తోట్లవల్లూరు/పెనమలూరు, న్యూస్‌లైన్ : రాబోయే ఎన్నికల్లో తాను పెనమలూరు నియోజకవర్గం నుంచే పోటీ చేస్తానని రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు. మండలంలోని వల్లూరుపాలెంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత, సర్పంచ్ మాదల రంగారావు ఇంట్లో వివాహ కార్యక్రమంలో, పెనమలూరు మండలం తాడిగడపలో వంతెన ప్రారంభోత్సవంలో శనివారం ఆయన పాల్గొన్నారు.
ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ సీమాంధ్ర ప్రయోజనాలను పట్టించుకోకుండా ఏకపక్షంగా కాంగ్రెస్ తీసుకున్న విభజన నిర్ణయం బాధ కలిగిస్తోందన్నారు. పార్లమెంటులో బీజేపీతో కలిసి రాష్ట్రాన్ని విభజించటం దారుణమన్నారు. సీఎం కిరణ్ కొత్త పార్టీపై ఇంకా స్పష్టత రాలేదని చెప్పారు. ఆదివారం జరిగే సమావేశంలో ఒక అభిప్రాయానికి వచ్చే అవకాశముందన్నారు. హైదరాబాద్‌లా సీమాంధ్ర రాజధానిని అభివృద్ధి చేయటం ఇప్పట్లో సాధ్యపడేపని కాదన్నారు.
రాజధానికి విజయవాడ అనుకూలం...
విజయవాడ నగరం రాజధానికి అన్ని విధాలా అనుకూలంగా ఉంటుందని సారథి చెప్పారు. అతి పెద్ద రైల్వే జంక్షన్, ఇంటర్నేషనల్ స్థాయికి ఎదుగుతున్న విమానాశ్రయం, విజయవాడను తాకుతూ వెళుతున్న ప్రధాన రహదారులు, నీటి వసతి, అభివృద్ధి చేసుకుంటే అందుబాటులో ఉన్న మచిలీపట్నం పోర్టు వంటి సౌకర్యాలు మనకు ఉన్నాయన్నారు.
ఆగిరిపల్లి, ముసునూరు, బాపులపాడు మండలాల్లో సుమారు 18 వేల ఎకరాలకు పైగా ప్రభుత్వ భూములు ఉన్నాయని, రాజధాని నిర్మాణానికి అన్ని విధాలా విజయవాడ అనుకూలంగా ఉంటుందని ఆయన వివరించారు. వైద్య రంగంలో కూడా విజయవాడ హైదరాబాద్‌కు దీటుగా ఉందన్నారు. ఇక్కడ కొత్తగా సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి ఏర్పాటుకు రూ.150 కోట్లు ఇవ్వటానికి ప్రభుత్వం అంగీకరించినట్లు చెప్పారు. రానున్న ఎన్నికల్లో ఏ పార్టీ తరఫున పోటీ చేస్తున్నారని అడగగా కార్యకర్తలతో సమావేశమై భవిష్యత్ కార్యాచరణపై ఒక అవగాహనకు రానున్నట్లు వెల్లడించారు.
పెనమలూరు నుంచే పోటీ చేస్తా : సారథి
Published Sun, Feb 23 2014 2:44 AM | Last Updated on Fri, May 25 2018 9:12 PM
Advertisement
Advertisement