకపోవడంతో రామానుజయ మైక్ తీసుకుని.. మంజునాథ కమిషన్ నివేదిక ఇచ్చిన తరువాత కాపులను బీసీల్లో చేర్చడం ఖాయమని చెప్పారు. చంద్రబాబు కాపులను బీసీల్లో చేర్చకపోతే తాను నూజివీడులో అందరిముందు ఉరేసుకుంటానని ప్రకటించారు. మంజునాథ కమిషన్ ఇప్పటికే పది జిల్లాల్లో అభిప్రాయాలు సేకరించిందని, నివేదిక ఇచ్చిన తరువాత క్యాబినేట్‌లో ఆమోదించి కేంద్రప్రభుత్వానికి పంపుతారని ఆయన చెప్పారు.