స్పీకర్ ఫార్మెట్‌లోనే రాజీనామా చేశారు
- రాజీనామా చేశాకే శిల్పా చక్రపాణిరెడ్డి వైఎస్‌ఆర్‌సీపీలో చేరారు
- పార్టీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
హైదరాబాద్: ప్రజాస్వామ్య విలువలను కాపాడేందుకే శిల్పా చక్రపాణిరెడ్డి తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి.. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారని ఆ పార్టీ ఎమ్మెల్యే, సీనియర్ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పష్టం చేశారు. ప్రజాస్వామ్య విలువలను కాపాడేందుకు వైఎస్‌ఆర్ సీపీ పెద్దపీట వేస్తున్నదని తెలిపారు. శిల్పా చక్రపాణిరెడ్డి స్పీకర్ ఫార్మెట్‌లోనే తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారని వెల్లడించారు. సోమవారం ఆయన నంద్యాలలో విలేకరులతో మాట్లాడారు.
టీడీపీలో చేరిన 20మంది ఫిరాయింపు ఎమ్మెల్యేలతో ఎందుకు రాజీనామా చేయించలేదని సీఎం చంద్రబాబును పెద్దిరెడ్డి నిలదీశారు. ప్రజాస్వామ్య విలువలకు కట్టబడి పార్టీ మారిన 20 మంది ఎమ్మెల్యేలతో చంద్రబాబు రాజీనామా చేయించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ టీడీపీ ఎమ్మెల్యేలు టీఆర్‌ఎస్‌లో చేరితే.. జంతువులను కొన్నట్టు కొన్నారని చంద్రబాబు అన్నారని, మరి ఇక్కడ ఏ జంతువులను కొన్నట్టు ఈ ఎమ్మెల్యేలను కొనుగోలు చేశారని చంద్రబాబును ప్రశ్నించారు. ప్రజల మీద, ప్రజాస్వామ్యం మీద చంద్రబాబుకు నమ్మకం లేదని ఆయన దుయ్యబట్టారు.
టీడీపీ నేతలు అవాకులు, చెవాకులు పేలుతూ.. ప్రజలను మభ్యపెడుతున్నారని విమర్శించారు. ఎన్నికలంటేనే టీడీపీ నేతలు భయపడుతున్నారని, ఎన్నికలు రాగానే ఆగమేఘాల మీద అభివృద్ధి పనులకు శిలా ఫలకాలు వేసి.. ప్రజలకు తామేదో చేసినట్టు మభ్యపెడుతున్నారని విమర్శించారు.