పెన్షన్ కుట్ర
- తనిఖీల్లో అనర్హులు.. 20,220 మంది
- జాబితా అప్‌లోడ్ చేశాక నిలిపివేసినవి 26,788
- ఆన్‌లైన్‌లోఅప్‌లోడ్ కానివి 1448
- పరిశీలనకు ఆపేసిన వితంతు పెన్షన్లు 9,397
పెన్షన్ల భారాన్ని తగ్గించుకోడానికి ప్రభుత్వం అనేక ఎత్తుగడలు వేస్తోంది. లబ్ధిదారుల సంఖ్యను కుదించడానికి ఉన్న దారులన్నింటినీ అన్వేషిస్తోంది. జిల్లాలో 25 నుంచి 30 శాతం రద్దు చేయాలని నిర్దేశించినట్టు తెలుస్తోంది. పెన్షన్ కమిటీలు సైతం అనేక సందేహాలు వ్యక్తం చేస్తూ వేలాది మందికి చెల్లింపులు కాకుండా నిలిపివేశారు. కొత్త పెన్షన్ల కోసం దరఖాస్తులు స్వీకరిస్తున్నామంటూనే.. అందులో సగం మందిని అనర్హులుగా గుర్తించిన వారి వివరాలను అప్‌లోడ్ చేసే అవకాశం లేకుండా ఆన్‌లైన్ వ్యవస్థను స్తంభింప చేస్తున్నారు. అన్ని రకాలుగా పెన్షన్ల సంఖ్యను తగ్గించాలని ప్రభుత్వం అనేక కుట్రలు పన్నుతోంది.
విశాఖ రూరల్ : జిల్లాలో సెప్టెంబర్ నెల వరకు అన్ని రకాల పెన్షన్లు కలిపి 3,21,226 ఉన్నాయి. వీటి సంఖ్యను తగ్గించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అనర్హులు పేరుతో 20 నుంచి 30 శాతం మంది లబ్ధిదారులను జాబితా నుంచి తొలగించడానికి కమిటీలు వేయాలని అధికారులను ఆదేశించింది. ఈ ప్రకారం జిల్లా అధికారులు కమిటీలు ఏర్పాటు చేసి నాలుగు రోజుల పాటు తనిఖీలు నిర్వహించారు. ఇందులో 20,220 మందిని అనర్హులుగా గుర్తించి తొలగించారు.
తక్కువ వయసు పేరుతో 2413, వితంతువులు కాదంటూ 746, వికలాంగులు కాదని 350, చేనేత కార్మికులు కాదని 36, కల్లుగీత కార్మికులు కాదని 16, బీపీఎల్ కాదంటూ 2400, వేరొక పింఛను పొందుతున్నారంటూ 2390, చనిపోయారంటూ 7307, పింఛనుదారులు పంచాయతీలో లేరంటూ 4562 ఇలా మొత్తంగా 20,220 మందిని తొలగించారు. దీంతో జిల్లాలో 3,01,006 మంది లబ్ధిదారుల్లో 1448 మంది వివరాలను ప్రభుత్వం అప్‌లోడ్ చేసే అవకాశం కల్పించలేదు. దీంతో 2,94,627 మందికి మాత్రమే పెన్షన్లు వస్తాయని భావించారు. కానీ ప్రభుత్వం అందులో కూడా వేలాది మంది విషయంలో సందేహాలు వ్యక్తం చేస్తూ మరోసారి పరిశీలించాలంటూ వాటిని నిలిపివేసింది.
అప్‌లోడ్ చేశాక నిలిచిపోయినవి : జిల్లాలో కమిటీల తనిఖీల్లో కేవలం 6 శాతం మాత్రమే అనర్హులుగా నిర్ధారించారు. కానీ ఈ సంఖ్యను మరింత పెంచాలని నిర్ణయించిన ప్రభుత్వం మరోసారి పరిశీలించాలంటూ 26,788 మంది పెన్షన్లు ఆపేసింది. వీటిలో 4466 మంది వితంతుల పెన్షన్లు కూడా రద్దు చేసింది. వారి భర్తల మరణ ధ్రువపత్రాలు, వయసు, ఇతర కారణాల పేరుతో వారిని జాబితాల నుంచి తొలగించింది. అలాగే లబ్ధిదారులకు 5 ఎకరాలు భూమి ఉందంటూ, రేషన్‌కార్డు, ఆధార్‌కార్డుల్లో వివరాలు సక్రమంగా లేవంటూ మరికొంత మందికి పింఛన్లు మంజూరు చేయలేదు.
వాస్తవానికి కమిటీలు ప్రతీ ఇంటికి వెళ్లి తనిఖీలు చేసి తుది జాబితాను సిద్ధం చేస్తే దానిని అధికారులు అప్‌లోడ్ చేశారు. కానీ ప్రభుత్వం కేవలం ఆన్‌లైన్ ఉన్న వివరాలను ఆధారంగా ఏ విధంగా కమిటీల తనిఖీల్లో లోటుపాట్లు గుర్తించిందో ఎవరికీ అర్థం కాని ప్రశ్న. అలాగే సమయం మించిపోయిందంటూ ఆన్‌లైన్ వ్యవస్థను స్తంభింపచేసింది. దీంతో మరో 1448 మంది వివరాలు అప్‌లోడ్ చేసే అవకాశం లేకుండా పోయింది. దీంతో ప్రస్తుతం జిల్లాలో పెన్షనర్లు 2,63,373 మంది మాత్రమే ఉన్నట్లు తేల్చారు. వీరికి మాత్రమే అక్టోబర్ నెలకు సంబంధించి ప్రభుత్వం రూ.26.93 కోట్లు మంజూరు చేసింది.
నా పింఛన్ తొలగించారు
నాది కశింకోటలోని ఉప్పునీటి దిబ్బ ప్రాంతం. నా రెండు చేతులు వంకర తిరిగి పోయాయి. కాళ్లతో నడవలేను. తల్లి సాయం లేకుండా ఎక్కడికీ వెళ్లలేను. మాటలు కూడా సరిగ్గా రావు. తల్లి రమణమ్మే ఆలనా పాలనా చూస్తోంది. అర్హత ఉన్నా నా పింఛన్ తొలగించారు. మా అమ్మ వితంతు పింఛన్ కూడా తీసేశారు. అధికారులు పట్టించుకోవాలి.
- యలమంచిలి వాణి, వికలాంగురాలు
కొత్తవి డౌటే
పెన్షన్ తనిఖీల్లో పాత వాటితో పాటు కొత్తవాటి కోసం కూడా కమిటీలు దరఖాస్తులు స్వీకరించాయి. ఇందులో 44 వేల మంది దరఖాస్తులు చేసుకున్నారు. పరిశీలించిన అధికారులు 24,045 మందిని అర్హులుగా గుర్తించారు. వీరి వివరాలు ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయగా ప్రభుత్వం కేవలం 11,664 మందిని మాత్రమే అర్హులుగా నిర్ధారించింది. కమిటీలు, అధికారులు గుర్తించినప్పటికీ ప్రభుత్వం తిరస్కరణతో కొత్తగా 12,381 మంది పెన్షన్‌కు నోచుకోలేని దుస్థితి ఏర్పడింది.