సాక్షి, విజయవాడ: టీడీపీ హయాంలో చంద్రబాబు 30 లీజులు ఇచ్చి, ఉద్దేశపూర్వకంగా సరస్వతీ పవర్ ఇండస్ట్రీ లీజ్ రద్దు చేశారని పంచాయతీరాజ్ శాఖల మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. ఆయన బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. కోర్టు ఆదేశాల మేరకు తమ ప్రభుత్వం కేంద్ర నిబంధనల ప్రకారం లీజ్‌ను పునరుద్దరించిందని తెలిపారు. సరస్వతి పవర్ ఇండస్ట్రీ లీజ్ పొడిగింపును చంద్రబాబు ప్రశ్నించారని, వయసు మళ్లిన రాజకీయనేత అలా మాట్లాడటం బాధాకరం అన్నారు. ప్రభుత్వంపై బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. సర్వసాధారణంగా జరిగే ప్రక్రియను మీడియాను అడ్డుపెట్టుకొని దుష్ప్రచారం చేస్తున్నారని దుయ్యబట్టారు. (చంద్రబాబు తీరుపై మండిపడ్డ కన్నబాబు)
పనిపాటా లేక చంద్రబాబు కోడిగుడ్డుపై ఈకలు పీకుతున్నారని, గోరంతలను కొండంత చేసేందుకు ప్రయత్నిస్తున్నారని పెద్దిరెడ్డి ఎద్దేవా చేశారు. ఒక్క లీజుకే అర పేజీ రాసిన మీడియా చంద్రబాబు ఇచ్చిన 30 లీజ్‌లకి ఎంత రాయాలని ప్రశ్నించారు. నిబంధనల ప్రకారం బ్లీచింగ్‌ను ఐదు కోట్లకు కొనుగోలు చేశామని తెలిపారు. చెల్లింపులు కూడా ఇంకా పూర్తి స్థాయిలో జరగలేదని వెల్లడించారు. రూ.70 కోట్లు చెల్లించామని అసత్య ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. నాణ్యత పరిశీలన కొరకు ల్యాబ్‌కు పంపామని వ్యాఖ్యానించారు. (బాబు ఎందుకు ఓడిపోయాడో అతనికే తెలియదు)
ఏడాది తిరక్కముందే మేనిఫెస్టోను అమలు చేస్తున్న ప్రభుత్వం తమదని పెద్దిరెడ్డి తెలిపారు. నిమ్మగడ్డ వ్యవహారంలో రెండు వారాల తర్వాత సుప్రీంకోర్టు విచారణ చేస్తామని చెప్పిందన్నారు. తమకు వ్యతిరేకంగా తీర్పు వచ్చిందని ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. తమ పార్టీలో గెలిచిన ప్రజా ప్రతినిధులని పార్టీలో చేర్చుకొని మంత్రి పదవులిచ్చిన నీతిలేని మనిషి చంద్రబాబని నిప్పులు చెరిగారు. అనైతికంగా సీఎం వైఎస్ జగన్ ఎవరినీ పార్టీలో చేర్చుకోరని తెలిపారు. బెదిరించి ఎవరినీ తమ పార్టీలోకి చేర్చుకోవాల్సిన అవసరం లేదన్నారు. ప్రభుత్వ విధానాలు నచ్చి చేరతామంటే కాదనే పరిస్థితి లేదని పెద్దిరెడ్డి స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment